• పింఛన్ల పెంపుపై పెదవి విరుపు

  • రూ. 3000 అంటే నాలుగేళ్లలోనా?

  • అన్ని హామీలూ ఇదే తరహాలో ఉంటాయా?

అమరావతి, మే 31 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం సామాన్యమైనది కాదు. దీని గురించి దేశవ్యాప్తంగా కూడా చర్చ సాగింది. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ సాధించిన రికార్డు స్థాయి విజయం గత రికార్డులను తుడిసేసిందనే చెప్పవచ్చు. తొమ్మిదేళ్ల పాటు జగన్ పడ్డ కష్టానికి ప్రతిఫలంగా వచ్చిన ఈ అనూహ్య ఫలితాల వెనుక ‘నవరత్నాలు’ దాగి ఉన్నాయనే అంటున్నారు జగన్ పార్టీ శ్రేణులు.

అయితే, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, సీఎం హోదాలో ఆయన సంతకం పెట్టిన తొలి దస్త్రం హామీ అమలుపైనే విపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ వ్యతిరేక వర్గాలు జగన్ ప్రసంగంపై పెదవి విరుస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జగన్‌ తన తొలి సంతకం దేనిపై చేస్తారోనన్న ఉత్కంఠకు తెరపడింది. కీలకమైన పింఛన్ల పెంపు దస్త్రంపైనే ఆయన తొలి సంతకం చేశారు. వృద్ధాప్య పింఛను రూ.3వేలు చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగా తొలి ఏడాది రూ.250 పెంచుతున్నట్లు ప్రకటించారు.

జూన్‌ 1 నుంచి రూ.2,250 అందజేస్తామని చెప్పారు. రెండో ఏడాది రూ.2,500, మూడో ఏడాది రూ. 2,750, నాలుగో ఏడాది రూ. 3,000 అందజేస్తామన్నారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన నవరత్నాల హామీలను తప్పకుండా అమలు చేస్తామని జగన్‌ ప్రకటించారు. జగన్‌ తొలి సంతకం చేస్తున్న సమయంలో సభా ప్రాంగణం సీఎం జగన్‌ అంటూ అభిమానుల నినాదాలతో మారుమోగింది. అయితే, నవరత్నాలలోని ఇతర హామీల అమలు కూడా పింఛన్ల పెంపు మాదిరిగా దశలవారీగానే అమలుచేస్తారా? లేక వాటినైనా పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారా? అన్నదానిపై అధికార పార్టీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ‘‘నవరత్నాల హామీలలో పేర్కొన్న మాదిరిగా ‘పింఛన్ల పెంపు పథకం’ ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా రూ.24,000 నుంచి రూ.48,000 వరకు ప్రయోజనం చేకూరాల్సి ఉంది.

ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొంది. ప్రస్తుతం పింఛన్‌ తీసుకోవడానికి ఉన్న వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించడం. అవ్వతాతలకు నెలకు రూ.2000 ఇస్తూ దానిని రూ.3 వేలకు పెంచుకుంటూ పోవడం, దివ్యాంగులకు రూ.3000 పింఛన్‌ అందించడం వంటివి జగన్ హామీలలో ఉన్నవే. వాటి గురించి మేమేమీ ప్రత్యేకించి చెప్పడం లేదు. కానీ, సీఎం హోదాలో జగన్ చేసిన తొలి ప్రసంగంలో మాత్రం హామీని దశలవారీగా అమలుచేస్తామని అనడం విడ్డూరంగా ఉంది. ఇది ప్రజలను మభ్యపెట్టడం కాదా’’ అని తెలుగుదేశం శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పటికి వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులు, ఎయిడ్స్‌ బాధితులు, కళాకారులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చర్మకారులకు నెలకు రూ.2,000ల చొప్పున పింఛను పంపణీ చేస్తోంది. దివ్యాంగులు, హిజ్రాలు, డప్పు కళాకారులకు రూ.3,000ల పింఛను ఇస్తోంది. ఇక, డయాలసిస్‌ రోగులకు రూ.3,500లు చెల్లిస్తోంది.

నెల నెలా ఒకటో తారీఖునే 54.47 లక్షల మందికి వస్తోన్న ఈ పింఛన్లను ఇకపై రూ.2,000ల నుండి రూ.3,000లకు పెంచుతానంటూ తెలుగుదేశం ఎన్నికలలో హామీ కూడా ఇచ్చింది. అలాగే వృద్ధాప్య పింఛను పొందడానికి ఇదివరకు 65 ఏళ్ళ వయసు నిండాలి. ఇప్పుడు 60 ఏళ్ళు చాలంది. ఇతర పథకాల సంగతి ఎలా ఉన్నా కనీసం పార్టీకి విజయాన్ని చేకూర్చిపెట్టిన నవరత్నాలనైనా సక్రమంగా అమలుచేయగలిగితే జగన్ పాలనకు తిరుగుండదనే వాదన వైఎస్సార్‌సీపీ శ్రేణుల నుంచే వినిపిస్తోంది. చివరికి సీఎం జగన్ ఏం చేస్తారో, తన ముందడుగు ఎలా వేయనున్నారో, సంక్షేమ, సామాజిక రంగాల అభివృద్ధికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వనున్నారో వేచిచూడాల్సిందే.