భోపాల్, మే 25 (న్యూస్‌టైమ్): మధ్యప్రదేశ్‌లో గోరక్షకులు రెచ్చిపోయారు. నిషేధం ఉన్నప్పటికీ గోమాంసం తీసుకెళ్తున్నారన్న ఆరోపణలపై కొందరు యువకులు ఓ మహిళ సహా ముగ్గుర్ని చితకబాదారు. అంతేకాకుండా జైశ్రీరాం అంటూ నినదించాలని వారిని బలవంతం చేశారు. ఆలస్యంగా రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనతో సంబంధమున్న ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. భోపాల్‌కు సమీపంలోని సియోని పట్టణంలో ఓ ఆటోలో ఎద్దు మాంసం తీసుకెళ్తున్న ముగ్గురు వ్యక్తులను గోరక్షకులుగా అనుమానిస్తున్న కొందరు యువకులు అడ్డగించారు.

ఆటో నుంచి వారిని కిందికి దించి కర్ర, చెప్పుతో కొట్టారు. దాడికి గురైన వారిలో ఓ మహిళ కూడా ఉన్నారు. చేతులు విరిచిపట్టుకున్న యువకులు ఒకరి తర్వాత ఒకరు వారిని తీవ్రంగా కొట్టారు. విడిచిపెట్టాలని వేడుకోగా జైశ్రీరాం అంటూ నినదించాలని వారిని బలవంతపెట్టారు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామని సియోని జిల్లా ఎస్పీ లలిత్ శాక్యవార్ తెలిపారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేయాల్సి వచ్చింది. కాగా, రామ్‌సేన కార్యకర్తగా చెప్పుకొంటున్న శుభంసింగ్ అనే వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో ఈ నెల 23న పోస్టింగ్ చేసి అనంతరం తొలిగించాడు.

అరెస్ట్ అయిన వారిలో శుభంసింగ్ కూడా ఉన్నారు. నిషేధం ఉన్నప్పటికీ ఎద్దు మాంసం తరలిస్తున్నట్టు కొందరు గోరక్షకులు అదేరోజు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసుకొన్న పోలీసులు ఆటోలోని మాంసంను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. గోరక్షకుల దాడిని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా ఖండించారు. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర సీఎం కమల్‌నాథ్‌ను డిమాండ్ చేశారు.