హైదరాబాద్, మే 22 (న్యూస్‌టైమ్): అంతర్జాతీయ చిత్రకారుడు సూర్యప్రకాశ్ కన్నుమూశారు. కుంచెతో మనసుకు హత్తుకునే చిత్రాలు గీసిన సూర్యప్రకాశ్ దేశ విదేశాల్లో అభిమానులను సంపాదించుకున్నారు. సూర్యప్రకాశ్‌ వేసిన బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా అపూర్వ ఆదరణ ఉంది. ఖమ్మం జిల్లా మధిరలో జన్మించిన ఆయన జేఎన్టీయూ కాలేజీలో ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సులో డిప్లమా చేశారు. ఢిల్లీకి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు శ్రీరాంకుమార్‌ దగ్గర చిత్రకళలో మెళకువలు నేర్చుకున్నారు.

మొదట సీసీఎంబీకి రెసిడెన్షియల్‌ ఆర్టిస్టుగా పనిచేసిన సూర్యప్రకాశ్‌ ప్రస్తుతం ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో రెసిడెన్షియల్‌ ఆర్టిస్టుగా పనిచేస్తున్నారు. సూర్యప్రకాశ్ మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ చిత్రకళకు అంతర్జాతీయస్థాయి ఖ్యాతిని ఆర్జించిపెట్టిన చిత్రకారుడిగా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 5లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

ఆయనకు భార్య ప్రభ, కుమార్తె ఉన్నారు. మరోవైపు, సూర్యప్రకాశ్ మరణవార్త తెలుసుకున్న పలువురు చిత్రకారులు, ప్రముఖులు ఆయన నివాసానికి వచ్చి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ గుల్లపల్లి ఎన్ రావు, ఎండీ రమేశ్‌ప్రసాద్, ప్రముఖ చిత్రకారులు లక్ష్మణ్‌గౌడ్, ఏలె లక్ష్మణ్, కవితా దేవస్కర్, అంజనీరెడ్డి, రాజేశ్వర్‌రావు, నగేశ్‌గౌడ్ తదితరులు సూర్యప్రకాశ్ మృతదేహానికి నివాళులర్పించినవారిలో ఉన్నారు. సాయంత్రం ఆరుగంటలకు సూర్యప్రకాశ్ పార్థివదేహానికి జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు.

1961 నుంచి 1964 దాకా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖలో ఉద్యోగం చేశారు. చిత్రకళపై ఉన్న మక్కువతో ఉద్యోగానికి రాజీనామాచేసిన సూర్యప్రకాశ్ ఢిల్లీకి వెళ్లి, ప్రఖ్యాత చిత్రకారుడు శ్రీరాంకుమార్ వద్ద ఆరునెలలు శిక్షణ పొందారు. అనంతరం దేశవిదేశాల్లో అనేక చిత్రకళా ప్రదర్శనలను ఏర్పాటుచేశారు. సూర్యప్రకాశ్ కృషికి గుర్తింపుగా పలు సంస్థలు అనేక అవార్డులతో ఆయనను గౌరవించాయి. 1971-1996 మధ్యకాలంలో ప్యారిస్, వాషింగ్టన్, టోక్యో, లండన్ తదితర నగరాల్లో సూర్యప్రకాశ్ తన పెయింటింగ్స్‌తో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలు ఎంతగానో అకట్టుకున్నాయి. సూర్యప్రకాశ్ జీవితంపై ఒక డాక్యుమెంటరీ ఫిలిమ్ కూడా వచ్చింది.

‘ఏ జర్నీ బియాండ్ కలర్స్’ అనే పుస్తకాన్ని సూర్యప్రకాశ్ రచించారు. ఈ పుస్తకం మంచి ప్రాచుర్యం పొందింది. ఈ పుస్తకం రచించినందుకు న్యూఢిల్లీలోని ఆలిండియా ఫైనార్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వారు కళావిభూషన్ అవార్డును ప్రదానంచేశారు. సీసీఎంబీతోపాటు బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో రెసిడెంట్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన సమయంలో సూర్యప్రకాశ్ వేసిన చిత్రాలు కళాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రకారులు ఎంఎఫ్ హుస్సేన్‌తోపాటు అనేకమందిని నగరానికి తీసుకువచ్చి, వర్ధమాన చిత్రకారులకు శిక్షణ ఇప్పించిన ఘనత సూర్యప్రకాశ్‌కు దక్కింది. ఆయన వేసిన అనేక చిత్రాలను సీసీఎంబీ, ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో ఏర్పాటుచేశారు.