నల్గొండ: మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగలు, బైక్‌పై వచ్చి చైన్‌తో మాయం, కళ్లు గప్పి నగలు చోరీ అంటూ వార్తలు వింటుంటాం. ఒంటరిగా రోడ్డుపై నడవాలంటేనే హడలెత్తిపోయేలా చైన్‌ స్నాచర్లు దొంగతనాలకు పాల్పడుతున్నారు. కళ్లు మూసి తెరిచేలోపు జీవితకాల కష్టాన్ని క్షణాల్లో మాయం చేస్తున్నారు. ఇలా చైన్‌ స్నాచర్లు నెలకు కూడబెడుతున్న సంపద గురించి వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చైన్‌ స్నాచర్ల సంపద 50 కోట్లని పోలీసులు లెక్కలేస్తున్నారు. రాష్ట్రం మొత్తంమీద సుమారు 400 మందికి పైనే స్నాచర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

వారంతా రోజుకు 10 లక్షల విలువైన బంగారాన్ని దోచుకెళ్తున్నట్లు సమాచారం. గత మూడేళ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి 4 వేలకు పైగా కేసులు సగటున నమోదయ్యాయి. గజదొంగ శివ ఎన్‌కౌంటర్‌ తర్వాత అతని ఆస్తుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒక్క శివ ఆస్తుల విలువే సుమారుగా 14 కోట్ల రూపాయల దాకా ఉంటుందని పోలీసులు తేల్చారు. 700 స్నాచింగ్‌లకు పాల్పడి ఏ మాత్రం రికవరీ కాకుండా జాగ్రత్త పడి ఇంతగా కూడబెట్టాడని తేలింది. శివ ఇష్యూ ఇలా ఉండగా తెలంగాణలోని మొత్తం స్నాచర్లలో 150 మంది హైదరాబాద్‌, 120 మంది సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిల్లో ఉన్నారు.

150 మంది మిగతా తెలంగాణ జిల్లాల్లో ఉన్నట్లు సమాచారం. అయితే స్నాచర్లు ఒక ఏరియాలోనే స్థిరంగా ఉండట్లేదు. వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ఇక్కడి నుంచి వివిధ జిల్లాలకు వెళ్తుంటారు. నగరంలో ఉన్న చైన్‌ దొంగల్లో 80 మంది వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారే ఉన్నారని పోలీసులు అంటున్నారు. బంగారం ధర 30 వేల మార్కు తాకటడంతో దొంగలు స్నాచింగ్‌నే సంపాదనకు ఈజీ మార్గంగా భావిస్తున్నారు. ఇక జల్సాలకు అలవాటు పడ్డ విద్యార్ధులు సైతం అదే పనిచేస్తున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి ఫ్లైట్లో వచ్చి మరీ దొంగతనాలకు పాల్పడ్డ సంఘటనలున్నాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. స్నాచింగ్‌నే ప్రవృత్తిగా ఎంచుకున్న దొంగలు మహిళల ప్రాణాలు తీయడానికి సైతం వెనకాడటం లేదు. అలాంటి వారి పట్ల కఠిన వైఖరి అవలంబించి ఏరిపారేయాలని డిమాండ్‌ వినిపిస్తోంది.