ముంబయి, మే 26 (న్యూస్‌టైమ్): భారత్‌లోని దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా లండన్ ప్రయాణమైన జెట్ ఎయిర్‌వేస్ మాజీ చైర్మన్ నరేశ్ గోయల్ దంపతులు చివరికి ముంబయి ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్ తనిఖీల్లో పట్టుబడ్డారు. వీరిని అడ్డుకున్న ముంబై ఎయిర్‌పోర్టు ఇమ్మిగ్రేషన్ అథారిటీ అధికారులు మరికాసేపట్లో ఎగిరే విమానం నుంచి దింపేశారు. వీరి నుంచి నాలుగు భారీ సూట్‌కేసుల లగేజీని సైతం స్వాధీనం చేసుకున్నారు.

జెట్ ఎయిర్‌వేస్ మాజీ చైర్మన్ నరేశ్ గోయల్, ఆయన భార్య అనితా గోయల్‌లు దేశం విడిచి వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. లండన్‌కు బయలుదేరిన ఈ దంపతులను శనివారం ముంబయి ఎయిర్‌పోర్టు ఇమ్మిగ్రేషన్ అథారిటీ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఆపేసింది. దుబాయ్ మీదుగా లండన్‌కు వెళ్తున్న ఎమిరేట్స్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఈకే 507 విమానంలో గోయల్ దంపతులు ఎక్కగా, అది తెలుసుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. మరికాసేపట్లో ఎగిరేందుకు సిద్ధమైన విమానాన్ని తిరిగి పార్కింగ్ ప్లేస్‌కు రప్పించడం గమనార్హం. కాగా, నాలుగు భారీ సూట్‌కేసులతో గోయల్ దంపతులు లండన్‌కు వెళ్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఈ లగేజీ అనితా గోయల్ పేరిట ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, అనుకోని ఈ పరిణామంతో విమానం గంటన్నర ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది. మధ్యాహ్నం 3:35 గంటలకే వెళ్లాల్సి ఉండగా, అనుకోని ఈ పరిణామంతో సాయంత్రం 5గంటలకు ఎగిరింది. కాగా, దీనిపై నరేశ్ గోయల్ స్పందన తెలియకుండగా, ఎమిరేట్స్ మాత్రం అధికారులకు సహకరించినట్లు ప్రకటించింది. గోయల్ దంపతులపై లుకౌట్ నోటీసులు ఉన్నందునే ఆపామని హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా, కష్టాల్లో ఉన్న జెట్ ఎయిర్‌వేస్‌లో పెట్టుబడులపై ఎతిహాద్, హిందుజా గ్రూప్‌లతో చర్చలు జరుపడానికే ఈ దంపతులు లండన్‌కు బయలుదేరినటు సన్నిహిత వర్గాల సమాచారం.

గత నెల జెట్ ఎయిర్‌వేస్ అధికారులు, సిబ్బంది సంఘం అధ్యక్షుడు కిరణ్ పవాస్కర్ గోయల్ దంపతుల పాస్‌పోర్టులను సీజ్ చేయాలని ముంబై పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. జెట్ ఎయిర్‌వేస్ డైరెక్టర్లు, దాని ఉన్నతోద్యోగుల పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకోవాలని ఆ లేఖలో కిరణ్ కోరారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు గోయల్ దంపతులను విమానాశ్రయ అధికారులు అడ్డుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రూ.8,500 కోట్లకుపైగా రుణ భారాన్ని మోస్తున్న జెట్ ఎయిర్‌వేస్ ఏప్రిల్ 17న విమాన సేవలను నిలిపివేసిన సంగతి విదితమే. అంతకుముందే సంస్థ బోర్డు నుంచి గోయల్ దంపతులు బయటకు రాగా, చైర్మన్ పదవికీ నరేశ్ గోయల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

నెలల తరబడి జీతాలు అందుకోని సంస్థ ఉద్యోగులు యాజమాన్యం తీరుపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. సంస్థ పునరుద్ధరణకు ఎస్‌బీఐ నేతృత్వంలోని జెట్ రుణదాతల కమిటీ ప్రయత్నిస్తున్నా ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేవు. హిందుజాలు పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తుండటం ఉద్యోగులకు కొంతలో కొంత ఉపశమనంగా ఉంది.