హైదరాబాద్, మే 27 (న్యూస్‌టైమ్): జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొలిక్కి వస్తోంది. ముందుగా ఈ నెల 27న ఓట్ల లెక్కింపు చేయాల్సి ఉండగా జిల్లా, మండల పరిషత్ చైర్మన్ల ఎన్నికకు దాదాపు 40 రోజుల సమయం ఉండటంతో లెక్కింపును వాయిదావేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నిర్ణయించింది. వివిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తులు, పరిషత్ చైర్మన్ల కోసం లాబీయింగ్, క్యాంపు రాజకీయాలను అంచనా వేసి ఎస్‌ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలను వెల్లడించిన తర్వాత వీలైనంత త్వరగా ఎన్నికైన సభ్యుల మొదటి సమావేశాన్ని నిర్వహించేందుకు వీలుగా ప్రస్తుతమున్న మార్గదర్శకాలను సవరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి, కార్యదర్శి అశోక్‌కుమార్ శనివారం ప్రభుత్వానికి లేఖ రాశారు. మరోవైపు, జూన్ 20వ తేదీలోగా పరిషత్ ఓట్లు లెక్కించేందుకు నిర్ణయం తీసుకొంటున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ అవతరణదినం ఉత్సవాల నిర్వహణపై శనివారం వివిధ జిల్లాల్లో అధికారులతో కలెక్టర్లు జరిపిన సమీక్షలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ చర్చకు వచ్చినట్టు సమాచారం. కొందరు జూన్ 7న, మరికొందరు జూన్ 12న, ఇంకొందరు జూన్ 20న కౌంటింగ్ జరిపితే బాగుంటుందని ఎస్‌ఈసీకి సూచించినట్టు తెలిసింది.

ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు జూన్ 20వ తేదీలోగా ఓట్ల లెక్కింపు జరిపేందుకు మొగ్గు చూపుతున్నట్టు ఎస్‌ఈసీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ల పదవీకాలం జూలై మొదటివారంలో ముగియనున్నది. లెక్కింపు పూర్తయ్యేవరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంటున్నందున కొత్త పథకాలకు బ్రేక్ పడినట్టయింది. మూడు విడతల్లో పోలింగ్ పూర్తిచేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం బ్యాలెట్‌ బాక్సులన్నింటినీ వివిధ విద్యాసంస్థల్లో భద్రపరిచింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా మిగిలిన ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం జూలై 3 వరకు ఉన్నది.

జూలై 4లోగా ఎంపీటీసీలు పదవీ బాధ్యతలు చేపట్టాలి. జూలై 5 తర్వాత ఎంపీపీ ఎన్నికకు మండలస్థాయిలో నోటిఫికేషన్ జారీచేస్తారు. కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీలు కూడా జూలై 4 నుంచి అధికారంలోకి వస్తారు. జూలై 5 తర్వాత జెడ్పీ చైర్మన్ల ఎన్నికకు నోటిఫికేషన్ జారీచేస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఆగస్టు 5 తర్వాత ఎంపీపీ, ఆగస్టు 6 తర్వాత జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. జూన్ నెలాఖరులోగా లెక్కింపు చేపట్టేందుకు సిద్ధమేనని పేర్కొంటున్న ఎస్‌ఈసీ ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే లెక్కింపు తేదీలను అధికారింగా ప్రకటించనున్నారు.

ఫలితాలు వెల్లడించగానే వీలైనంత త్వరగా కొత్త సభ్యులతో తొలి సమావేశాన్ని నిర్వహించుకొనేందుకు ప్రస్తుతమున్న మార్గదర్శకాలను సవరించాలని ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తిచేసినట్టు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎస్‌ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్ తెలిపారు.

ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించిన తర్వాత ఎక్కువ ఆలస్యం జరుగకుండా జెడ్పీ చైర్మన్లు, వైస్‌చైర్మన్లు, మండలస్థాయిలో ఎంపీపీ, వైస్‌ఎంపీపీలను ఎన్నుకోవాల్సి ఉండటంతో ఈ సవరణ తోడ్పడుతుందని లేఖలో పేర్కొంది. ఇందుకోసం జెడ్పీ, ఎంపీపీల మొదటి సమావేశాన్ని నిర్వహించేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలను సవరించాలని ఎస్‌ఈసీ కోరింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాగానే పరిషత్ ఓట్ల లెక్కింపు తేదీని ప్రకటిస్తామన్నారు.