ముంబయి, మే 23 (న్యూస్‌టైమ్): ప్రతికూల అంశమేదైనా దాని ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడుతుందని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న ఎగ్జిట్ పోల్స్ వెలువడిన నాడు ఎలాగైతే దేశీయ మార్కెట్లలో సూచీలు ఎగబాకాయో గురువారం సార్వత్రిక ఎన్నికల ఫలితాల సందర్భంగా కూడా స్టాక్ మార్కెట్లు ఫుల్ జోష్‌లో కనిపించాయి. భారతయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ఆధిక్యంలో దూసుకెళ్లడంతో దేశీయ మార్కెట్లు పరుగులు తీశాయి. కేంద్రంలో మరోసారి ఎన్డీయే సుస్థిరమైన సర్కార్‌ వస్తుందనే అంచనాలతో ట్రేడింగ్‌ను సూచీలు రికార్డు స్థాయిలో లాభాలతో ప్రారంభించాయి.

500 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్‌ మధ్యాహ్నానికి దాదాపు 600 పాయింట్ల వరకు ఎగబాకింది. ఉదయం 9.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 595 పాయింట్లు లాభపడి 39,705 వద్ద, నిఫ్టీ 169 పాయింట్ల లాభంతో 11,907 వద్ద ట్రేడ్‌ కావడం విశేషం. మరోవైపు, డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.44గా కొనసాగింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్ షేర్లు దాదాపు 5 శాతం లాభంతో ట్రేడ్ అయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఆటో, ఎనర్జీ, లోహ, ఐటీ, ఫార్మా రంగాల షేర్లు రాణించాయి. ఒక విధంగా చెప్పాలంటే, దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం పగ్గాలు తెంచుకుని పరుగులు తీశాయి.

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్‌డీఏ కూటమి స్పష్టమైన మెజార్టీ వైపు దూసుకుపోవడంతో మార్కెట్లకు కిక్కు ఇచ్చింది. స్థిరమైన నాయకత్వంలో దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతోందనే సూచనలో నిఫ్టీ 12 వేల మార్కును, సెన్సెక్స్‌ 40 వేల మార్కును దాటేశాయి. ఉదయం 10.40 సమయంలో నిఫ్టీ 270 పాయింట్ల లాభంతో 12,008 వద్ద, సెన్సెక్స్‌ 909 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ 40,020 వద్ద ట్రేడయింది. ఉదయం 11 గంటల సమయానికి మధుపరుల సంపద ఏకంగా రూ.2.87లక్షల కోట్లు వృద్ధి చెందింది. నిఫ్టీ ఐటీ సూచీ, నిఫ్టీ పీఎస్‌యూ సూచీలు దాదాపు 7 శాతం లాభాలను సాధించాయి.

వీటి తర్వాత స్థానంలో 3 శాతం లాభంతో ప్రైవేటు బ్యాంక్‌ సూచీలు ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో అదానీ పోర్టు, యస్‌బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, బీపీసీఎల్‌ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఇక వేదాంత, హిందాల్కో, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌, టీసీఎస్‌ షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు దాదాపు 10 శాతం పెరిగాయి. కొత్త ప్రభుత్వం పీఎస్‌యూ, రక్షణ రంగ కంపెనీల్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండటంతో ఈ రంగాల షేర్లు దూసుకెళ్లాయి.