న్యూఢిల్లీ, మే 23 (న్యూస్‌టైమ్): లోక్‌సభకు ఏడు దశల్లో జరిగిన ఎన్నికల్లో గురువారం మొదలైన ఓట్ల లెక్కింపు మరింత ఉత్కంఠ రేపుతోంది. ఎగ్జిట్ పోల్స్‌కు తగ్గట్టుగానే కాస్త అటు ఇటుగా ఫలితాలు వెలువడుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అత్యంత పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికల సమరాంగణంలో హోరాహోరీన తలపడిన అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాస్వామ్య పండగలో ఉత్సాహంగా పాల్గొన్న ఓటర్లు ఫలితాల కోసం ఉద్వేగంతో వేచి చూస్తున్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌, సహా పొరుగు రాష్ట్రం ఒడిశా శాసనసభలకు జరిగిన ఎన్నికలు మరింత ఉత్కంఠను పెంచాయి. గుజరాత్‌ గాంధీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ముందంజలో ఉన్నారు. తెలంగాణలోని మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్ పూర్తి అయ్యే సరికి కాంగ్రెస్‌ అభ్యర్థి ఎ. రేవంత్‌రెడ్డి వెనుకంజలో ఉన్నారు. తెరాస 1500 ఓట్ల ఆధిక్యంలో ఉంది. కేంద్ర మంత్రి మేనకాగాంధీ ఉత్తరప్రదేశ్ సుల్తాన్‌పూర్‌ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. మాజీ క్రికెటర్‌, తూర్పు ఢిల్లీ భాజపా అభ్యర్థి గౌతం గంభీర్‌ ముందంజలో ఉన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం వారణాసి నుంచి పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ, అదే రాష్ట్రంలో అమేఠీ నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీలు మొదట్లో వెనుకంజలో ఉన్నా, తర్వాత పుంజుకున్నారు. కర్ణాటకలోని మండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సినీ నటి సుమలత తన మొదటి నుంచీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాంపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సినీ నటి జయప్రద (భాజపా) వెనుకంజలో ఉన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన యూపీఏ ఛైర్‌‌పర్సన్‌ సోనియాగాంధీ ముందంజలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్, గుణ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులుగా బరిలో దిగిన మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్‌, కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెనుకంజలో ఉన్నారు. యూపీలో కీలక నియోజకవర్గమైన అమేఠీలో భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీ రాహుల్ కంటే కాస్త ముందంజలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని కలబురిగి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మల్లిఖార్జున ఖర్గే వెనుకంజలో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన వైకాపా అభ్యర్థి అవినాష్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ముంబయి ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన సినీ నటి ఊర్మిళ మందోత్కర్‌ వెనుకంజలో ఉన్నారు. విశాఖ లోక్‌సభ నియోజకవర్గం తొలి రౌండ్ కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎం. శ్రీభరత్‌ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. అలాగే, తెలంగాణలోని ఖమ్మం పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు 3159 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు సీతమ్స్‌ కాలేజ్‌ కౌంటింగ్‌ కేంద్రంలో పార్టీ ఏజెంట్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్థలాభావం కారణంగా 4 పార్టీల ఏజెంట్లనే అధికారులు అనుమతించారు. తమనూ అనుమతించాలని అధికారులతో పోలింగ్‌ ఏజెంట్లు వాగ్వాదానికి దిగారు. వెంటనే సమాచారం తెలుసుకున్న తిరుపతి అర్బన్‌ ఎస్పీ అన్బు రాజన్‌ పరిస్థితిని చక్కదిద్దారు.

మధ్యప్రదేశ్‌లో లోక్‌సభ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. చింద్వారాలో నకుల్‌ కమల్‌నాథ్‌ (కాంగ్రెస్‌) ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఊహించినట్లే లోక్‌సభ ఫలితాల్లో అధికార ఎన్డీయే ఆధిక్యతను చాటుకుంటోంది. తొలి ఫలితాల్లో ఎన్డీయే స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. లఖ్‌నవూలో భాజపా ఎంపీ అభ్యర్థి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆధిక్యంలో ఉన్నారు. ఈసీ మార్గదర్శకాల మేరకు తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించారు. అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు మూడంచెల భద్రతను ఏర్పాటుచేశారు. సమస్యాత్మకమైనవిగా గుర్తించిన కేంద్రాల వద్ద భద్రత పెంచారు. ఏపీలో లోక్‌సభకు మొత్తం 5,03,199 పోస్టల్‌ బ్యాలెట్లు పోలయ్యాయి. కాగా, దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనుకున్న సమయం కంటే వేగంగానే కొనసాగుతోంది. కడపటి వార్తలు అందే సమయానికి ఎన్డీయే 300లకుపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

ఉత్తరాది రాష్ట్రాల్లో భాజపా హవా కొనసాగుతోంది. అత్యధిక స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రధాని మోదీ 20 వేల ఓట్ల ఆధిక్యంలో ఉండగా, అమిత్‌షా 50 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఊహించని విధంగా పశ్చిమ్‌ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా పోటాపోటీగా ఉన్నాయి. ప్రస్తుతం భాజపా కాస్త ఆధిక్యంలో కొనసాగుతోంది.