హైదరాబాద్, మే 21 (న్యూస్‌టైమ్): ఎన్టీఆర్ ఎంతటి దయాళువో చెప్పే సంఘటన ఇది. దీనిని గురించి 1980-90 కాలంలో పనిచేసిన సచివాలయ ఉద్యోగులు చెప్పుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయంలో పై అంతస్తులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళడానికి ప్రత్యేకంగా ఒక లిఫ్ట్ ఉండేది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఒకే ఉద్యోగి లిఫ్టు ఆపరేటర్‌గా ఉండేవారు.

ఆ కారణంగా అతనికి ఎన్టీఆర్‌తో కొంచెం చనువు ఉండేది. ఎన్టీఆర్ కూడా అతనిని చూడగానే నవ్వుతూ ‘బాగున్నారా’ అని కుశలం కనుక్కునేవారు. ఒకరోజు సాయంత్రం ఎన్టీఆర్ తన కార్యాలయంలో అప్పటి సభాపతి, మరి కొందరు ముఖ్యులతో మాట్లాడుతున్నారు. ఇంతలో లిఫ్ట్ ఆపరేటర్ ఆ గదిలోకి వెళ్ళి నమస్కారం చేశారు. ఎన్టీఆర్ ‘ఏమిటి?’ అని అడిగారు. ‘‘సార్! నేను ఈ సాయంత్రం పదవీ విరమణ చేస్తున్నాను. చివరిసారిగా మీకు చెప్పి వెళదామని వచ్చాను’’ అన్నారు.

అది విన్న ఎన్టీఆర్ ‘‘అరే.. పొద్దున్న చెప్పలేదే? ఉండు’’ అని తన కార్యదర్శులకు ఫోన్ చేసి ఉన్నపళంగా ఒక శాలువా, బోకే తెమ్మని పురమాయించారు. ఈ లోపల ఆ ఉద్యోగి కుటుంబ వివరాలను అడిగారు. అతనికి సొంత ఇల్లు కూడా లేదని, పెళ్ళి కావలసిన కుమార్తెలు ఉన్నారని తెలుసుకున్న ఎన్టీఆర్ వెంటనే కార్యదర్శిని పిలిచి ఆ ఉద్యోగి పేరుతో రెండు ఎకరాల ప్రభుత్వ భూమికి పట్టా కాగితాలు అరగంట లోపల సిద్దం చెయ్యమని ఆదేశించారు. ఇంతలో శాలువా, బోకే, మిఠాయిలు వచ్చాయి.

ఎన్టీఆర్ ఆ ఉద్యోగికి స్వయంగా సన్మానం చేసి, తన జేబులోంచి కొంత నగదు తీసి పట్టా కాగితాలతో సహా అందించి, అవసరం అయితే కలవమని చెప్పి పంపించారు. అనుకోని ఆ సత్కారానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చూపించిన దయాగుణానికి ఆ ఉద్యోగి కంట ఆనంద బాష్పాలు రాలాయి.