న్యూఢిల్లీ, మే 30 (న్యూస్‌టైమ్): కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరోసారి కొలువుదీరింది. రాష్ట్రపతి భవన్‌ వద్ద గురువారం సాయంత్రం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 58 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 58 మందితో కూడిన ఈ టీమ్‌లో 25 మంది (మోదీతో సహా) కేబినెట్‌, 9 మంది స్వతంత్ర హోదా, మిగిలిన 24 మంది కేంద్ర సహాయ మంత్రులుగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణం చేయించారు. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు విదేశీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక దిగ్గజ ప్రముఖులు హాజరయ్యారు.

ఇక, నరేంద్రుడి బృందంలో సభ్యుల గురించి సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే… ముందుగా రాజ్‌నాథ్ సింగ్ గురించి చెప్పాలి. ఆయన స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్. పోటీచేసి గెలుపొందిన నియోజకవర్గం లఖ్‌నవూ. ఉత్తర భారతదేశంలోనే కీలక రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌కు గతంలో ముఖ్యమంత్రిగా చేశారు రాజ్‌నాథ్. భాజపా జాతీయ అధ్యక్షుడిగా కూడా పార్టీకి సేవలందించిన ఆయన 2014లో కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా కొలువు తీరిన ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

రెండో ధిగ్గజం అమిత్ షా. స్వస్థలం గుజరాత్. నియోజకవర్గం గాంధీ నగర్‌. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర మంత్రిగా కీలక హోదాల్లో పనిచేశారు. 2014 నుంచి భాజపా జాతీయ అధ్యక్షుడిగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయ ఢంకా మోగించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయన మోదీ మంత్రి వర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక, నితిన్‌ గడ్కరీ. స్వస్థలం మహారాష్ట్ర. పోటీచేసి గెలుపొందిన నియోజకవర్గం నాగ్‌పూర్. నాగ్‌పూర్‌ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్యలో పట్టా పుచ్చుకున్న ఆయన రాజకీయ ప్రస్థానం ప్రత్యేకమైనదిగా పేర్కొనవచ్చు. తొలుత మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారాయన.

2009లో భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడిగా పనిచేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నాగ్‌పూర్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. నరేంద్రమోదీ ప్రభుత్వంలో ఉపరితల రవాణా శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. ఇప్పుడు మరోసారి కేంద్రమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. దక్షిణాదిలో పార్టీకి క్లిష్టపరిస్థితుల్లో సేవలందించిన నాయకుడు సదానంద గౌడ. ఆయన స్వస్థలం కర్ణాటక. న్యాయ శాస్త్రంలో పట్టాపొంది, ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేసిన ఆయన 2004లో కాంగ్రెస్‌ నేత వీరప్ప మొయిలీపై గెలిచి లోక్‌సభలో తొలిసారి అడుగుపెట్టారు. పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2011లో కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. నరేంద్ర మోదీ తొలి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు మరోసారి ఆయనకు అవకాశం వచ్చింది.

ఇక, నిర్మలా సీతారామన్ గురించి చెప్పుకోవాల్సి వస్తే? ఆమె స్వస్థలం తమిళనాడు. జేఎన్‌యూ నుంచి ఎంఫిల్‌ పూర్తి చేసిన ఆమె ఆంధ్రప్రదేశ్‌ను మెట్టినిల్లుగా ఎంచుకున్నారు. అదే విధంగా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కర్ణాటక నుంచి మరోసారి రాజ్యసభకు వెళ్లారు. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో తొలుత సహాయ మంత్రిగా సేవలందించారు. తర్వాత 2017లో రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మోదీ రెండో ప్రభుత్వంలోనూ ఆమెకు అవకాశం వచ్చింది. ఎన్డీయేలోని మరో కీలక భాగస్వామి రాంవిలాస్‌ పాసవాన్‌. ఆయన స్వస్థలం బిహార్‌. న్యాయ శాస్త్రంలో పట్టా పొందిన ఆయన 1977లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

తొలిసారి జనతాదళ్‌ తరఫున హాజీపూర్‌ నుంచి ఎన్నికయ్యారు. 2000లో లోక్‌ జనశక్తి స్థాపించారు. ఆరుగురు ప్రధాన మంత్రులతో మంత్రిగా విధులు నిర్వహించడం ఆయన పత్యేకతల్లో ఒకటి. రాజకీయ జీవితంలో 8సార్లు లోక్‌సభకు, ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లో ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఘన విజయం సాధించిన అందరి దృష్టినీ ఆకట్టుకున్న స్మృతి ఇరానీ స్వస్థలం ఢిల్లీ. అయితే ఆమె పోటీచేసిన గెలుపొందిన నియోజకవర్గం మాత్రం ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ.

బుల్లి తెరపై అత్యంత జనాదరణ పొందిన నటిగా ఆమెకు గుర్తింపు ఉంది. 2014 ఎన్నికల్లో అమేఠీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీద పోటీ చేసి, గతంలో చాందినీ చౌక్‌లో కపిల్‌ సిబల్‌పై పోరాటానికి గుర్తుగా మంత్రి పదవిని దక్కించుకున్నారు. తాజాగా ఎన్నికల్లో అమేఠీలో రాహుల్ గాంధీపై పోటీ చేసి అనూహ్య విజయాన్ని, పార్టీలో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. తాజాగా నరేంద్ర మోదీ మంత్రి వర్గంలో కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రకాశ్ జవదేకర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఆయన స్వస్థలం మహారాష్ట్ర. పార్టీ తరఫున టీవీ చర్చల్లో ప్రస్తిద్ధుడు.

అణు ఒప్పందంపై ఓటింగ్ సమయంలో ఓటుకు నోటు కుంభకోణాన్ని బయటపెట్టి అందరి దృష్టిని ఆకర్టించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో మానవ వనరులు శాఖ మంత్రిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా మరోసారి మంత్రి పదవిని చేప్టటారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీకి చెందిన హర్‌సిమ్రత్ కౌర్‌ స్వస్థలం పంజాబ్. పోటీచేసిన గెలిచిన నియోజకవర్గం భటిండా. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కోడలు. శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ భార్య.

బాలికా సంరక్షణకు కృషి చేసే ‘నాన్హీ ఛాన్‌’ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక, గిరిరాజ్‌ సింగ్ స్వస్థలం బిహార్. పోటీచేసి గెలుపొందిన నియోజకవర్గం బెగుసరాయ్‌. 2014లో లోక్‌సభకు ఎన్నికై మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2002 నుంచి 2014 వరకు ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించారు. నరేంద్ర సింగ్‌ తోమర్‌ స్వస్థలం మధ్యప్రదేశ్‌. డిగ్రీ వరకూ చదువుకున్న ఆయన 2009లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు. 2014లో ఉక్కుశాఖ మంత్రిగా నియమితులయ్యారు.

2016 నుంచి వేర్వేరు శాఖలకు మంత్రిగా సేవలందిస్తున్నారు. బీజేపీలో మరో కీలక నేత రవిశంకర్‌ ప్రసాద్‌. ఆయన స్వస్థలం కూడా బిహారే. న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. పట్నా హైకోర్టు, సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు సంపాదించారు. దాణా కుంభకోణంపై వ్యాజ్యం వేసిన బృందంలో ఈయన సభ్యుడు. అయోధ్య భూవివాదంలో రామ్‌లల్లా తరఫున వాదనలు వినిపించారు. 2000లో తొలిసారి రాజ్యసభ్యకు ఎన్నికయ్యారు. ఏబీ వాజ్‌పేయీ ప్రభుత్వంలో పలు శాఖలకు మంత్రిగా సేవలందించారు. దీంతోపాటు పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు.

నరేంద్ర మోదీ తొలి ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్స్‌, సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. నరేంద్రుని తదుపరి ప్రభుత్వంలోనూ ఈయనకు అవకాశం వచ్చింది. థావర్‌ చంద్ గహ్లోత్‌ స్వస్థలం మధ్యప్రదేశ్‌. బీఏ విద్యార్హత కలిగిన ఈయన తొలిసారిగా 1996లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా సేవలందించారు. 2014లో సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఎస్‌. జయశంకర్‌. స్వస్థలం తమిళనాడు. 1977లో ఇండియన్‌ ఫారెన్‌ సర్వీసెస్‌ (ఐఎఫ్ఎస్)కు ఎంపికయ్యారు. 2018 వరకు విదేశీ వ్యవహారాల శాఖలో కీలక పదవులు చేపట్టారు. చైనా, అమెరికాల్లో భారత రాయబారిగా విధులు నిర్వహించారు.

2015 నుంచి 2018 వరకు విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఈయన చట్ట సభలకు ఎన్నిక కాకుండానే మంత్రి వర్గంలో చోటు దక్కించుకోవడం విశేషం. రమేశ్‌ పోఖ్రియాల్‌ స్వస్థలం ఉత్తరాఖండ్‌. పీహెచ్‌డీ పూర్తిచేసిన ఆయన రాజకీయ ప్రస్థానం కూడా విచిత్రమైనదే. 1991లో కర్ణప్రయాగ నియోజకవర్గం నుంచి ఉత్తర్‌ ప్రదేశ్‌ శాసన సభకు ఎన్నికయ్యారు. 1997లో ఉత్తరాంచల్ అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఉత్తరాఖండ్‌ శాసన సభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. 2009 నుంచి 2011 వరకు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో తొలిసారి లోక్‌ సభకు ఎన్నికయ్యారు. 2019లో రెండో సారి లోక్‌ సభకు ఎన్నికయ్యారు.

అరవింద్ సావంత్ స్వస్థలం మహారాష్ట్ర. పోటీచేసి గెలుపొందిన నియోజకవర్గం దక్షిణ ముంబయి. 2014లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. రెండు సార్లు మహారాష్ట్ర శాసనమండలికి ప్రాతినిధ్యం వహించారు. ఇక, రావ్ ఇంద్రజిత్ సింగ్ స్వస్థలం హరియాణా. పోటీచేసి గెలుపొందిన నియోజకవర్గం గురుగ్రామ్. నాలుగు సార్లు హరియాణా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 1998లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తరవాత వరసగా 2004 నుంచి 2019లో లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 మోదీ హయాంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

ప్రహ్లాద్ జోషి స్వస్థలం కర్ణాటక. నియోజకవర్గం ధార్వాడ్. 2012లో కర్ణాటక రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. వరసగా 2004 నుంచి 2019 వరకు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జితేంద్ర సింగ్ స్వస్థలం జమ్ముకశ్మీర్. నియోజకవర్గం ఉదంపూర్. వైద్య శాస్త్రంలో పట్టా పొందిన జితేంద్ర సింగ్ ఫిజీషియన్‌గా సుదీర్ఘకాలం సేవలు అందించారు. 2014లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికై, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. గజేంద్ర సింగ్‌ షెకావత్‌ స్వస్థలం రాజస్థాన్‌. ఎంఫిల్‌ పూర్తిచేసిన ఆయన 1992 నుంచి ఏబీవీపీలో చురుకైన పాత్ర పోషించారు. 2014లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

2017లో వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2019లో జోధ్‌పూర్‌ నుంచి లోక్‌ సభకు రెండోసారి ఎన్నికయ్యారు. సంతోష్‌ గాంగ్వర్‌ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌. బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ
పూర్తిచేసిన ఆయన తన రాజకీయ ప్రస్థానంలో 1996 వరకు బరేలీ అర్బన్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో తొలిసారి లోక్‌ సభకు ఎన్నికయ్యారు. 2014లో జౌళి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2016 జులై నుంచి 2017 సెప్టెంబరు వరకు ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2017 సెప్టెంబరు నుంచి కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. కిరణ్‌ రిజిజు స్వస్థలం అరుణాచల్‌ప్రదేశ్‌. న్యాయ శాస్త్రంలో పట్టా పొందిన ఆయన 2004లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు.

ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ స్వస్థలం మధ్యప్రదేశ్‌. ఆయన తన రాజకీయ ప్రస్థానంలో ఏబీ వాజ్‌పేయీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2014, 2019 ఎన్నికల్లో దమోహ్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999లో తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. మనసుఖ్‌ మాండవియా స్వస్థలం గుజరాత్‌. 2002లో గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2012లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అర్జున్ రామ్ మేఘవాల్ స్వస్థలం రాజస్థాన్. గెలుపొందిన నియోజకవర్గం బికనీర్. తొలుత రాష్ట్ర సర్వీసుల్లో చేరి ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు. 2009, 2014, 2019లో లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 2016లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

అశ్వనీ కుమార్ చౌబే స్వస్థలం బిహార్. నియోజకవర్గం బక్సార్‌. గతంలో బిహార్ ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 16 లోక్‌సభకు బక్సార్‌ నుంచి ప్రాతినిధ్యం వహించడానికి ముందు భాగల్‌పుర్‌ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2017లో మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా చేరారు. 2019లో మరోసారి బక్సార్‌ నుంచి గెలుపొంది కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీకే సింగ్‌ స్వస్థలం పంజాబ్‌. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో చదువుకున్న ఆయన భారత సైన్యంలో వివిధ హోదాల్లో సేవలందించారు. 2010 నుంచి 2012 వరకు సైన్యాధ్యక్షుడిగా విధులు నిర్వహించారు.

2014లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014 నుంచి విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే స్వస్థలం మధ్యప్రదేశ్. మాండ్లా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1996 నుంచి 2009 వరకు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. నరేంద్ర మోదీ తొలి ప్రభుత్వంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. హర్‌దీప్‌సింగ్‌ పూరీ స్వస్థలం పంజాబ్‌. యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ నుంచి మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌‌లో పట్టా పొందిన ఆయన 1988-91 మధ్య పలు దేశాల్లో దౌత్య సేవలు అందించారు.

ఐరాస భద్రతా మండలి ఉగ్రవాదంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీకి ఛైర్మన్‌గా పని చేశారు. 2013 జూన్‌లో అంతర్జాతీయ శాంతి సంస్థకు సీనియర్‌ సలహాదారుగా నియమితులయ్యారు. 2014లో భాజపాలో చేరిక. 2018 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. రాజ్‌కుమార్‌ సింగ్‌ స్వస్థలం బిహార్‌. మగధ్‌ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పొందిన ఆయన రాజకీయాల్లోకి రాకముందు 1975 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. వాజ్‌పేయీ హాయాంలో హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2014 నుంచి బిహార్‌లోని అర్రా నియోజకవర్గ ఎంపీగా ఉన్నారు. 2017లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

కృష్ణపాల్‌ గుర్జార్‌ స్వస్థలం హరియాణా. మేరఠ్‌ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పొందిన ఆయన 2014 నుంచి ఫరీదాబాద్‌ నియోజకవర్గ ఎంపీగా ఉన్నారు. ఇదే సమయంలో సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక, మిగిలిన వారూ తమ తమ స్థాయిల్లో పార్టీకి, ఎన్డీయే కూటమికీ సేవలందించిన వారే. రావ్‌సాహెబ్‌ ధాన్వే (మహారాష్ట్ర), జి.కిషన్‌ రెడ్డి (తెలంగాణ), పురుషోత్తం రూపాలా (గుజరాత్‌), రాందాస్‌ అథవాలే (మహారాష్ట్ర), సాధ్వి నిరంజన్‌ జ్యోతి (ఉత్తర్‌ప్రదేశ్‌), బాబుల్‌ సుప్రియో (పశ్చిమ బెంగాల్‌), సంజీవ్‌ బాల్యన్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), సంజయ్‌ శామ్‌రావ్‌ (మహారాష్ట్ర), అనురాగ్ ఠాకూర్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌), అంగడి సురేష్‌ చిన్నబసప్ప (కర్ణాటక), నిత్యానంద్‌ రాయ్‌ (బిహార్‌), రతన్‌లాల్‌ కటారియా (హరియాణా), వి. మురళీధరన్‌ (కేరళ), రేణుకా సింగ్‌ సరుతా (ఛత్తీస్‌గఢ్‌), సోం ప్రకాశ్‌ (పంజాబ్‌), రామేశ్వర్‌ తెలీ (అసోం), ప్రతాప్‌చంద్ర సరంగి (ఒడిశా), కైలాస్‌ చౌదరి (రాజస్థాన్‌), దేవశ్రీ చౌదరి (పశ్చిమ బెంగాల్‌) వంటి వారు కేంద్ర సహాయ మంత్రులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. వీరందరికీ శుక్రవారం శాఖలను కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.