రామగుండం, మే 19 (న్యూస్‌టైమ్): రామగుండంలో ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పునరుద్ధరణపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మూతపడ్డ ఎఫ్.సి.ఐ.ని తిరిగి తెరిపించడానికి తాను కేంద్ర ప్రభుత్వంతో పోరాడాల్సి వచ్చిందని సిఎం చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచే ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా ఎఫ్.సి.ఐ.ఎల్. సిఇవో రాజన్ థాపర్ చెప్పారు.

రామగుండలో ఎరువుల ఉత్పత్తి ప్రారంభం అయితే, తెలంగాణ రైతులకు కావాల్సిన ఎరువులు ఇక్కడ నుంచే తీసుకోవచ్చని సిఎం అన్నారు. అలాగే తెలంగాణ ఏర్పడినప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగం నేడు దేశంలోనే అత్యుత్తమంగా మారిందని సిఎం కేసీఆర్ అన్నారు. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ,సరఫరా వ్యవస్థలు ఎంతో మెరుగుపడ్డాయని, జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు నాయకత్వంలోని విద్యుత్ సంస్థలు మెరుగైన ఫలితాలు సాధించాయని అభినందించారు.

సింగరేణి సిఎండి శ్రీధర్ నాయకత్వంలో సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి ప్రతి ఏటా పెరుగుతున్నదని సిఎం ప్రశంసించారు. తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.