బిష్కెక్(కిర్గిజ్‌స్థాన్), మే 25 (న్యూస్‌టైమ్): ప్రస్తుతం వార్తా ప్రసార వ్యవస్థను న్యూ మీడియా విస్తరింపచేసిందని, దీనిలో మనలోని ప్రతి ఒక్కరు సమాచార వ్యాప్తి ప్రక్రియలో ఒక నిర్మాతగానే కాకుండా ఒక వినియోగదారుగా కూడా ఉన్నారని హైదరాబాద్‌లోని పత్రికా సమాచార కార్యాలయం (పిఐబి) ప్రాంతీయ అదనపు డైరెక్టర్ జనరల్ టి.వి.కె. రెడ్డి అన్నారు. కిర్గిజ్‌స్తాన్‌లోని బిష్కెక్‌లో జరిగిన సెకండ్ మాస్ మీడియా ఫోరమ్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఒ)లో పాలుపంచుకొన్న భారతదేశ ప్రతినిధివర్గం అధిపతి హోదాలో టి.వి.కె. రెడ్డి ప్రారంభోపన్యాసమిస్తూ, న్యూ మీడియా నుంచి పోటీ ఉన్నప్పటికీ సాంప్రదాయక ప్రసార మాధ్యమాలకు పాఠకులు, శ్రోతలు పెద్ద సంఖ్యలో ఉన్నారని వివరించారు. అంతేకాకుండా ‘నకిలీ వార్తల’ను ప్రచారంలోకి తీసుకురావడమనేది ఆందోళనను కలిగిస్తున్నటువంటి ఒక ధోరణిగా మారిపోయిందని కూడా ఆయన అన్నారు.

సభ్యత్వ దేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని, ఇంకా బాధ్యతను పెంపొందించడం కోసం ఎస్‌సిఒ సెక్రటేరియట్‌లో ఒక నిజ నిర్ధారణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ఉపయోగకరంగా ఉండగలదని టి.వి.కె. రెడ్డి సూచన చేశారు. నేటి గ్లోబల్ వరల్డ్‌లో సాంస్కృతిక పరమైన చర్చ సాధ్యపడాలంటే అరమరికలు లేనటువంటిది, సానుకూల వైఖరిని కలిగివున్నదీ అయినటువంటి మీడియా ఎంతైనా అవసరమని ఆయన తెలిపారు. యూరేషియా ప్రాంత దేశాలకు సంబంధించిన రాజకీయ, ఆర్థిక, సైనిక సంబంధ సంస్థగా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఒ) పనిచేస్తోంది. భారతదేశం, కజకిస్తాన్, కిర్గిజ్‌స్తాన్, రష్యా, ఉజ్ బెకిస్తాన్, పాకిస్తాన్, చైనాలకు ఎస్‌సిఒలో సభ్యత్వం ఉంది.

ఈ సంస్థలోని సభ్యత్వ దేశాల మధ్య భద్రతపరమైనటువంటి సమస్యలను, రహస్య సమాచారాన్ని వెల్లడించుకోవడానికి, ఇంకా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సహకారం ఉండాలనేది ఎస్‌సిఒ లక్ష్యాలలో కేంద్ర బిందువుగా ఉంది. సభ్యత్వ దేశాల మధ్య పరస్పర విశ్వాసం, గౌరవం వర్ధిల్లేందుకు ఇరుగు పొరుగు దేశాల నడుమ దీర్ఘకాల ప్రాతిపదికను కలిగివుండేటటువంటి సయోధ్య, మైత్రి, ఇంకా సహకారం ముఖ్యం అనేది షాంఘై స్ఫూర్తికి కీలకంగా ఉంది. ప్రపంచ జనాభాలో దాదాపు సగం జనాభాకు, అలాగే ప్రపంచ జీడీపీలో నాలుగో వంతు జీడీపీకి ఎస్‌సిఒలోని సభ్యత్వ దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.


Fatal error: Allowed memory size of 67108864 bytes exhausted (tried to allocate 49 bytes) in /home/content/99/10169099/html/newstimews/wp-includes/cache.php on line 676