వయనాడ్ (కేరళ), మే 23 (న్యూస్‌టైమ్): సార్వత్రిక ఎన్నికలలో రెండు లోక్‌సభ స్థానాల నుంచి పోటీచేసిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అందులో ఒక స్థానం నుంచి ఘన విజయం సాధించారు. అయితే, ఆ గెలుపొందిన స్థానం ముందు ఎవరూ ఊహించనిది కావడం విశేషం. రాహుల్‌ గాంధీ తొలిసారిగా దక్షిణాది రాష్ట్రమైన కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే.

ఈ స్థానంలో రాహుల్‌ విజయం సాధించారు. మరోవైపు, కాంగ్రెస్‌ కంచుకోట అయిన యూపీలోని అమేఠీలో మాత్రం రాహుల్‌ ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. ఇక్కడ భాజపా నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వయనాడ్‌ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. అప్పటి నుంచి కాంగ్రెస్‌ ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తోంది. దీంతో దక్షిణాది నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన రాహుల్‌ వయనాడ్‌ను ఎంచుకున్నారు. అయితే, ఇది రాహుల్‌ అమేఠీ గెలుపుపై ప్రభావం చూపించింది.

దేశవ్యాప్తంగా ప్రచారాలు చేపట్టడంతో పాటు, వయనాడ్‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సి రావడంతో రాహుల్‌ అమేఠీ ప్రజలకు అందుబాటులో లేకపోయారు. దీంతో అక్కడి ఓటర్లు స్మృతి ఇరానీకి మొగ్గు చూపినట్లు కన్పిస్తోంది. కాగా, కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా భారతీయ జనతా పార్టీ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తాజా ఫలితాలను విశ్లేషిస్తే, 1977, 1980 ఫలితాలతో నేటి ఫలితాలను పోల్చి చూడొచ్చు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం, భాజపా దాదాపు 40 శాతం ఓట్‌ షేర్‌తో దూసుకుపోయింది. 2014లో భాజపాకు 31 శాతం ఓట్లు నమోదయ్యాయి.

ఆ పార్టీకి గత ఫలితాల కంటే ఈ సారి 9 శాతం ఓట్లు అధికంగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 1984 ఫలితాలను పక్కనబెడితే ఆ తర్వాత ఇప్పటివరకు ఏ పార్టీ 40 శాతం స్థాయిలో ఓట్లను సాధించలేదు. 1984లో ఇందిరా గాంధీ హత్య అనంతరం ఆమె కుమారుడు రాజీవ్‌ గాంధీ నేతృత్వంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అఖండ విజయం సాధించింది. 514 స్థానాలకు గానూ 404 సీట్లు గెలుచుకుంది. ఆ సమయంలో ఆ పార్టీకి 48.1 శాతం ఓటింగ్‌ వచ్చింది.

అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ రికార్డు బద్దలు కాలేదు. ప్రస్తుతం భాజపాకు సానుకూలంగా కొనసాగిన ఈ ట్రెండింగ్‌‌ను గమనిస్తే, భాజపాకు 1984 రికార్డు బద్దలు కొట్టే అవకాశం లేకపోయినప్పటికీ 1977, 1980లో వచ్చిన ఓటింగ్‌ శాతానికి చేరువగా నిలిచే అవకాశం ఉంది. 1980లో కాంగ్రెస్‌కు 42.7 శాతం ఓటింగ్ వచ్చింది. 1977లో జనతా పార్టీ 41.3 శాతం ఓటింగ్ సాధించింది. 2014లో భాజపాకు 31 శాతం ఓట్‌ షేర్‌ వచ్చింది. అత్యవసర స్థితి తర్వాత నిర్వహించిన మొదటి ఎన్నికల్లో (ఆరో లోక్‌సభకు 1977) జనతా పార్టీ విజయం సాధించింది. భారతీయ లోక్‌దళ్, జన సంఘ్‌, పాత కాంగ్రెస్‌ కలిసి ఈ జనతా పార్టీని ఏర్పాటు చేశాయి. భారతీయ లోక్‌దళ్ ఎన్నికల గుర్తుపై జనతా పార్టీ పోటీ చేసింది.

ఆ సమయంలో 542 స్థానాలకు ఎన్నికలు జరగగా 295 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్‌ 154 స్థానాలకే పరిమితమైంది. మొరార్జీ దేశాయ్‌ ప్రధానమంత్రి అయ్యారు. 1979లో ఈ కూటమి నుంచి కొన్ని పార్టీలు వైదొలగడంతో చరణ్‌ సింగ్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. జనతా పార్టీ ప్రభుత్వం కూలిపోవడంతో 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో (ఏడో లోక్‌సభకు 1980-84) ఇందిరా గాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ విజయం సాధించింది. 529 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 353 సీట్లలో ఆమె పార్టీ గెలుపొందింది.

2014 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ 282 సీట్లను సాధించగా కాంగ్రెస్‌కు కేవలం 44 సీట్లు మాత్రమే దక్కాయి. 1984 తర్వాత కూటమి అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన పూర్తి మెజార్టీని ఓ పార్టీ సాధించడం అదే తొలిసారి. గురువారం కొనసాగిన ట్రెండ్‌ను గమనిస్తే భాజపా 1977, 1980 అత్యధిక ఓట్ల శాతం రికార్డులకు చేరువయ్యే అవకాశం ఉంది.