రామగుండం, మే 19 (న్యూస్‌టైమ్): విద్యుత్తు ఉత్పత్తి కోసం చేసే బొగ్గు కేటాయింపు విధానంలో సమూల మార్పులు తెచ్చి, ఉత్పత్తి వ్యయం తగ్గించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో త్వరలో ఏర్పడే కొత్త ప్రభుత్వం దగ్గర తానే చొరవ తీసుకుంటానని స్పష్టం చేశారు. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నందువల్ల ఎన్.టి.పి.సి. నుంచి వెంటనే 2వేల మెగావాట్లు సరఫరా చేయాలని కోరారు. తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టుల రిజర్వాయర్లపై సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఎన్.టి.పి.సి.కి అనుమతి ఇస్తామని సిఎం హామీ ఇచ్చారు.

రామగుండంలో ఎన్.టి.పి.సి. నిర్మిస్తున్న 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ముఖ్యమంత్రి సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపి జె. సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు చందర్, మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్ రావు, జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, ఎన్.టి.పి.సి. సిఎండి గురుదీప్ సింగ్, తెలంగాణ జెన్ కో సిఎండి డి. ప్రభాకర్ రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కె. జోషి, ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, ఎన్.పి.డి.సి.ఎల్. సిఎండి గోపాలరావు, సింగరేణి సిఎండి శ్రీధర్, కలెక్టర్ దేవసేన తదితరులు సిఎం వెంట ఉన్నారు.

అనంతరం ఎన్.టి.పి.సి.లోనే విద్యుత్ ఉత్పత్తిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రామగుండంలో నిర్మిస్తున్న 1600 మెగావాట్ల ప్లాంటులో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లు వచ్చే ఏడాది అక్టోబర్‌లో, మరో రెండు యూనిట్లు 2021 ఫిబ్రవరిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తాయని ఎన్.టి.పి.సి. అధికారులు చెప్పారు. నిర్ణీత గడువుకన్నా ముందే ప్లాంటు నిర్మాణం పూర్తి చేయాలని సిఎం వారిని కోరారు. ‘‘విభజన బిల్లులో తెలంగాణ రాష్ట్రానికి 4వేల మెగావాట్ల విద్యుత్ అందించడానికి కేంద్రం అంగీకరించింది. ఇందులో 1600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంటు నిర్మాణం జరుగుతుంది.

ఈ కరెంటు రావడానికే మరో ఏడాదికి పైగా పడుతుంది. మిగతా కరెంటు రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. తెలంగాణలో వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఈ ఏడాది జూలై నుంచే ప్రారంభమవుతుంది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే 6వేలకు పైగా మెగావాట్ల అవసరం ఉంది. మొత్తంగా తెలంగాణలో విద్యుత్ వినియోగం బాగా పెరుగుతుంది. విద్యుత్ వినియోగం వృద్దిరేటులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా ఉంది. తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎన్.టి.పి.సి. ప్లాంట్ల ద్వారా కనీసం 2వేల మెగావాట్ల విద్యుత్ ను సరఫరా చేయాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

ముఖ్యమంత్రి డిమాండ్ పై ఎన్.టి.పి.సి. సిఎండి సానుకూలంగా స్పందించారు. 2వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం నడుస్తున్న ఎన్.టి.పి.సి. ప్లాంట్ల ద్వారానే విద్యుత్ తీసుకుంటే వెంటనే మన అవసరాలు తీరుతాయని, ధర కూడా కలిసొస్తుందని సిఎం అన్నారు.

‘‘విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు కేటాయింపులు చేసే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానం సరిగా లేదు. రామగుండం ఎన్.టి.పి.సి. ప్లాంటుకు పక్కనే ఉన్న సింగరేణి నుంచి కాకుండా 950 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒరిస్సా రాష్ట్రంలోని మందాకిని నుంచి బొగ్గు తెచ్చి వాడుతున్నారు. దీనివల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. విద్యుత్ ధర పెరుగుతుంది. అంతిమంగా ప్రజలపై భారం పడుతుంది. దేశ వ్యాప్తంగా ఎక్కడ విద్యుత్ కేంద్రం ఉంటే, దానికి దగ్గరలోని గనుల బొగ్గును వాడాలి. పిట్ హెడ్ ప్లాంట్ల స్థాపన లక్ష్యం కూడా అదే. దూర ప్రాంతాల నుంచి బొగ్గు తేవడం వల్ల రవాణా చార్జీలు పెరుగుతాయి. తెలంగాణ జెన్ కో వందకు వంద శాతం సింగరేణి బొగ్గునే వాడుతున్నది. రామగుండం ఎన్.టి.పి.సి. కూడా సింగరేణి బొగ్గునే వాడాలి. విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు కేటాయించే విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వానికి తానే లేఖ రాస్తానని, విధానంలో మార్పు తీసుకురావడానికి చొరవ చూపుతా’’ అని సిఎం స్పష్టం చేశారు.

విద్యుత్తు ఉత్పత్తి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్.టి.పి.సితో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంభిస్తుందని సిఎం చెప్పారు. తెలంగాణలో నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టుల రిజర్వాయర్లపైన సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఎన్.టి.పి.సి.కి అనుమతి ఇవ్వనున్నట్లు సిఎం చెప్పారు. మొదట పైలట్ ప్రాజెక్టు కింద చిన్న రిజర్వాయర్ కేటాయిస్తామని, తర్వాత పెద్ద రిజర్వాయర్లను కేటాయిస్తామని వెల్లడించారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణంలో విపరీతమైన జాప్యం జరుగుతున్నదని, అనుమతులు ఇవ్వడంలో జరిగే జాప్యం నిర్మాణ సమయంపై ప్రభావం చూపుతున్నదని సిఎం చెప్పారు.

పిజిసిఎల్ లైన్ల నిర్మాణం, నిర్వహణ విషయంలో కూడా మెరుగైన విధానం రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో వచ్చే కొత్త ప్రభుత్వం మెరుగైన పనితీరు కనపరుస్తుందనే ఆశాభావం సిఎం వ్యక్తం చేశారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ఎన్.టి.పి.సి సంస్థ 13.5లక్షల మొక్కలు నాటినందుకు ముఖ్యమంత్రి అభినందించారు.

1 COMMENT

  1. I loved as much as you’ll receive carried out right
    here. The sketch is tasteful, your authored subject matter
    stylish. nonetheless, you command get got an nervousness over
    that you wish be delivering the following. unwell unquestionably come further formerly again as exactly the same nearly
    very often inside case you shield this hike.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here