హైదరాబాద్, మే 18 (న్యూస్‌టైమ్): మహానగర శివారులో దారుణం చోటు చేసుకుంది. ఉతికిన బట్టలు ఆరేస్తూ విద్యుదాఘాతానికి గురై తల్లీకూతురు మృతి చెందారు. మరో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్ నగర శివారు బాలాపూర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని షాహీన్‌నగర్‌లో జరిగింది. ఉదయం సల్మా బేగం (34) తన ఇంట్లో ఉతికిన బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు ఇనుపవైరులో విద్యుత్ ప్రవహించింది. బట్టలు ఆరేస్తున్న ఇనుప తీగకు సర్వీసు వైరు నుంచి విద్యుత్‌ ప్రవహించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో సల్మా బేగంతోపాటు కూతురు సానియా(9) అక్కడికక్కడే మృతి చెందారు, మరో ఇద్దరు సంరీన్ (13), ముస్కాన్ (11)లను స్థానికులు రక్షించి సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి సంఘటన స్థలికి వెళ్లారు.

అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.