విశాఖపట్నం, మే 24 (న్యూస్‌టైమ్): గిరిజన ప్రగతిని విశ్వవాప్యం చేస్తానని అరకు నూతన ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ తెలిపారు. ఆంధ్రాయూనివర్సిటీలోని తెలుగు విభాగంను ఆయన శుక్రవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా విభాగాధిపతి ఆచార్య జెర్రా అప్పారావు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ మాట్లాడుతూ గిరిజనుల సంపూర్ణ వికాసానికి అవసరమైన ప్రణాళికలు అమలు చేస్తేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

పర్యాటక ప్రాంతంగా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన అరకు శాసన సభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం వెనుక నియోజవర్గ ఓటర్లు, వైఎస్సార్‌సిపి అధినేత, నూతన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌, ఇతర పెద్దల ఆశీస్సులే కారణం అన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని పేర్కొన్నారు. గిరిజనుల సమగ్రత, హక్కుల పరిరక్షణ, సామాజిక వికాసానికి మెరుగైన కృషిచేస్తానన్నారు.

గతంలో తాను పాడేరులో ఎస్‌బిఐ మేనేజర్‌గా పనిచేశానని అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించానన్నారు. పెదబయలు మండలంలోని సీకరి తన స్వగ్రామమని, అమ్మ పేరు తవుడమ్మ, నాన్న పేరు ఫకీరుగా పేర్కొన్నారు. తమది వ్యవసాయ కుటుంబమని, తనను గెలిపించిన ఓటర్లకు నిత్యం రుణ పడి ఉంటానని తెలిపారు. అంకిత భావంతో పనిచేసి అరకును మరింత ప్రగతి పథంలో నిలుపుతామని చెప్పారు. తెలుగుశాఖాధిపతి ఆచార్య చెర్రా అప్పారావు మాట్లాడుతూ విలువలతో కూడిన వ్యక్తిత్వంతో మసలుకుంటే సమాజంలో ఆదరణ తప్పక ఉంటుందని దానికి అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ ప్రత్యేక నిదర్శనంగా అభివర్ణించారు.

హెచ్‌ఆర్‌ఎం విభాగం బిఓఎస్‌ చైర్మన్‌ ఆచార్య పుట్టపల్లి అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ గిరిజనుల సంపూర్ణ వికాసానికి అంకిత భావంతో కృషి చేయాలని కోరారు. లేబర్‌ కమిషనర్‌ చెట్టి పురుషోత్తమ్‌ మాట్లాడుతూ ఫల్గుణ విజయం గిరిజనులకు ఎంతో స్ఫూర్తి నింపిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ అడకట్ల సన్యాశిరావు, ఉపాధ్యాయులు జంపరంగి లలిత శంకరమ్‌, బత్తిరి దిలీప్‌కుమార్‌, ఆడకట్ల రాజకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.