చిత్తూరు, మే 21 (న్యూస్‌టైమ్): చిత్తూరు జిల్లాలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో ఊహించని రీతిలో రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటనలో ఈవీఎంలకు గాని, వీవీ ప్యాట్లకు గానీ ఎలాంటి నష్టం వాటిల్లలేదు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఉన్న భద్రతా బలగాలు సకాలంలో ప్రమాదాన్ని గ్రహించి అగ్నిమాపక దళాన్ని అప్రమత్తం చేయడంతో పెనుముప్పు తప్పిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు భద్రపర్చిన గదులకు సమీపంలోనే ఈ మంటల వ్యాపించాయి. విషయం మీడియా ద్వారా వెలుగులోకి వచ్చేసరికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రద్యుమ్నా, పోలీసు ఉన్నతాధికారులు, పోటీలో ఉన్న అభ్యర్ధులు ఆందోళన చెందారు.

మంటలు అదుపులోకి వచ్చి ఓటింగ్ యంత్రాలకు, వీవీ ప్యాట్లకు ఎలాంటి నష్టం జరగలేదని తెలుసుకున్నాక ఊపిరిపీల్చుకున్నారు. తొలుత ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అధికార తెలుగుదేశం పార్టీ వర్గాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించాయి. ఓ కర్ణాటక రాష్ట్ర రిజిస్ట్రేషన్ కారు వేగంగా బయటకు వచ్చి దూసుకుపోవడడాన్ని గమనించిన తెదేపా శ్రేణులు విషయాన్ని నాయకులకు చేరవేశారు. దీని గురించి అక్కడి ఎస్ఐని అడిగితే తడబాటుతో ఇప్పుడే విధులకు వచ్చానని చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈవీఎంలకు, వీవీ ప్యాట్లకూ ఏమీ కాలేదని అధికారులు చెబుతున్నారని, అయితే, వాస్తవ పరిస్థితులను చూస్తే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పోటీదారులు వాపోతున్నారు.