హైదరాబాద్, మే 25 (న్యూస్‌టైమ్): ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన వైఎస్ జగన్ ప్రగతి భవన్ వచ్చిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఘన స్వాగతం పలికారు. జగన్‌ను ఆలింగనం చేసుకున్నారు. పోచంపల్లి ఇక్కత్ శాలువాకప్పి సన్మానించారు. కరీంనగర్ పిలిగ్రీ జ్ఞాపిక బహుకరించారు. సీఎం బాధ్యతల్లో విజయవంతం కావాలని జగన్‌ను దీవించారు. స్వీటు తినిపించి సంతోషం పంచుకున్నారు. రాష్ట్ర మంత్రులను, ఇతర ప్రముఖులను జగన్ కు పరిచయం చేశారు. జగన్ భార్యకు కేసీఆర్ సతీమణి శోభారాణి, కేటీఆర్ సతీమణి శైలిమ స్వాగతం పలికారు.

జగన్ వెంట ఆంధ్రప్రదేశ్ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. కేసీఆర్‌తో పాటు జగన్‌కు స్వాగతం తెలిపిన వారిలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రులు మహమూద్ అలీ, ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస గౌడ్, మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, ఎంపీ జె. సంతోష్ కుమార్, మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్ రెడ్డి తదితరులున్నారు.