విశాఖపట్నం, మే 24 (న్యూస్‌టైమ్): కోప రహిత జీవనాన్ని ప్రోత్సహిస్తూ ప్రపంచ వ్యాప్తంగా శాంతిని స్థాపించడానికి కృషిచేసిన డాక్టర్‌ డీన్‌ వాన్‌ లీవిన్‌ ఒక మహర్షితో సమానమని ఏయూ జర్నలిజం విభాగాధిపతి ఆచార్య పి.బాబి వర్థన్‌ అన్నారు. డాక్టర్‌ డీన్‌ వాన్‌ లీవన్‌ సంస్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ క్రోధ రహిత జీవనాన్ని అలవరచుకోవడానికి లీవన్‌ చేసిన కృషి, ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

సెంటర్‌ ఫర్‌ ఎమోషనల్‌ లాంగ్వేజ్‌ లెర్నింగ్‌ కార్యదర్శి చల్లా క్రిష్ణవీర్‌ అభిషేక్‌ మాట్లాడుతూ వ్యక్తిగత కోపం వ్యక్తిగత శాంతికి అవరోధంగా నిలుస్తోందన్నారు. వ్యక్తి జీవన శైలిని, విధానాన్ని ఇది ఎంతో ప్రభావితం చేస్తుందన్నారు. తద్వారా ప్రపంచ శాంతికి విఘాతంగా నిలుస్తుందన్నారు. డాక్టర్‌ డీన్‌ వాన్‌ జ్ఞాపకార్ధం చల్లా క్రిష్ణవీర్‌ అభిషేక్‌ రూ 12000 చెక్‌ను ఇచ్ఛా ఫౌండేషన్‌కు అందజేశారు.

దివ్యాంగ చిన్నారుల కోసం నిర్వహిస్తున్న ఇచ్ఛా ఫౌండేషన్‌ పేదలకు ఉపయుక్తంగా నిలుస్తోంది. ఇచ్ఛా ఫౌండేషన్‌ ఫౌండర్‌ టి.మధు, డాక్టర్‌ కె.శాంతి, కౌసల్య దేవి, డాక్టర్‌ ఆదిశేషు, బి.వి.కె చైతన్య, నిఖిత తదితరులు పాల్గొన్నారు.