న్యూఢిల్లీ, మే 17 (న్యూస్‌టైమ్): దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పర్వం దాదాపు తుది అంకానికి చేరుకుంది. ఆఖరివిడత ఎన్నికల పోలింగ్‌లో భాగంగా ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెరపడింది. తుదివిడత పోలింగ్‌ జరిగే రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు ప్రచార గడువు సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఈ నెల 19న లోక్‌సభ ఎన్నికల తుది విడత (7వ విడత) పోలింగ్‌ జరగనుంది. ఏడో విడతలో 8 రాష్ట్రాల్లోని 53 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగనుంది.

ఈ నెల 19న సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నెల 23న లోకసభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. చివరి విడతలో ఉత్తరప్రదేశ్‌లో 13 స్థానాలు, పంజాబ్‌లో 13 స్థానాలకు పోలింగ్‌ కొనసాగనుంది. యూపీలో మొత్తం 13 స్థానాల్లో 167 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తుది విడతలో పశ్చిమబెంగాల్‌లోని 9 స్థానాలకు పోలింగ్ జరగనుంది. బీజేపీ-టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణతో పశ్చిమ బెంగాల్‌లో గురువారమే ఎన్నికల ప్రచారానికి తెరపడిన విషయం తెలిసిందే. తుదివిడతలో బీహార్‌లో 8 పార్లమెంట్ స్థానాలకు ఓటింగ్ జరగనుంది.

మధ్యప్రదేశ్‌లో 8 స్థానాలు, హిమాచల్ ప్రదేశ్‌లో 4, జార్ఖండ్‌లో 3 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా, చివరి విడత పోలింగ్‌ బరిలో బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి పోటీలో ఉన్నారు. బీజేపీ తరపున అమృత్‌సర్ నుంచి కేంద్రమంత్రి హర్ దీప్ సింగ్ పూరి, గురుదాస్‌పూర్ నుంచి బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్, భటిండా నుంచి కేంద్రమంత్రి హరిసిమ్రత్ కౌర్ బాదల్ పోటీలో ఉన్నారు. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, శత్రుఘ్నసిన్హా తదితరులు కూడా ఈ విడతలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here