అమరావతి, మే 16 (న్యూస్‌టైమ్): కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయతపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈసీఐపై తన నిరసన వ్యక్తంచేశారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం ఏకపక్షంగా పనిచేస్తోందన్న విమర్శల నుంచి ఈసీఐ బయటపడాల్సిన అవసరం ఉందన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ నేతలు, అమిత్‌ షా ఫిర్యాదులపై ఎన్నికల సంఘం తక్షణమే స్పందించడం, అక్కడి అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నేతల ఫిర్యాదులను విస్మరించడం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలని 22 ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడిగా విజ్ఞప్తి చేసినా ఎన్నికల సంఘం ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. నరేంద్రమోదీకి పదే పదే క్లీన్‌చిట్‌లు ఇవ్వడం, భాజపా చేసిన తప్పుడు ఫిర్యాదులపై కూడా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం ఆందోళనకు గురి చేస్తుందన్నారు.

ప్రతిపక్షాల ఫిర్యాదుల్లో వాస్తవం ఉన్నప్పటికీ కావాలనే చర్యలు చేపట్టకపోవడం వంటివన్నీ కేంద్ర ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై అనుమానాలను స్పష్టంగా రేరెత్తిస్తోందన్నారు. ఎన్నికల సంఘం చిత్తశుద్దినే సందేహాస్పదం చేస్తోందని, ప్రతిపక్షం చేసిన ఫిర్యాదులపై కూడా స్పందించి తగిన చర్యలు తీసుకోవడం ద్వారా రాజ్యాంగబద్దంగా సంక్రమించిన అధికారాలను వినియోగించి ఎన్నికల సంఘం విశ్వసనీయతను నిరూపించుకోవాలన్నారు.