అమరావతి, మే 17 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన 34 రోజుల తర్వాత చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరపాలన్న నిర్ణయాన్ని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన గోపాలకృష్ణ ద్వివేది సమర్ధించుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ అంశంపై ఎట్టకేలకు అధికారికంగా స్పందించిన సీఈవో రీపోలింగ్‌కు ఆదేశిస్తూ ఈసీఐ తీసుకున్న నిర్ణయం సరైందేనన్నారు. ఎన్నికలు జరిగిన (ఏప్రిల్ 11వ తేదీ) నాటి అక్కడి వీడియో దృశ్యాలు చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమైందన్నారు. పోలింగ్‌లో అక్రమాలు జరిగినట్టు నిర్థారణకు వచ్చామని, ఈమేరకు పోలింగ్ అధికారి, సహాయ పోలింగ్ అధికారులను సస్పెండ్‌ చేస్తున్నట్టు ద్వివేది చెప్పారు.

అదే విధంగా అక్కడి అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామన్నారు. ‘‘అయినా, దీనిని మరీ భూతద్దంలో పెట్టి చూస్తున్నారు గానీ, రెండుసార్లు రీపోలింగ్‌ జరగకూడదని ఎక్కడైనా ఉందా? మా దృష్టికి వచ్చినప్పుడు పట్టించుకోకుండా పక్కన పెట్టాలా’’ అని సీఈవో మీడియాను ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసిన కేంద్రాల్లోనూ వీడియో దృశ్యాలు పరిశీలించామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పరిశీలనకు 200 మంది కేంద్ర పరిశీలకులు వస్తారని ద్వివేది తెలిపారు. ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక పరిశీలకుడి చొప్పున నియమించినట్టు వెల్లడించారు.

దేశంలో అత్యంత సున్నితమైన ఎన్నికల రాష్ట్రం ఏపీ అని, ఒడిశాలో ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక పరిశీలకుడు ఉంటారని ద్వివేది వివరించారు. దేశంలో ప్రతి పార్లమెంట్‌ స్థానానికి ఒక పరిశీలకుడిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించిందన్నారు. చంద్రగిరిలో రీపోలింగ్‌ నేపథ్యంలో ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి 250 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తామని ద్వివేది వెల్లడించారు. కాగా, చిత్తూరు జిల్లాలో మరో రెండు కేంద్రాల్లో రీపోలింగ్‌కు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రద్యుమ్న సిఫార్సు చేశారు.

మూడు జిల్లాల్లోని ఏడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 19 చోట్ల రీపోలింగ్‌ కోసం ఇప్పటికే తెదేపా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వీడియో దృశ్యాలు పరిశీలించిన తర్వాత 310, 323 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు జిల్లా ఎన్నికల అధికారి (డీఈవో) సిఫారసు చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అనుమతి కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) కార్యాలయం ఎదురుచూస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here