న్యూఢిల్లీ, మే 17 (న్యూస్‌టైమ్): రెండోసారి అధికారం దక్కించుకోవడంపై ప్ర‌ధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వవాసం వ్యక్తంచేశారు. లోక్‌సభ సాధారణ ఎన్నికల చివరి విడత ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెరపడిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో కలిసి ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మోదీ రెండోసారి మరింత పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తామన్న ధీమా వెలిబుచ్చారు. ప్ర‌పంచాన్ని శాసించే విధంగా భారత్ ఎద‌గాల‌ని ఆకాంక్షించిన ఆయన ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర స‌త్తా ఉంటే, ఎన్నిక‌లు, ఐపీఎల్ టోర్నీ ఒకేసారి జ‌ర‌గ‌డం సాధ్యం అవుతుంద‌ని వ్యాఖ్యానించారు.

గ‌త రెండు సార్లు ప్ర‌భుత్వాలు ఎన్నిక‌ల వేళ ఐపీఎల్ నిర్వ‌హించ‌లేక‌పోయాయ‌న్నారు. ప్ర‌భుత్వం బ‌లంగా ఉంటే ఐపీఎల్, రంజాన్‌, ప‌రీక్ష‌లు అన్నీ స‌వ్యంగా సాగుతాయ‌న్నారు. అధికారంలో ఉన్న ప్ర‌భుత్వం పూర్తి మెజారిటీతో రెండోసారి మ‌ళ్లీ అధికారంలోకి రాలేదని, కానీ ఈసారి మాత్రం అది సాధ్యం కాబోతుంద‌ని జోస్యం చెప్పారు. దేశ పౌరుల‌కు, మీడియాకు థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. మ‌రింత పెద్ద మెజారిటీతో మ‌ళ్లీ 2019లో అధికారంలోకి వ‌స్తామ‌న్నారు. 2014లో ఎన్నిక‌ల ఫ‌లితాలు మే 16వ తేదీన వ‌చ్చాయ‌ని, మే 17వ తేదీన భారీ న‌ష్టం జ‌రిగింద‌ని, ఇవాళ కూడా మే 17వ తేదీ అని, కాంగ్రెస్ గెలుస్తుంద‌ని బెట్టింగ్ పెట్టిన‌వాళ్లంతా భారీ న‌ష్టాన్ని చ‌విచూశార‌న్నారు.

గత ఐదేళ్ల కాలంలో నరేంద్ర మోదీ మీడియా సమావేశంలో మాట్లాడటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా ఐదేళ్లు దేశానికి సేవ చేసే అవకాశమిచ్చిన ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మన ప్రజాస్వామ్యం ఎంతో విలువైనదని, దీంతో ప్రపంచాన్నే మెప్పించామని మోదీ అన్నారు. ప్రజలకోసమే తను ఆలోచిస్తున్నానంటూ ఎన్నికల ప్రచార సభల్లోని మాటలను ఆయన గుర్తు చేశారు. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే గొప్పదేశభక్తుడంటూ తమ పార్టీ భోపాల్ ఎంపీ అభ్యర్ధిని సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ చేసిన వ్యాఖ్యలపైనా మోదీ స్పందించారు. ఆ వ్యాఖ్యలతో పూర్తిగా విభేదిస్తున్నామని స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని చెప్పారు.

భాజాపా అధ్యక్షుడిగా అమిత్‌షా మీడియా సమావేశం నిర్వహించారనీ, ప్రధాని హోదాలో విలేకరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానమివ్వలేనని చెప్పారు. అంతకుముందు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో భాజపా చేపట్టిన వివిధ ప్రచార కార్యక్రమాలు, గత ఐదేళ్లలో భాజపా ప్రభుత్వం సాధించిన అభివృద్ధి గురించి వివరించారు. మ‌ళ్లీ మోదీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తుంద‌ని విశ్వాసం ఉంద‌ని షా అన్నారు. భారీ మెజారిటీతో మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌ని బీజేపీ అధ్య‌క్షుడు తెలిపారు. జ‌న్ సంఘ కాలం నుంచి కూడా బీజేపీ ఓ వ్య‌వ‌స్థ‌గా ప‌నిచేస్తోంద‌న్నారు.

2014లో దేశ ప్ర‌జ‌లు చ‌రిత్రాత్మ‌క తీర్పునిచ్చార‌న్నారు. మొద‌టి సారి కేంద్రంలో కాంగ్రెస్ లేని పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింద‌న్నారు. ‘ఫిర్ ఏక్ బార్ మోదీ స‌ర్కార్’ అన్న నినాదం ప్ర‌జ‌ల నుంచే వ‌చ్చింద‌ని షా తెలిపారు. బీజేపీపై ఇప్పుడు ప్ర‌జ‌ల్లో మ‌రింత విశ్వాసం పెరిగింద‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here