హైదరాబాద్, మే 22 (న్యూస్‌టైమ్): తెలంగాణ రాష్టంలోని 17 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికలకు సంబంధించి మే 23న గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ రజత్ కుమార్ ప్రకటించారు. హైదరాబాద్లో బుధవారం పత్రికావిలేకరులను ఉద్దేశించి మాట్లాడుతూ మొత్తం లెక్కింపు ప్రక్రియకు సంబంధించి చట్ట నిబంధనలు, కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు జారీ చేసిన మార్గదర్శకాలపై కౌంటింగ్ సిబ్బందికి ఇప్పటికే పూర్తి స్పష్టత ఇచ్చామని ఆయన వివరించారు.

రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 35 చోట్ల ఏర్పాటు చేసిన 126 హాళ్ళలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక హాల్కు 14 టేబుళ్ళ చొప్పున, మల్కాజ్గిరిలోని మేడ్చల్, ఎల్.బి.నగర్ సెగ్మంట్లకు 28 టేబుళ్ళ చొప్పున ఏర్పాటు చేయడం జరిగిందని, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మంట్లలో ప్రతి సెగ్మంట్కు రెండు హాల్స్‌లో హాల్కు 18 చొప్పున 36 టేబుళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఉదయం 8 గంటలకు మొదట పోస్టల్ ఓట్లను, ఇటిపిబిఎస్ ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 8.20 గంటలకు ఇవిఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని సీఈవో తెలిపారు. ఇవిఎంల రౌండ్లన్నీ పూర్తయిన తరువాత ర్యాండమ్ పద్ధతిలో ఎంపిక చేసిన వివిప్యాట్ల స్లిప్పులను లెక్కిస్తారని, తేడా వచ్చిన చోట వివిపాట్ల స్లిప్పుల లెక్కనే పరిగణనలోకి తీసుకుంటారన్నారు. ప్రతి రౌండు పూర్తి కాగానే సువిధ అప్లికేషన్ ద్వారా ఫలితాలను రిటర్నింగ్ అధికారులు పోర్టల్లో నమోదు చేస్తారని, పోటీలో ఉన్న అభ్యర్థులు కానీ, వారి ఏజంట్లు కానీ రీకౌంటింగ్ కోరదలిస్తే రిటర్నింగ్ అధికారి నిర్దేశించిన సమయంలో, లిఖితపూర్వకంగా ఆయనకే అభ్యర్థనను సమర్పించుకోవాల్సి ఉంటుందనీ, వారి విన్నపాలను మన్నించే, తిరస్కరించే అధికారం కేవలం రిటర్నింగ్ అధికారులకే ఉంటుందనీ, ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా జోక్యం చేసుకోలేదని ఆయన వివరించారు. ఒకవేళ ఆ విజ్ఞప్తులను సదరు అధికారి తిరస్కరించే పక్షంలో ఆ విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలియచేయాల్సి ఉంటుందని కూడా కుమార్ స్పష్టం చేసారు.

క్లోజ్ బటన్ నొక్కకుండా ఉన్న ఇవిఎంలను పక్కనబెట్టి వాటిని రిటర్నింగ్ అధికారులు, పరిశీలకుల దృష్టికి తీసుకురావాల్సి ఉంటుందని కూడా ఆయన చెప్పారు. ఆ విషయంలో తదుపరి చర్యల నిమిత్తం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియచేయాల్సి ఉంటుంది. రాష్ట్ర, కేంద్ర బలగాలతో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, అలాగే అన్ని కేంద్రాల్లో మీడియా సెంటర్లు ఏర్పాటు చేసి ఫలితాలను ఎప్పటికప్పుడు తెలియచేసేందుకు డిస్‌ప్లే బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వార్తలు సేకరించే విలేకరులను బృందాలుగా ఏర్పాటు చేసి కౌంటింగ్ కేంద్రాలలోకి విడతలవారీగా పంపుతామని ఆయన వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్లను లోనికి అనుమతించరని ఆయన స్పష్టం చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here