అమరావతి, జూన్ 11 (న్యూస్‌టైమ్): ప్రఖ్యాత తెలుగు కవి, సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత డాక్టర్ సినారె (సింగిరెడ్డి నారాయణరెడ్డి) పార్లమెంట్‌ ప్రసంగాలపై రూపొందించిన పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ పేరిట ప్రచురించిన ఈ పుస్తకాన్ని మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లో ఆవిష్కరించారు.

కార్యక్రమానికి సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, నేషనల్‌ జ్యూడిషియల్‌ అకాడమీ డైరెక్టర్‌ జస్టిస్‌ గోడ రఘురామ్, తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ రచించిన ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ పుస్తకాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

సినారె మాటలు, కవితలు గురించి తాను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు పేరుపేరున కృతజ్ఞతలు తెలపుతున్నానన్నారు. ఇక సినారె 1997 రాజ్యసభ సభ్యుడిగా నామినేట్‌ అయ్యారు. ఆరేళ్ళపాటు సభలో ఆయన ప్రశ్నలు, ప్రసంగాలు, చర్చలు, ప్రస్తావనలు అందరి మన్ననలనూ అందుకున్నాయి.