న్యూఢిల్లీ, మే 17 (న్యూస్‌టైమ్): సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసీఐ వ్యవహార తీరును ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా, అందుబాటులో ఉన్న ఇతర కమిషనర్లను కలిశారు. ప్రధానంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్‌ బూత్‌లలో రీపోలింగ్‌కు ఆదేశించడంపై ఆయన అభ్యంతరాలు తెలిపారు. ముందుగా చంద్రగిరిలో రీపోలింగ్‌ వ్యవహారంపై తాను రాసిన లేఖను సీఈసీకి అందజేసిన చంద్రబాబు, తొమ్మిది కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలంటూ గతంలో తెదేపా ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోని ఈసీ, ఎన్నికలు జరిగిన 34 రోజుల తర్వాత రీపోలింగ్‌కు ఎలా ఆదేశిస్తారని నిలదీశారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఈ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలు ఏకపక్షంగా, వివాదాస్పదంగా ఉన్నాయని, ఈసీ పని తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలపాల్సి రావడం చాలా దురదృష్టకరమని అన్నారు. 24 ఏళ్లుగా తాను తెదేపా అధ్యక్షుడిగా జాతీయ రాజకీయాలను చూస్తున్నానని, ఇలాంటి ఎన్నికల సంఘాన్ని మాత్రం ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ఏపీలో ఫారం -7 పత్రాలు ఇష్టానుసారంగా దాఖలు చేసిన నిందితుల ఐపీ అడ్రస్‌లు ఇవ్వాలని కోరినా ఈసీ ఇప్పటికీ స్పందించలేదన్నారు. ఏపీలో ఎన్నికలు జరిగిన 34 రోజుల తర్వాత రీపోలింగ్‌కు ఆదేశాలు ఎలా జారీ చేస్తారని నిలదీసినట్టు సీఎం మీడియాకు వివరించారు.

సాధారణంగా ఎన్నికలు జరిగిన మరుసటి రోజు రిటర్నింగ్‌ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా రీపోలింగ్‌ జరుపుతారని, కానీ సుమారు నెల రోజులు దాటినప్పటికీ ఏపీలో వైకాపా ఫిర్యాదు మేరకు ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఎలా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ, అమిత్‌షా చెప్పిన ప్రకారమే ఈసీ నడుచుకుంటోందన్నారు. జాతిపిత మహాత్మా గాంధీని అవమానపరిచేలా భోపాల్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ వ్యాఖ్యలు చేస్తే ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు.

మరోవైపు, ఎన్నికలు పూర్తయిన 34 రోజుల తర్వాత ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని అయిదు పోలింగ్‌ బూత్‌ల్లో రీ పోలింగ్‌ పెట్టాలని ఆదేశించడం అనైతికం, రాజ్యాంగ విరుద్ధమంటూ, నిన్న ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోడాను కలిసిన ప్రతిపక్ష నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సీఈసీని కలిసిన వారిలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అహ్మద్‌ పటేల్‌, జైరాం రమేశ్‌, అభిషేక్‌ మను సింఘ్వీ, తెదేపా నేతలు సీఎం రమేశ్‌, కంభంపాటి రామ్మోహన్‌రావు, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సంజయ్‌ సింగ్‌లు ఉన్నారు. అంతకముందు, చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని 5 పోలింగ్‌ కేంద్రాల్లో మే 19న రీపోలింగ్‌ నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయంపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు లేఖ కూడా రాశారు.

అదే ప్రతిని శుక్రవారం నాటి భేటీ సందర్భంగా ఈసీఐకి అందజేశారు. వివిధ పార్టీల వినతులన్నీ పరిశీలించి ఒకేరోజు రీపోలింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందని, ఈ నెల 6న కొన్ని కేంద్రాల్లో రీపోలింగ్‌ పూర్తి చేశాక మరో ఐదు కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. వైకాపా ఎప్పుడు ఫిర్యాదుచేస్తే అప్పుడు, రీపోలింగ్‌ను ఈసీ దశలవారీగా నిర్వహిస్తుందా? రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటినుంచీ ఈసీ వ్యవహారశైలి పక్షపాతంగానే ఉందని, తెదేపా ఫిర్యాదుచేస్తే బుట్టదాఖలు చేస్తోందని ధ్వజమెత్తారు.

వైకాపా ఫిర్యాదుచేస్తే వెంటనే స్పందిస్తోందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. అమిత్‌షా ఫిర్యాదుమేరకు పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ప్రచారాన్ని ఒకరోజు ముందే ముగించాలని ఈసీ ఆదేశించడం దారుణమని, నిజానిజాలను విచారించకుండా ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 126వ సెక్షన్‌ను ఉల్లంఘించిందని చంద్రబాబు పేర్కొన్నారు.

ఈసీ ఇప్పటికైనా కళ్లుతెరిచి విపక్షాల ఫిర్యాదులపైనా చర్యలు తీసుకోవడం ద్వారా నిష్పాక్షికతను నిరూపించుకోవాల్సి ఉందన్నారు. 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్‌లు లెక్కించాలన్న విపక్షాల డిమాండ్‌ను పునఃపరిశీలించాలని, తెదేపా కోరిన కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here