న్యూఢిల్లీ, మే 17 (న్యూస్‌టైమ్): స్వయం ప్రతిపత్తితో పనిచేయాల్సిన ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ఈసీఐ) పాత్ర‌పై పలు అనుమానాలు వ్య‌క్తం చేశారు. అనేక అంశాల‌పై తనతో చ‌ర్చించేందుకు నరేంద్ర మోదీ ఎందుకు సిద్ధంకాలేద‌ని రాహుల్ ఈ సందర్భంగా ప్ర‌శ్నించారు.

ప్ర‌ధాని మోదీ మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించ‌డం అసాధార‌ణ విష‌య‌మ‌ని తెలిపారు. రాఫెల్ అంశంపై చ‌ర్చ‌కు ర‌మ్మ‌న్నా ఎందుకు రాలేదని, మోదీ, బీజేపీ వ‌ద్ద లెక్క‌లేనంత డ‌బ్బు ఉంద‌ని, వాళ్లు మార్కెటింగ్ కూడా ఎక్కువే చేశార‌న్నారు. తమ క‌న్నా బీజేపీ ఎక్కువ ప్ర‌చారం చేసింద‌ని, అది సుమారు 1-20 శాతం తేడాతో ఉంద‌ని, కానీ తమ ద‌గ్గ‌ర కేవ‌లం స‌త్యం మాత్ర‌మే ఉంద‌ని, స‌త్య‌మే విజ‌యం సాధిస్తుంద‌ని రాహుల్ అన్నారు. మొత్తానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యంగా రాహుల్‌గాంధీ మరోసారి విమర్శల వర్షం కురిపించారు.

‘‘మోదీ మీడియా సమావేశం గురించి ఎలాంటి ముందస్తు సమాచారం లేదు. రఫేల్‌ అంశంపై చర్చకు రావాలని ఆయనకు నేను ఎన్నోసార్లు సవాల్‌ విసిరాను. కానీ దానికి ఆయన ఎన్నడూ స్పందించలేదు. నాతో చర్చకు మోదీ ఎందుకు సిద్ధంగా లేరని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఆయన ప్రెస్‌మీట్‌లో ఉన్నారుగా దీనికి సమాధానం చెప్పమనండి. ఇక మీడియా వాళ్లు కూడా నన్ను కఠినమైన ప్రశ్నలు అడుగుతూ మోదీని మాత్రం దుస్తులు, మామిడి పండ్ల గురించి ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కంటే మోదీ, భాజపా వద్ద చాలా రెట్లు డబ్బు ఎక్కువగా ఉంది. కానీ మా దగ్గర నిజం మాత్రమే ఉంది. ఆ నిజమే గెలుస్తుంది’’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు.

తాజా ఎన్నికల్లో ఈసీ పారదర్శకంగా వ్యవహరిస్తోందని, మోదీ షెడ్యూల్‌ ప్రకారమే ఉత్తర్వులు ఇస్తోందని రాహుల్‌ దుయ్యబట్టారు. మోదీ, షా సిద్ధాంతాలు గాంధీ సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకమన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికి మోదీ మరోసారి ప్రయత్నిస్తున్నారని, అయితే అది జరగదని ఎద్దేవాచేశారు. అంతకముందు రాహుల్ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యంగా ట్వీట్ చేశారు. ‘గాడ్ కే’ లవర్స్ కాదు, ‘గాడ్ సే’ లవర్స్’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.

‘‘నాకు ఇప్పుడు అర్థమయింది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ‘గాడ్ కే’ లవర్స్ కాదు.. వాళ్లు ‘గాడ్ సే’ లవర్స్’’ అంటూ తన ట్విటర్ అకౌంట్ ద్వారా వ్యంగ్యంగా స్పందించారు. జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే దేశభక్తుడంటూ కామెంట్ చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రగ్యా సింగ్ థాకూర్ వ్యాఖ్యలపై ఆయన ఈ ట్వీట్ చేశారు. బీజేపీ అధికార ప్రతినిధి అనిల్ సౌమిత్రా కూడా మహాత్మా గాంధీ పాకిస్థాన్ జాతిపిత అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తన ఫేస్‌బుక్ పేజీలో పాకిస్థాన్ జాతిపిత మహాత్మా గాంధీ అంటూ పోస్టు పెట్టారు. అయితే వీళ్ల వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ప్రగ్యా సింగ్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ కూడా మండిపడ్డారు. అనిల్ సౌమిత్రాను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here