విశాఖపట్నం, జూన్ 11 (న్యూస్‌టైమ్): విశాఖ మన్యం నుంచి అక్రమంగా తరలుతున్న గంజాయిని నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా అందిన సమాచారం ప్రకారం విశాఖ ఏజెన్సీ సరిహద్దులోని చోడవరం మండలం వెంకన్నపాలెం కూడలి వద్ద మంగళవారం ఉదయం గంజాయితో వెళ్తున్న కారును ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తనిఖీలు చేసి పట్టుకున్నారు.

కారుతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై రాజ్యలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ తమిళనాడుకు చెందిన నజీబ్, జమునారాణి దంపతులు కారులో గంజాయి తీసుకెళ్తున్నట్లు సమాచారం రావడంతో మాటు వేసి పట్టుకున్నామన్నారు.

పట్టబడిన గంజాయి విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. ఈ దాడుల్లో సిబ్బంది ఆనంద్‌, శ్రీను తదితరులు పాల్గొన్నట్లు ఎస్సై తెలిపారు.