కన్నేపల్లి (జయశంకర్ భూపాల్‌పల్లి), మే 19 (న్యూస్‌టైమ్): గోదావరి నదీ తీరాన ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని అధ్బుతమైన పుణ్య క్షేత్రంగా, పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు వెంటనే 100 కోట్ల నిధులు కేటాయించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించారు. తెలంగాణకు ప్రాణధార అయిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్ట్ పూర్తవుతున్న నేపథ్యంలో ఆలయాన్ని, కాళేశ్వరం ప్రాంతాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉన్నదని సీఎం పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా కుటుంబ సమేతంగా, ఉన్నతాధికారులతో కలిసి ఆదివారం కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని, పార్వతి మాతని దర్శించుకున్నారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలోనే అర్చకులతో కాసేపు కూర్చొని మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాముఖ్యత దృష్ట్యా ఇకనుండి ఆలయానికి, ఈ ప్రాంతానికి ప్రజలు లక్షల సంఖ్యలో తరలివస్తారని దానికి అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు 600 ఎకరాల స్థలాన్ని సేకరించాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్, ఫారెస్ట్ స్థాలాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. కళ్యాణ మండపంతో పాటు పెద్ద స్వాములు ఎవరైనా వచ్చినప్పుడు ప్రవచనాలు చెప్పడానికి వీలుగా ఆలయ నిర్మాణాన్ని విస్తరించాల్సి వుంటుందని సీఎం అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తవుతున్న సందర్భంలో ఒక మహోత్తరమైన యాగాన్ని నిర్వహించే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. యజ్ఞ యాగాదులకు గోదావరి తీరంలోని ఆలయ ప్రాంతం అణువుగా ఉంటుందని, ఆలయ పునర్నిర్మాణానికి శృంగేరి పీఠాధిపతి శ్రీ భారతి తీర్థ స్వామిని ఆహ్వానించినట్లు సీఎం తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీలు అన్ని పూర్తయిన తరువాత గోదావరి జలాలు ధర్మపురి లక్ష్మి నరసిహ్మస్వామి పాదాలకు తాకే వరకు సుమారు 170 కిలోమీటర్లు నిలిచి ఉంటాయని తెలిపారు.

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దయవల్ల ఈ ప్రాజెక్ట్ ద్వారా 45లక్షల ఎకరాలకు రెండు పంటలకు సమృద్ధిగా సాగు నీరు అందివ్వనున్నట్లు సీఎం వివరించారు. ఉద్యమ కాలంలో రామగుండం దగ్గర గోదావరిని చూస్తే దుఖం వచ్చేదని, తెలంగాణకు తరలి రావాలని మొక్కుతూ గోదావరి నదిలో నాణాలు జారవిడిచే వాడినని, ఇప్పుడు తెలంగాణలో కష్టాలు తీరబోతున్నయని సీఎం పేర్కొన్నారు. అర్చకుల కోసం క్వార్టర్స్ నిర్మిస్తామని, వేద పాఠశాల, కళాశాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు. గోదావరి పుష్కర ఘాట్స్ దగ్గర జాలిలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ముఖ్యమంత్రి దంపతులతో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ, చీఫ్ సెక్రటరీ డాక్టర్ ఎస్.కె జోషి, సీఎంవో అధికారి స్మిత సభర్వాల్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణ రెడ్డి, దాసరి మనోహర రెడ్డి, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ రావు, భాను ప్రకాష్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, కలెక్టర్‌లు వెంకటేశ్వర్లు, దేవసేన, కరీంనగర్ జెడ్పీ చైర్మన్ తుల ఉమ, కార్పొరేషన్ల చైర్మన్లు దామోదర్ రావు, ఈద శంకర్ రెడ్డి, ఆలయ చైర్మన్ బొమ్మర వెంకటేశం, ఈవో మారుతి, సర్పంచ్ వసంత తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం తర్వాత కన్నేపల్లి పంప్ హౌజ్ నిర్మాణ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి అటునుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డకు చేరుకుని అక్కడ పూర్తి కావచ్చిన బ్యారేజ్ పనుల పరిశీలించారు.

వ్యూ పాయింట్ వద్ద పనుల పురోగతిని సంబంధిత అధికారుల ద్వారా ఆరాతీసి, మరింత త్వరితగతిన పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను యుద్ద ప్రాతిపదికన చేపట్టవలసిందిగా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ మురళీధర్ రావు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎస్‌సీ వెంకటేశ్వర్లు వర్క్ ఏజెన్సీ ఎల్ అండ్ టీ బాధ్యులకు, పని త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన వెల్డర్స్, ఫిట్టర్స్ తదితర సిబ్బందిని దేశంలో ఎక్కడనుంచయినా తక్షణమే తెప్పించి పనులను వేగవంతం చేసేందుకు సహకరించాలని మెగా కృష్ణారెడ్డిని సీఎం కోరారు. గేటు గేటుకూ సరిపోను సిబ్బందిని దించి మూడు షిఫ్ట్‌లల్లో పనిచేయించాలన్నారు. అక్కడనుంచి వాహనంలో బ్యారేజ్ మీద నుంచి ప్రయాణిస్తూ నడుమ ఆగిన ముఖ్యమంత్రి బ్యారేజ్ నిర్మాణాన్ని గేట్ల బిగింపు, తదితర పనులను క్షుణ్ణంగా పరిశీలించారు.

గోదావరి ఈ కొస నుంచి అవతలి కొసకు (మహారాష్ట్ర సరిహద్దు వైపుకు) చేరుకుని అక్కడ కాసేపు ఆగి వాగు మళ్లింపు కాల్వ నిర్మాణం, మిగిలిన కొన్ని గేట్ల బిగింపుకు సంబంధించి సూచనలు చేశారు. అక్కడ నుంచి 45 డిగ్రీల ఎండలోనే వాహనంలో బయలుదేరిన ముఖ్యమంత్రి గోదావరి నీటి కోతను తట్టుకునేందుకు అంచులకు నిర్మిస్తున్న కరకట్టల నిర్మాణ పనులను పరిశీలించారు.

అక్కడ నుండి తిరిగి బయలుదేరి బ్యారేజ్ కింది కాఫర్ డ్యామ్ మీదుగా గుంతల రోడ్డును సైతం లెక్కచేయకుండా ప్రయాణించి ఎండలోనే ఆగి వాహనం దిగి అక్కడ పనిచేస్తున్న కార్మికులను పలకరించి అక్కడ కూడా ఇంజినీర్లకు పలు సూచనలు చేశారు. అక్కడ నుంచి నేరుగా గెస్ట్ హౌజ్ చేరుకున్న సీఎం ఇంజనీర్లతో సమావేశమై రానున్న జూన్‌లో వచ్చే గోదావరి వరదను మేడిగడ్డ వద్ద నిలువరించేందుకు చేపట్టవలసిన సత్వర చర్యలను అందుకు తగిన పలు సూచనలను చేశారు.

నడి ఎండలో సుడిగాలి పర్యవేక్షణ చేసిన సీఎం వెంట మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్ రావు, భాను ప్రకాశ్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణా రెడ్డి, కొరుకంటి చందర్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ, చీఫ్ సెక్రటరీ డాక్టర్ ఎస్.కె జోషి, సీఎంవో అధికారి స్మితా సభర్వాల్, కరీంనగర్ జడ్పీ ఛైర్పర్సన్ తుల ఉమ తదితరులున్నారు.

సమావేశం అనంతరం సీఎం తిరిగి రామగుండం హెలికాప్టర్‌లో బయలుదేరారు. గోదావరి నది నుండి రోజుకు 3 టీఎంసిల నీటిని తరలించడం అంటే తెలంగాణ ప్రాంతానికి ఒక నది తరిలి వస్తున్నట్లే అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 45 లక్షల ఎకరాలకు సాగు నీరందించే అతి పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ ను వేగవంతంగా పూర్తి చేస్తున్నందుకు సంతోషంగా ఉందని సీఎం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల పరిశీలనలో బాగంగా ఆదివారం ఉదయం కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకమైన కన్నేపల్లి పంప్ హౌస్ పనులను క్షుణ్నంగా పరిశీలించారు.

పంపుహౌస్ లోనికి లిఫ్ట్ ద్వారా దిగి మోటార్ల పంపింగ్ పనితీరు గురించి ఇంజనీర్లను, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం ఎంత ముఖ్యమో ప్రాజెక్ట్ ఆపరేషన్ అండ్ మేయింటనెన్స్ కూడా అంతే ముఖ్యమని సీఎం అన్నారు. వచ్చే జూలై‌లోనే రెండు టిఎంసిల చొప్పున నీటిని తరలించి సాగు నీరు అందివ్వడం అంత్యంత శుభపరిణామం అని పేర్కొన్నారు. ఇంత పెద్ద సాగు నీటి ప్రాజెక్ట్ కాబట్టి చిన్న చిన్న సమస్యలు వస్తాయని వాటిని పకడ్బందీగా పరిష్కరించి ప్రాజెక్ట్ నిర్వహణకు భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం అధికారులకు, వర్కింగ్ ఏజెన్సీలకు సూచించారు.

పనులు వేగాంగా జరగాలనే తొందరలో ప్రాజెక్ట్ క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడవద్దని, కొద్ది సమయం తీసుకున్నా అన్ని జాగృత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరా మోటార్ల బిగింపు సహా మొత్తం అన్ని విభాగాల్లో చెక్ లిస్ట్ పూర్తి అయిన తరువాత ట్రయల్ రన్ ప్రారంభానికి తాను, చీఫ్ సెక్రెటరీ కలిసి వస్తామని సీఎం తెలిపారు. ఈ ప్రక్రియ జూన్ చివరి వరకు పూర్తి చేయాలని సూచించారు. కాళేశ్వరం నుండి మిడ్ మానెర్ వరకు ఫేస్ 1గా, మిడ్ మానెర్ నుండి ఫేస్ 2గా పరిగణించి ప్రాజెక్ట్ పూర్తికి సమయానుగుణంగా పనులు చేయాలని ఆదేశించారు. పంప్ హౌజ్‌లు సహా ఇతర ప్రాజెక్ట్ ఆపరేషన్ విషయంలో ఇండిపెండెంట్ వైర్‌లెస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.

ప్రాజెక్ట్‌లో పెద్ద పెద్ద మోటార్లు ఏర్పాటు చేస్తున్నందున అన్ని పంప్ హౌజ్‌ల వద్ద మోటార్లకు అందే నీటిలోకి కలప చెట్లు వంటివి వెళ్లకుండా ముందుగానే జాలి తరహాలో ఉండే ట్రాష్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రాజెక్ట్ పనుల ప్రయార్టిస్‌లో బాగంగా ముందు రెండు టీఎంసిల నీటిని ఎత్తిపోసే పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తూ మూడో టీఎంసి నీటిని ఎత్తి పోసే పనులను కొనసాగించాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వేగాంగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్న ఇంజనీరింగ్ అధికారులను, వర్కింగ్ ఏజెన్సీతో పాటు ప్రతి ఒక్క కార్మికుడికి తాను కృతజ్ఞత తెలుపుతున్నాను అని సిఎం అన్నారు. ముఖ్యమంత్రి వెంట చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, ఎంపి సంతోష్ కుమార్, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్‌లు మురళీధర్ రావ్, వెంకటేశ్వర్లు, మెగా కంపెనీ డైరెక్టర్లు కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.