న్యూఢిల్లీ, మే 23 (న్యూస్‌టైమ్): దేశ ప్రజలంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. లోక్‌సభలోని 542 స్థానాలకు అధికార, ప్రతిపక్ష కూటముల మధ్య సాగిన హోరాహోరీ పోరుకు దీంతో తెరపడనుంది. ఏడు విడతల్లో, దాదాపు 40 రోజుల పాటు సాగిన పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారానికి రాగలదని అంచనా వేశాయి. ప్రధాని మోదీ చరిష్మాతో 2014లో మాదిరే వరుసగా రెండోసారీ ఆ కూటమిదే అధికారమని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను విపక్షాలు తోసిపుచ్చాయి. దేశం లో 90 కోట్ల మంది అర్హులైన ఓటర్లకు 67 శాతం మందికి పైగా ఓటేశారు. ఈసారి ఎన్నికల్లో చౌకీదార్ చోర్ హై, అవినీతిపరుల్లో నం.1, ఖాకీ అండర్‌వేర్ వంటి పదజాలాలతో అధికార, విపక్ష నేతల మధ్య దూషణపర్వం కొనసాగింది. మొత్తం 542 స్థానాలకు 8,049 మంది పోటీ పడ్డారు. తమిళనాడులోని వేలూరు స్థానానికి ఎన్నికలను ఈసీ రద్దు చేసింది. 2014 ఎన్నికల్లో బీజేపీ 282 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ ఎన్నడూ లేని విధంగా కేవలం 44 సీట్లతో సరిపెట్టుకుంది. మరోవైపు, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం తెలిపింది.

ఫలితాలు సాయంత్రానికి వెలువడవచ్చన్నది. లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి ఎలక్టానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)లలోని ఓట్లను వీవీప్యాట్‌లలోని స్లిప్పులతో సరిపోల్చనున్నారు. లోక్‌సభ స్థానం పరిధిలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఐదేసి పోలింగ్ బూత్‌లలోని వీవీప్యాట్‌లను ఎంపికచేసి లెక్కిస్తారు. ఈ ఎన్నికలకు ఈసీ 10.3 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, వాటిలోని 20,600 కేంద్రాల్లోని వీవీప్యాట్‌లను లెక్కింపు కోసం ఎంపిక చేస్తారు. ఒకవేళ ఈవీఎంలలోని ఓట్లకు, వీవీప్యాట్‌లలోని స్లిప్పులకు మధ్య తేడా వస్తే, వీవీప్యాట్‌లలో నమోదైన ఓట్లే పరిగణిస్తారు.

ఈ ప్రక్రియతో ఫలితాల వెల్లడి 4 నుంచి 5 గంటలు ఆలస్యం కావచ్చని భావిస్తున్నారు. మునుపెన్నడూ లేని రీతిలో ఈసారి అత్యధికంగా 67.11 శాతం పోలింగ్ నమోదైందని ఈసీ తెలిపింది. నిబంధనల ప్రకారం మొదట పోస్టల్ బ్యాలట్లు లెక్కిస్తారు. దాదాపు 18 లక్షల మంది సర్వీస్ ఓటర్లకు 16.49 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటేశారు. వీరిలో సైన్యం, కేంద్ర పోలీసు బలగాలు, రాష్ట్ర పోలీసు సిబ్బంది ఉన్నారు. విదేశాల్లోని దౌత్య అధికారులు, వారి సహాయ సిబ్బందినీ సర్వీసు ఓటర్లుగా పరిగణిస్తారు. వీరు తమ పోస్టల్ బ్యాలెట్లను ఈ నెల 17 నాటికి ఆయా రిటర్నింగ్ అధికారులకు పంపారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు కనీసం రెండు గంటలు పడుతుందని ఓ అధికారి తెలిపారు.

కాగా, ఈవీఎంల ట్యాంపరింగ్, అక్రమ తరలింపుపై విపక్ష పార్టీల ఆందోళన నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) వివరణ ఇచ్చింది. ఈవీఎంలను సురక్షితంగా భద్రపరిచామని, వాటిని మార్చడం/ట్యాంపరింగ్ చేసే అవకాశమే లేదని మరోమారు స్పష్టంచేసింది ఈసీ. పోలింగ్ కేంద్రాల నుంచి స్ట్రాంగ్‌రూంలకు జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాటు చేసే వాహనాలలో తరలిస్తారు. ఈవీఎంల తరలింపునకు కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల సంయుక్త బృందం భద్రత కల్పిస్తాయి. ఆ వాహనాలతో పాటు ప్రిసైడింగ్ అధికారీ వెళతారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లను ఇటు పోలింగ్ కేంద్రాలకు, ఆ తరువాత స్ట్రాంగ్‌రూంలకు తరలిస్తున్నప్పుడు అవి ట్యాంపరింగ్‌కు గురికాకుండా ఈసీ అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తోంది.

ఎన్నికల అధికారుల దుస్తులకు అమర్చిన కెమెరాతోపాటు డ్రోన్ కెమెరాలు కూడా ఈ ప్రక్రియ అంతటిపై నిఘా వేస్తాయి. ఈ వాహనాలకు జీపీఎస్‌ను అమర్చడంతో వాటి కదలికలపై పూర్తి పర్యవేక్షణ ఉంటుంది. వీవీప్యాట్‌లలోని స్లిప్పులు సున్నితమైనవి గనుక వాటికి సూర్యరశ్మి తగులకుండా భద్రపరుస్తారు. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద ఎంతమంది సిబ్బందిని భద్రత కోసం నియమించారన్న విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. ఇంకోవైపు, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. శాంతి భద్రతలను పరిరక్షించాలని, స్పష్టం చేసింది.

స్ట్రాంగ్‌రూమ్‌లు, లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలను కేంద్రం ఆదేశించింది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, త్రిపురలో హింస చెలరేగొచ్చని, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఆటంకాలు కలిగించవచ్చని సమాచారం అందిందని తెలిపింది.