హైదరాబాద్, మే 25 (న్యూస్‌టైమ్): తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్‌ దంపతులకు సీఎం కేసీఆర్‌, మంత్రులు స్వాగతం పలికారు. ఈనెల 30న తన ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని సీఎం కేసీఆర్‌ను జగన్‌ ఆహ్వానించారు.

ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడమే తమ విధానమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా అదే విధానం అవలంభిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని సీఎం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి, వైఎస్ఆర్సిపి ఎల్.పి. నేతగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకుల మధ్య కొద్ది సేపు చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మంచి సంబంధాలు నెలకొల్పుతామని సీఎం కేసీఆర్ స్నేహహస్తం అందించారు.

‘‘ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడం మంచిదని మేము మొదటి నుంచి భావిస్తున్నాము. నేను స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశాను. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ – మహారాష్ట్ర మధ్య ఉన్న జల వివాదాల కారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోవడంపై నేనే చొరవ తీసుకుని మాట్లాడాను. లివ్ అండ్ లెట్ లివ్ తమ విధానమని చెప్పాను. వివాదాలు పరిష్కరించుకోవడం వల్ల రెండు రాష్ట్రాలకు మేలని చెప్పాను. దీంతో సహకరించడానికి మహారాష్ట్ర ముందుకొచ్చింది. ఫలితంగా కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు నిర్మించుకోగలుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా ఇలాంటి సంబంధాలనే కొనసాగించాలన్నది మా విధానం. రెండు రాష్ట్రాలకు మేలు కలిగేలా వ్యవహరిద్దాం’’ అని జగన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

‘‘గోదావరి నది నుంచి ప్రతీ ఏటా 3,500 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం గరిష్టంగా 700-800 టీఎంసీలు మాత్రమే వాడుకోగలదు. మిగతా నీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకునే వీలుంది. ప్రకాశం బ్యారేజి ద్వారా సోమశిల వరకు గ్రావిటీ ద్వారానే గోదావరి నీటిని పంపించవచ్చు. దీంతో యావత్ రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చు. కేవలం రెండు లిఫ్టులతో గోదావరి నీళ్లను రాయలసీమకు పంపించవచ్చు. గోదావరి నీళ్లను వాడుకుని ఆంధ్రప్రదేశ్ రైతులకు సాగునీరు ఇవ్వవచ్చు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.

త్వరలోనే రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో సహా సమావేశమై అన్ని అంశాలపై చర్చించుకోవాలని ఇద్దరు నాయకులు నిర్ణయించారు.