హైదరాబాద్, మే 20 (న్యూస్‌టైమ్): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవాల సన్నాహక ఏర్పాట్లును రాష్ట్ర అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సోమవారం రాత్రి సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాల సన్నాహక ఏర్పాట్లు పరిశీలనలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ రావు, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ విజయ్ ప్రసాద్, పోలీసు అధికారులు, ప్రోటోకాల్ అధికారులు రాజ్ కుమార్, రామయ్యలు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న చారిత్రక నేపథ్యం ఉన్న పబ్లిక్ గార్డెన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ఆవిర్భావ దినోత్సవం జరిగిందన్నారు. గత 70 ఏళ్లలో సమైక్య పాలకులు తెలంగాణ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రం ఎడారిగా మార్చారన్నారు. పబ్లిక్ గార్డెన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లును ఘనంగా ఏర్పాటు చేయాలని అధికారులను అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. పబ్లిక్ గార్డెన్స్‌లో సభ ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షించారు. పబ్లిక్ గార్డెన్స్‌కు అనుబంధంగా ఉన్న జూబ్లీ హాల్‌లో కవి సమ్మేళనాన్ని నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులకు సూచించారు.