హైదరాబాద్, మే 23 (న్యూస్‌టైమ్): గత లోక్‌సభ సాధారణ ఎన్నికలతో పోల్చిచూస్తే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పుంజుకున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో 16 చోట్లా తమదే విజయమన్న అధికార తెరాసకు ఆ స్థాయిలో ఫలితాలు కనిపించ లేదు. ఇక్కడ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించని జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పుంజుకోవడం విశేషం.

తాజాగా వెలువడిన ఫలితాల్లో ఈ రెండు పార్టీలు కలిపి 8 చోట్ల తమ ఉనికి చాటుకున్నాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలుండగా ఒక ఒక ఏఐఎంఐఎంకు తెరాస కేటాయించింది. మిగిలిన పదహారు చోట్ల తనే అభ్యర్ధులను నిలిపింది. మెదక్‌ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. మధ్యాహ్నం రెండు గంటల వరకూ వచ్చిన ఫలితాలను బట్టి నాగర్‌ కర్నూల్‌లో తెరాస అభ్యర్థి రాములు ముందంజలో కొనసాగుతున్నారు.

కరీంనగర్‌లో 9వ రౌండ్‌ ముగిసే సరికి భాజపా అభ్యర్థి బండి సంజయ్‌ 55 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. హైదరాబాద్‌లో ఎఐఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ 85 వేల ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. సికింద్రబాద్‌లో భాజపా అభ్యర్థి కిషన్‌ రెడ్డి భారీ ఆధిత్యకంతో ముందంజలో కొనసాగుతున్నారు. అలాగే మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌ రెడ్డి 3781 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

భువనగిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయం సాధించారు. పెద్దపల్లిలో తెరాస అభ్యర్థి వెంకటేశ్‌ నేత ఆధిక్యంలో ఉన్నారు. చేవెళ్లలో కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నిజామాబాద్‌లో భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌, తన సమీప తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవితపై ఆధిక్యంతో ఉన్నారు. ఖమ్మంలో తెరాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు ముందంజలో ఉన్నారు. మెహబూబాబాద్‌లో తెరాస అభ్యర్థి కవిత మాలోతు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

జహీరాబాద్‌లో తెరాస అభ్యర్థి బీబీ పటేల్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహబూబ్‌నగర్‌లో తెరాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌ రెడ్డి విజయం సాధించారు. అదిలాబాద్‌లో భాజపా అభ్యర్థి సోయం బాపురావు ముందంజలో కొనసాగుతున్నారు. వరంగల్‌లో తెరాస అభ్యర్థి దయాకర్‌ పసునూరి ఆధిక్యంలో ఉన్నారు.