ఏయూ వీసీ ఆచార్య జి. నాగేశ్వరరావు, సెంచూరియన్ యూనివర్సిటీ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్. రాజు చేతుల మీదుగా వీజేఎఫ్ ప్రోత్సాహాన్ని అందుకుంటున్న పైడి హర్షవర్ధన్.
  • దేశంలోనే స్ఫూర్తిదాయకంగా వీజేఎఫ్ సేవలు: ఏయూ వీసీ

  • సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే హక్కుల సాధనకూ కృషి: గంట్ల

విశాఖపట్నం, జూన్ 9 (న్యూస్‌టైమ్): వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం (వీజేఎఫ్) గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. వినూత్నమైన, విశేషమైన సేవలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా ఇతర అనేక సంఘాలకు స్ఫూర్తిదాయకంగా పనిచేస్తున్న వీజేఎఫ్ సభ్య జర్నలిస్టుల సంక్షేమమే తొలి ప్రాధాన్యతగా తన కృషిని కొనసాగిస్తోంది.

జర్నలిస్టుల హక్కులు, ప్రభుత్వపరంగా పాత్రికేయులకు అమలుచేయాల్సిన పథకాలు, రావాల్సిన కేటాయింపులపై యూనియన్లకు అతీతంగా తన గొంతుకను వినిపిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్న వీజేఎఫ్ ఏటా సభ్యుల సంక్షేమానికి లక్షలాది రూపాయలు వెచ్చిస్తోంది.

జర్నలిస్టులకు సంబంధించినంత వరకూ దేశంలోనే మొదటి ఎయిర్ కండిషన్డ్ సొంత సమావేశ మందిరాలు, గ్రంధాలయం, రిక్రియేషన్ సదుపాయాలను కలిగిన వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్ ఆదాయాన్ని ఆర్జించాలన్న ధోరణిలో కాకుండా సభ్యుల కోసం ఇంకేదో చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

ఇందులో భాగంగా ప్రభుత్వ సహకారంతో ఏటా సభ్య జర్నలిస్టులకు ఆరోగ్య బీమా, 10 లక్షల రూపాయల విలువైన వ్యక్తిగత ప్రమాద బీమా వంటివి అమలుచేస్తోంది. అదే విధంగా ‘ప్రతిభకు ప్రోత్సాహం’ పేరిట జర్నలిస్టులను ప్రోత్సహిస్తోంది కూడా. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభకనబర్చిన పాత్రికేయులకు మీడియా అవార్డులు ప్రదానం చేయడంతో పాటు విద్యాభ్యాసంలో విశిష్టతను చాటుకున్న జర్నలిస్టుల పిల్లలకు మెరిట్ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది.

ఈ క్రమంలో ఆదివారం విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలోని డాక్టర్ వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో జరిగిన ‘ప్రతిభకు ప్రోత్సాహం’ కార్యక్రమంలో సుమారు 30 మంది జర్నలిస్టులకు మీడియా అవార్డులను, 160 మంది వరకూ చిన్నారులకు అతిథుల చేతుల మీదుగా మెరిట్ స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఏయూ వీసీ ఆచార్య జి. నాగేశ్వరరావు, సెంచూరియన్‌ వీసీ ఆచార్య జి.ఎస్‌.ఎన్‌. రాజు, వైఎస్సాఆర్‌ సీపీ రాష్ట్ర నాయకులు కాయల వెంకటరెడ్డి, ఆర్‌.కె.సి. ప్రాజెక్ట్సు ఛైర్మన్‌ రాధాకృష్ణ తదితరులు హాజరయ్యారు. మీడియా అవార్డు కింద రూ.5వేలు, రూ.3వేలు చొప్పున నగదు బహుమతిని సైతం అందజేశారు. ప్రతిష్ఠాత్మకమైన కపిల గోపాలరావు అవార్డును ది హిందూ పత్రికకు చెందిన చంద్రశేఖర్‌కు అందజేశారు. కార్యక్రమంలో వీజేఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, సోడిశెట్టి దుర్గారావు, ఎ.పి. పవర్‌ డిప్లమా ఇంజినీర్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి, వీజేఎఫ్‌ కార్యవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీజేఎఫ్ అధ్యక్షుడు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మీడియాతో మాట్లాడుతూ సభ్యుల కోసం ఏటా నిర్వహిస్తున్న మాదిరిగానే ఈసారి కూడా ప్రతిభకు ప్రోత్సాహం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామన్నారు. అదే విధంగా వీజేఎఫ్ కార్యవర్గం పూర్తి సహకారంతో వినూత్నరీతిలో కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు.

దేశంలోని ఇతర సంఘాలకు, ప్రెస్‌క్లబ్‌లకూ వీజేఎఫ్ కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తుండడం పట్ల శ్రీనుబాబు ఆనందం వ్యక్తంచేశారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన వీజేఎఫ్ ప్రతిష్టను మరింత పెంచే విధంగా తమ కార్యవర్గం పనిచేస్తోందని, సభ్యుల సంక్షేమానికి తనవంతుగా చేస్తున్న కృషికి కార్యదర్శి సోడిశెట్టి దుర్గారావు, ఉపాధ్యక్షులు ఆర్. నాగరాజ్ పట్నాయక్, టి. నానాజీ, కోశాధికారి పి.ఎన్.మూర్తి, ఇతర నాయకులు దాడి రవికుమార్, ఎంఎస్ఆర్ ప్రసాద్, ఎస్. డేవిడ్ రాజ్, పైలా దివాకర్, ఇరోతి ఈశ్వరరావు, ఎండి. గయాజుద్దీన్, కె.ఆర్. శేఖరమంత్రి, పి. వరలక్ష్మి, నవాజ్, ఎస్. మాధవరావు వంటి సీనియర్లు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమైనదన్నారు.

దసరా, దీపావళి, కొత్త సంవత్సరం, సంక్రాంతి తదితర ప్రత్యేక రోజుల్లో వీజేఎఫ్ నిర్వహించే కార్యక్రమాలతో పాటు ‘ప్రతిభకు ప్రోత్సాహం’, ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్ మీట్, జర్నలిస్టులకు వ్యక్తిగత ప్రమాద బీమా వంటి సంక్షేమ కార్యక్రమాలను యూనియన్లకు అతీతంగా దాతల చేయూతతో మరింత పెద్ద ఎత్తున కొనసాగించేందుకు ప్రయత్నిస్తామన్నారు.

‘‘కాచే చెట్టుకే రాళ్లు అన్న చందంగా ఇంత విస్తృత స్థాయిలో నిరంతరం సభ్యుల కోసం విభిన్న కార్యక్రమాలు అమలుచేస్తున్న మేము విమర్శలకు తలొగ్గేది లేదు. సభ్య జర్నలిస్టుల మంచి కోసం దేనికైనా సిద్ధం’’ అని శ్రీనుబాబు అన్నారు. దాతల సాయం సరిపోక కొన్ని కార్యక్రమాలు అందరికీ అందించలేమన్న పరిస్థితుల్లో తమ సొంత డబ్బులను కూడా వెచ్చించిన మిత్రులు తన కార్యవర్గంలో ఉన్నందుకు గర్వపడుతున్నానన్నారు.

అంతిమంగా తమ లక్ష్యం వీజేఎఫ్‌కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకురావడం, సభ్యులకు మేలు చేయడమేనని, ఈ క్రమంలో ఎన్ని అవమానాలనైనా భరించేందుకు సిద్ధమన్నారు.