హైదరాబాద్, మే 15 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలో పరిషత్ ఎన్నిక ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు. మూడు విడతల పోలింగ్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, మూడుచోట్ల సాంకేతిక కారణాలు, సిబ్బంది తప్పిదాలతో రీపోలింగ్ జరిగిందని తెలిపారు. ఈ నెల 27న ఓట్ల లెక్కింపు జరుగుతుందని అన్నారు. పాత సభ్యుల పదవీకాలం జులై 3 వరకు ఉండటంతో కొత్తసభ్యులు ఆ తరువాతే ప్రమాణం చేస్తారని పేర్కొన్నా రు.

జులై 5 తరువాత ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నిక ఉంటుందని చెప్పారు. పరిషత్ ఎన్నికల్లో మొత్తం 1,56,02,845 మంది ఓటర్లు ఉండగా 1,20,86,385 మంది ఓటేశారని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే పరిషత్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగిందన్నారు. అయితే పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే మాత్రం తగ్గిందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సిబ్బంది, పోలీస్‌శాఖ, బరిలో నిల్చిన అభ్యర్థులు, ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా ప్రస్తుత ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం జులై 3న ముగుస్తుందని నాగిరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికయ్యే సభ్యులు జులై 4న పదవీ బాధ్యతలు చేపడుతారని, జులై 5 తర్వాత ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఆగస్టు 5 తర్వాత ఎంపీపీ, ఆగస్టు 6 తర్వాత జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తామన్నారు. మొత్తం 5,817 ఎంపీటీసీ స్థానాలు, 538 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించామని, దీనిలో నాలుగు జెడ్పీటీసీలు, 158 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయని నాగిరెడ్డి తెలిపారు. కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 1, జగిత్యాలలో 2, నల్లగొండలో 1 జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమయ్యాయని, ఈ నాలుగు చోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులే ఎన్నికయ్యారన్నారు. 158 ఎంపీటీసీ స్థానాల్లో 152 టీఆర్‌ఎస్, కాంగ్రెస్ 3, స్వతంత్రులు 3 చోట్ల ఏకగ్రీవమయ్యారన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా గగ్గలపల్లి ఎంపీటీసీ పరిధిలో రూ.10 లక్షల నగదు దొరికిన సీరియస్‌గా తీసుకుని ఎన్నిక వాయిదా వేశామన్నారు. డబ్బులు పంచుతూ దొరికిన వ్యక్తిపై క్రిమినల్ కేసుచేశామని, నేరం రుజువైతే ఎన్నికల్లో పోటీచేయకుండా ఆరేళ్లపాటు అనర్హత వేటు వేస్తామని చెప్పారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 536 స్ట్రాంగ్ రూంల్లో బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరిచామని ఎస్‌ఈసీ తెలిపారు. ఈ నెల 27న 123 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామన్నారు. మూడుదశల్లో లెక్కింపు ప్రక్రియ ఉంటుందని, మొదటి దశలో బ్యాలెట్‌పేపర్లు, సదరు బూత్‌లోఉన్న ఓటర్ల వివరాలతో లెక్కిస్తారని, ఇది పోలింగ్‌కేంద్రాల వారీగా జరుగుతుందన్నారు. ఆ తర్వాత వాటిని బండిల్ చేస్తారని, అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీలవారీగా విడదీసి 25 బ్యాలెట్ పత్రాలను ఒకబండిల్‌గా చేస్తారన్నారు.

రెండోదశలో ఎంపీటీసీ ఎన్నికకు కౌంటింగ్ మొదలుపెడుతారని, ఒక్కో ఎంపీటీసీ స్థానానికి రెండుటేబుళ్ల, రెండురౌండ్లు ఉంటాయని, ఒక్కో రౌండ్‌లో వెయ్యి ఓట్లు లెక్కిస్తామని తెలిపారు. ప్రతి ఎంపీటీసీ అభ్యర్థి ఇద్దరు కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాలన్నారు. అభ్యంతరాలున్న బ్యాలెట్ పత్రాలపై రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమన్నారు. మొత్తం 978 కౌంటింగ్ హాళ్లను ఏర్పాటుచేశామని, 11,882 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 23,647 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించామని వెల్లడించారు.

మరోవైపు, రాష్ట్రంలో మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీకాలం జులైతో ముగుస్తుందని ఎస్‌ఈసీ నాగిరెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీల ఎన్నికలకు గతేడాది జూన్ నుంచే ఏర్పాట్లు చేస్తున్నామని, అయితే కొత్తచట్టం, మార్పులు, చేర్పులు, వార్డుల విభజన తర్వాత తుదిఓటరు జాబితాలకు రిజర్వేషన్లను ప్రభుత్వమే ఖరారుచేస్తుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి రిజర్వేషన్లు అందాక మున్సిపాలిటీల్లో ఎన్నికలను నిర్వహిస్తామని వెల్లడించారు.