• ఎంపీలంతా చిత్తశుద్ధితో పోరాడాలని పిలుపు

  • వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రసంగం

  • ఏపీ శాసనసభాపక్ష నేతగా యువనేత ఏకగ్రీవ ఎన్నిక

అమరావతి, మే 25 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడమే ఎజెండాగా పనిచేయాలని దిశానిర్దేశంచేశారు. ఏపీలో ప్రతి కార్యకర్త తోడుగా నిలువడం వల్లనే ఇంతటి భారీ విజయం సాధ్యమైందన్నారు. అనైతిక రాజకీయాలు చేసిన చంద్రబాబునాయుడును దేవుడు శిక్షించాడని వ్యాఖ్యానించారు. శనివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసంలో శాసనసభాపక్ష సమావేశం, అనంతరం పార్లమెంటరీ పార్టీ సమావేశం వరుసగా జరిగాయి.

శాసనసభాపక్ష సమావేశంలో జగన్మోహన్‌రెడ్డిని పార్టీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. జగన్ పేరును పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రతిపాదించగా పార్టీ ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, కె. పార్థసారథి, ఆదిమూలపు సురేశ్, రాజన్నదొర, బుగ్గన రాజేంద్రనాథ్, ముస్తాఫా, ఆళ్ల నాని, ప్రసాదరాజు, కోన రఘుపతి, ఆర్కే రోజా, పినేపి విశ్వరూప్, నారాయణస్వామి బలపరిచారు. జగన్ ఎన్నికను పార్టీ ఎమ్మెల్యేలందరూ హర్షాతిరేకాలతో ఆమోదం తెలిపారు.

అనంతరం అక్కడే వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. తాజాగా ఎన్నికైన ఎంపీలతో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ విలువలు, విశ్వసనీయతకు ప్రజలు ఓటు వేశారని, దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా పనిచేద్దామని అన్నారు. ‘‘నన్ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ విజయానికి కారణం నాతోపాటు మీరందరూ, ప్రతి గ్రామంలోని కార్యకర్త నాకు తోడుగా ఉండటంతోనే ఈ విజయం సాధ్యమైంది. ఈ విజయం సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.

మనం మరింత బాధ్యతతో ముందుకు వెళ్లాలి. దేశం మొత్తం ఏపీ వైపు చూ సేలా పనిచేద్దాం. ఆరు నెలల్లో మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటాను. 3,600 కిలోమీటర్ల పాదయాత్రను ఎప్పటికీ మర్చిపోలేను. 2024లో ఇంతకంటే గొప్పగా గెలవాలి. 2024లో మన సమర్థతకు ఓటేసే పరిస్థితి రావాలి. ఏపీ ప్రజలకు సుపరిపాలన అందించాలి. సుపరిపాలనకు మీ అందరి సహాయ సహకారాలు కావాలి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించాలి. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచింది వైఎస్సార్సీపీయే అని జగన్ పేర్కొన్నారు.

‘‘ప్రత్యేక హోదా సాధనే మన లక్ష్యం. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం నిరంతరం శ్రమించాలి. ఏపీకి ప్రత్యేక హోదాయే అజెండా. కేంద్రాన్ని ఒప్పించి హోదా సాధించాలి’’ అని జగన్ దిశానిర్దేశం చేశారు. అనైతికంగా, అక్రమంగా వ్యవహరించేవారిని దేవుడు ఎలా శిక్షిస్తాడో ఎన్నికల ఫలితాలు నిరూపించాయని ఏపీ మాజీ సీఎం బాబును ఉద్దేశించి జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కొన్నాడు. ఇప్పుడు బాబు గెలిచినవి 23, గెలిచిన ఎంపీ సీట్లు కూడా మూడే, ఎన్నికల ఫలితాలు వచ్చిన తేదీ కూడా 23. దేవుడు అంత గొప్పగా స్క్రిప్ట్ రాశాడు అని జగన్ వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ పార్టీ నేత ఎంపికను ప్రస్తుతానికి వాయిదా వేశారు.