హైదరాబాద్, మే 23 (న్యూస్‌టైమ్): హైదరాబాద్ నగరంలో విద్యుత్ వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. ఎంతగా అంటే మొత్తం ఏడు ఈశాన్య రాష్ట్రాలు వాడుతున్న కరెంటు కంటే, హైదరాబాద్ నగరం వాడుతున్న కరెంటు ఎక్కువ. హైదరాబాద్ నగరం వాడే కరెంటు కంటే, దేశంలోని 13 రాష్ట్రాల్లో మొత్తం రాష్ట్ర వినియోగం ఉంది. దేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలన్నీ కలిపి కూడా హైదరాబాద్ నగరం వాడేంత కరెంటు వాడడం లేదు. ఈ ఏడాది గరిష్ట డిమాండ్ గతంలో ఎన్నడూ లేని విధంగా 3,276 మెగావాట్లకు చేరుకుంది. గత ఏడాది వేసవిలో 2,950 మెగావాట్ల గరిష్ట డిమాండ్ వచ్చింది.

ఈ ఏడాది డిమాండ్‌లో పదిశాతం వృద్ధి సాధించింది. హిమాచల్ ప్రదేశ్(1,387), జమ్మూకాశ్మీర్(2,826), ఉత్తర ఖండ్(1,922), గోవా(594), సిక్కిం(100), జార్ఖండ్(1,266), అస్సాం(1,712), అరుణాచల్ ప్రదేశ్(139), మణిపూర్(197), మేఘాలయ(336), మిజోరం(116), నాగాలాండ్(157), త్రిపుర(292) రాష్ట్రాలు హైదరాబాద్ నగరం కంటే తక్కువ కరెంటు వాడుతున్నాయి. మొత్తం ఏడు ఈశాన్య రాష్ట్రాలు కలిపి వాడే కరెంటు 2,848 కన్నా హైదరాబాద్ నగరం వాడే కరెంటు ఎక్కువ.

హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న పారిశ్రామికీకరణ, ఐటి పరిశ్రమ వృద్ధి, వాణిజ్య కనెక్షన్లు పెరగడం, గృహ ఉపయోగం పెరగడం వల్ల ఈ వృద్ధి జరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన నాడు నగరంలో 37.8 లక్షల ఎల్.టి. విద్యుత్తు కనెక్షన్లు ఉంటే, నేడు 47.8 లక్షల కనెక్షన్లున్నాయి. ఎల్.టి. కనెక్షన్లలో 27 శాతం వృద్ది సాధించింది. 2014లో 5,067హెచ్.టి. విద్యుత్ కనెక్షన్లుంటే, నేడు 7,015కు పెరిగాయి. హెచ్.టి. కనెక్షన్లలో 39 శాతం వృద్ధి జరిగింది. అన్నింటికీ మించి 24 గంటల విద్యుత్ సరఫరా జరగడం వల్ల పరిశ్రమలు మూడు షిఫ్టులు పనిచేస్తున్నాయి.

‘‘హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ. కాబట్టి నగరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిశ్రమలు, వ్యాపారం, వాణిజ్యం, కార్యాలయాలు అన్నీ కరెంటుపై ఆధారపడి నడుస్తున్నాయి. ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా, సరఫరాలో అంతరాయాలు కలగకుండా చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో విద్యుత్ డిమాండ్‌లో 10 శాతం స్థిరమైన వృద్ధి ఉంటుందని అంచనా వేశాము. డిమాండ్‌కు తగినట్లు విద్యుత్ సరఫరా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే నగరం చుట్టూ 400 కెవి రింగును ఏర్పాటు చేశాం. నాలుగు 400 కెవి సబ్ స్టేషన్లు నిర్మించాం. అక్కడి నుంచి 220 సబ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా చేసే లైన్ల సామర్థ్యం ఎప్పటికప్పుడు పెంచుతున్నాం’’ అని ట్రాన్స్‌కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) దేవులపల్లి ప్రభాకర్ రావు తెలిపారు.