టోక్యో, మే 26 (న్యూస్‌టైమ్): జపాన్‌లోని టోక్యో ఒలింపిక్స్‌లో సేవలను అందించేందుకు రూపొందించిన అత్యాధునిక బుల్లెట్ రైలు ‘సుప్రీం’ రికార్డుస్థాయి వేగంతో దూసుకుపోతోంది. టెస్ట్ రన్‌లో గంటకు 360 కిలోమీటర్ల (224 మైళ్ల) వేగంతో పయనించిందని సెంట్రల్ జపాన్ రైల్వే (జేఆర్) ఆపరేటర్ తెలిపారు. ఎన్700 శింకన్‌సేన్ రైలుకు ప్రత్యామ్నాయంగా వస్తున్న ఈ బుల్లెట్ రైలు తక్కువ బరువు కలిగి ఉండటంతోపాటు ప్రస్తుత మున్న డిజైన్లలో తక్కువ ఇంధనంతో నడుస్తుందని, భూకంపాలు సంభవించిన సమయాల్లోనూ అత్యంత సురక్షితంగా ప్రయాణిస్తుందని పేర్కొన్నారు.

మాయిబర- క్యోటో మార్గాలను కలిపేచోట నిర్వహించిన టెస్ట్ రన్‌లో ఈ రైలు గంటకు 360 కిలోమీటర్ల వేగంతో సరికొత్త రికార్డును సృష్టించిందని చెప్పారు. ఇది వినియోగంలోకివస్తే గంటకు 285 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. జపాన్ రైల్వే 220 కోట్ల డాలర్లను వెచ్చించి బుల్లెట్ రైలును పరిచయం చేస్తుండగా, పూర్తిస్థాయి వేగానికి చేరుకొనేలా జూన్‌ నెల రెండోవారం వరకు టెస్ట్ రన్ నిర్వహించనున్నారు. ఈ రైలు 2030 నుంచి అందుబాటులోకి రానుంది.