నిజం. మానవాళిని విశేషంగా ఆకట్టుకుని అలరించే డప్పు వాయిద్యం ఒకప్పుడు ఒకే సామాజిక వర్గం సొంతం. కానీ, కాలగమనంలో ఆ వాయిద్యం కూడా అందరిదిగా మారిపోయింది. పేర్లు ఏవైనప్పటికీ నేటి ఆధునిక వాయిద్య పరికరాలలో డప్పు కూడా ఏదో ఒక రూపంలో మనకు దర్శనం ఇస్తూనే ఉంటుంది. ఆదిమ మానవుడు కనుగొన్న డప్పు మనిషి కనుగొన్న మొట్టమొదటి వాద్య పరికరం. దీని తయారీకి పశువుల చర్మంతో పాటు చెక్కతో నిర్మించిన గుండ్రని చట్రం కూడా ఉపయోగించాడు ఆనాటి మానవుడు. అంటే చనిపోయిన పశువు తోలును ఎండిన తోలుగా మార్చడం, చెట్టు మానును కుదురు (గుండ్రం)గా మలచడం అన్నమాట. తరవాతి కాలంలో ఈ పనులు చేయడానికి వేరు వేరు వృత్తులవారు ఏర్పడ్డారు.

వారే చర్మకార/మాదిగ, మాష్టి, వడ్రంగి ఈ డప్పు తయారీలో పాల్టొంటున్నట్లు చెప్పవచ్చు. అయితే, కొన్ని చోట్ల మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారే పూర్తిగా డప్పును తయారుచేసుకుంటున్నారు. ఆదిమానవుడు వంటరిగా అడవిలో ఉన్నపుడు తన ఉనికిని మరొకరికి తెలియజేయడానికి, క్రూర జంతువులను లేదా తాను వేటాడదలుచుకున్న జంతువులను భయ పెట్టడానికి కాని, అందరు ఒకచోట చేరడానికి సంకేతంగా కాని, ప్రమాద హెచ్చరిక చేయడానికి గాని డప్పును ఉపయోగించుకున్నాడు. రాయిని ఉపయోగించి జంతువు చర్మాన్ని ఒలిచి డప్పు తయారు చేసిన మానవుడు అదే రాయిని దేవునిగా పూజిస్తూ జంతు చర్మంతో చేసిన డప్పు వాయిస్తూ అనుష్టానాలు, కర్మకాండలు, భూతాన్ని వదిలించడం వంటి పనులు చేశాడు.

దీనితో పాటు తాను సంతోషంగా ఉన్న సమయంలో ప్రకృతిలోని శబ్దాలకు అనుగుణంగా దరువు వేయడం నేర్చుకున్నాడు. ఆ శబ్దాన్ని విన్న ఆ గుంపులో కలిగిన చేతన గుపు సభ్యుల్లో నృత్యం చేయడానికి ఉత్తేజపరిచింది. ధ్వని తరంగాలు సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలకు సైతం వినిపిస్తాయి. ముఖ్యంగా ఉదయ కాలం, రాత్రిపూటల్లో డప్పు దరువు ధ్వనులు ఎక్కువ దూరం వినిపిస్తాయి. దరువుకి గల మరో లక్షణం ఏమంటే మనిషి నరాల్లో ఉత్తేజాన్ని నింపుతుంది. మనుషులను పులకరింపచేస్తుంది. దరువులు వింటున్న వారు తమకు తెలియకుండానే దరువుకు తగ్గట్లు చిందులేస్తారు. డప్పు దరువులు ఆయా సందర్భాన్ని బట్టి జాతర దరువు, ఊరేగింపు దరువు, పెళ్లి దరువు, చిందు దరువు, ఉసిగొల్పే దరువు, పూనకం దరువు, సంతోషం దరువు, పీర్ల దరువు, చావు దరువు అంటూ కొడతారు.

గ్రామాల్లోను, పట్టణాల్లోను జరిగే వివిధ శుభ, అశుభ కార్యాలకు డప్పును వాడుతూ ఉన్నారు. గ్రామాలలో దేవర జాతరలు, వనభోజనాలు, గ్రామసభలు జరిపేటప్పుడూ డప్పుతో టమకా/చాటింపు వేయిస్తారు. అపుడు గ్రామస్తులు చావడి వద్ద చేరి తదుపరి జరగవలసిన కార్యాలను నిర్వహిస్తారు. వ్యాపారస్తులు వస్తువులను అమ్మడం కోసం ఆయా గ్రామాధికారి అనుమతితో ఆ గ్రామ పెద్ద మాదిగను పిలిచి డప్పు కొట్టమంటారు. శవాన్ని స్మశానానికి (బొందలగడ్డ) డప్పుల మోతతో మోసుకెళతారు. అపుడు బాధను తెలియపరుచు డప్పు ధ్వనిని వాయిస్తారు. డప్పు ధ్వనుల ద్వారా తెలియని వారు కూడా అశుభకార్యమని తెలుసుకోగలుగుతారు. ఆ ఇంటి వారితో పరిచయముంటే వెళ్ళి వారిని ఓదార్చడం జరుగుతుంది. పరిచయం లేని వారు కూడా అయ్యో పాపం అంటూ తమ సానుభూతిని వ్యక్తపరుస్తారు.

డప్పుపై వేసే సానుభూతి దరువు గాలిలో కలిసిపోయిన ప్రాణాన్ని కలుస్తుందని, తద్వారా అతని ఆత్మ శాంతిస్తుందనేది చావు డప్పు దరువు ఉద్ధేశంగా కనిపిస్తుంది. ఒకప్పుడు ప్రతి గ్రామంలో మాదిగల ఇళ్లలో కుటుంబానికి ఒక డప్పు తప్పకుండా ఉండేవి. అలా ప్రతి గ్రామంలో పది నుండి ఇరవై దాకా డప్పులు కనిపించేవి. గ్రామంలో ఏదైనా ఒక జాతర, పండుగ, పెళ్లి, చావులు, కందూరు, మొక్కుబడులు మొదలగు కార్యాలు జరుగుతున్నపుడు డప్పుల మోతతో ఊరంతా దద్దరిల్లేది. మూలనున్న ముసలమ్మ మొదలుకొని చంటి పిల్లల వరకు ఏ ఇంట్లో కార్యం జరుగుతుందో సులభంగా తెలుస్తుండేది.

విజ్ఞానాభివృద్ధి జరగని రోజుల్లో నాటి సమాజం ఏ వృత్తి చేసేవారికి అదే వృత్తిని అంటగట్టి వారి ఆర్థిక, సామాజిక విజ్ఞాన అభివృద్ధికి అడ్డుకట్ట వేసింది. ప్రాచీన, మధ్యయుగ సమాజంలో వస్తు తయారీదారునికి, ఉత్పత్తిదారునికి (మాదిగ, వడ్రంగి, కుమ్మర, సాలె, మంగలి, నేత) బ్రాహ్మణీయ భావజాల భూస్వామ్యవ్యవస్థ తగిన ప్రాధాన్యాన్నివ్వలేదు. అంతే కాదు వృత్తి కులాల మేధాశక్తితో తయారైన వస్తువులతో తమ జీవనాన్ని గడుపుకుని ఆధిపత్యకులాలవారు వీరిని కింది వర్గాలుగా ముద్రవేశారు. ఆధునిక కాలంలో సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి వస్తున్న పాటలకు డప్పు దరువే ప్రాణం. అనేకమంది కళాకారులు డప్పుపై పట్టు సాధిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి వలన రెడీమేడ్‌ (కంజర) డప్పులు మార్కెట్టులోకొస్తున్నాయి. డప్పును కనుగొనిన వారి వారసులకు అంద వలసిన ఆర్థిక వనరులను కొత్తగా వచ్చిన ప్రవృత్తి కళాకారులు తన్నుకు పోతున్నారు.

మరోవైపు, అరుదైన సంగీత వాయిద్యాలు కనుమరుగవుతున్నాయనే చెప్పాలి. ఆధునికత, ప్రపంచీకరణ, వ్యాపారీకరణ ఇలా పేరు ఏమైనప్పటికీ ఇవన్నీ జానపద కళలు, ఆదివాసీ కళలకు విపరీతమైన నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ఆటపాటతో కూడిన ఆదివాసీ సంస్కృతులు ఇప్పుడు హోరెత్తించే ఆధునిక డీజేలకు ప్రభావితమైపోతున్నాయి. ఫలితంగా ఆదివాసులకే సొంతమైన అరుదైన సంగీత సాధనాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అవన్నీ పూర్తిగా మరుగునపడక ముందే పరిశోధకులు, ప్రభుత్వాలు వాటిని రికార్డుచేసి భావితరాలకు అందించే ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి.

ఛత్తీస్‌గర్‌లోని ‘సర్గుజా’ అనేక అరుదైన సంగీత వాయిద్యాలకు ప్రసిద్ధి. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా దట్టమైన అడవి. ఇప్పుడంటే అటవీచట్టాలు, వన్యమృగసంరక్షణ చట్టాలు అంటూ వచ్చి ఆదివాసీల హక్కులను హరించివేశాయి కాని, పూర్వం ఇక్కడుండే కీకారణ్యంలో స్థానిక ఆదివాసీలు వేటను కూడా ఒక జీవనాధారంగానే కొనసాగించేవారు. ఈ వేటకు తోడ్పడే సంగీత సాధనాలు కూడా ఇక్కడి ప్రజలదగ్గర ఉన్నాయి. ఇప్పుడు వేటాడే హక్కుపైనే ప్రభుత్వాలు వేటు వేస్తే ఇంకా ఆ సంగీత సాధనాలు ఎలా బతికి ఉంటాయి. అందుకే అవి కనుమరుగవుతున్నాయి. జీవితంలోని శుభ, అశుభ సందర్భాలు అన్నింటిలోనూ సంగీత సాధనాల ప్రాముఖ్యం ఉంటుంది. మనిషి పుట్టుక నుంచి మరణం వరకు ఎన్నో సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఈ జీవిత చక్రాల సందర్భంగానే కాక వ్యవసాయం, వేట వంటి సందర్భాలలోనూ సంగీత సాధనాలతో జానపదులు, ఆదివాసీలకు పనిపడుతుంది. ఆటపాటలతో నిండిన అనేక సందర్భాలు సంగీత వాయిద్యాలు లేకుండా ఊహించనైనా ఊహించలేరు.

అటువంటి సంగీత సాధనాల్లో ఇవి కొన్ని మాత్రమే. ఝన్కా భాజా లేదా షికారీ బాజా అనే వాయిద్యం చత్తీస్‌గర్‌ పురా జీవన శైలిని గుర్తుకు తెస్తుంది. చిన్న జంతువులను వేటాడటానికి ఈ వాయిద్యాన్ని మోగిస్తారు. వీరు అనుసరించే వేటాడే పద్ధతిలో ఈ వాయిద్యం ఒక భాగమన్నమాట. నిజానికి ఈ వాయిద్యం అంత సంక్లిష్టమైనదేమీ కాదు. రెండు వెడల్పాటి లోహపు రింగుల ద్వయమే ఈ వాయిద్యం. రింగులు లోహంతో చేసినవి కాబట్టి వాటిని చేతిలోకి తీసుకొని లయబద్ధంగా చేత్తో పట్టుకొని పైకి కిందికి ఊపుతుంటే శబ్దం వస్తుంది. ఒక చేత్తో ఈ రింగులను మోగిస్తూ, మరో చేత్తో ఇక్కడ ఫోటోలో చూపిన విధంగా ఒక కావడి వంటి సాధనాన్ని భుజంపైకి ఎత్తుకుంటాడు ఒక కళాకారుడు (వేటగాడు).

కావడి ముందు భాగంలో ధూపం (పొగ) వేసే పాత్ర ఉంటుంది. వెనుకవైపు ఒక సంచిని వేలాడదీస్తారు. కావడి ఎత్తుకున్న మనిషితో పాటు మరో ఇద్దరు వేటగాళ్లు ఉంటారు. ఇందులో ఒకరు పొడవాటి వెదురు బొంగుకు ఒక బుట్టను బిగించి గాలిలో బుట్ట ఉండేలా పైకి ఎత్తి నడుస్తూ ఉంటాడు. మరొకరు ఒక గొడ్డలి వంటి మారణాయుధాన్ని తీసుకొని నడుస్తుంటారు. కావడిమోసేమనిషితో సహా మిగిలిన ఇద్దరి ముఖాలు కనిపించకుండా కావడికి ఒక పలుచని తడికను అమర్చుతారు. ఈ తడికకున్న చిన్న చిన్న సందులు (రంధ్రాలు) గుండా ఎదుట ఏమున్నదో కనిపిస్తుంది కాని, ఎదుట ఉన్నవారికి తడిక వెనుక ఎవరున్నారో కనిపించదు. కేవలం కాళ్లు మాత్రమే కనిపిస్తాయి.

కావడికి ముందు భాగంలో అమర్చిన పాత్రలో నిప్పులు ఉంచి దానిలో పొగవచ్చేలా చేస్తారు. ఆ పొగపాత్రకి, కావడి ఎత్తుకున్నవారికి మధ్యలో తడిక కావడికి అమర్చి ఉంటుంది. పొగ వెదజల్లుతున్న కావడిని ఎత్తుకొని చేతిలో షికారీ బాజాని మోగిస్తూ అడవిలో కదులుతుంటే చెట్లు, పుట్టలు మధ్య ఉన్న చిన్న చిన్న జంతువులు ఆ పొగను చూసి, శబ్దాన్ని విని కావడి సమీపానికి వస్తాయి. అప్పుడు మరీ కుందేలు వంటి చిన్న జంతువులైతే పొడవాటి బొంగుకు అమర్చిన బుట్టను దానిపై బోర్లించి పట్టుకుంటారు. పొగదృశ్యం, బాజా శబ్దానికి ఆకర్షితమైన జంతువులు దగ్గరగా వచ్చినప్పుడు తడిక చాటున ఉన్న గొడ్డలి ధరించిన వ్యక్తి కూడా బయటికి వచ్చి ఆ జంతువులను చంపివేస్తాడు. ఆ విధంగా అడవి బిడ్డలు వేటకోసం రూపొందించుకున్న వాయిద్యపరికరమైన ఈ ఝున్కా బాజా ఇప్పుడు కనుమరుగైపోతోంది.

వేట నిషిద్ధం కదా. ఇక వారికి ఈ వాయిద్యాలు, పరికరాలతో పనేముంది?! ఈ ప్రాంతంలో వాయించే వాయిద్యాలను తాళవాయిద్యాలు, తీగవాయిద్యాలు (తార్‌ వాయిద్యాలు), గాలి ఊదడంద్వారా వాయించే వాయిద్యాలు (ఫూంక్‌ వాయిద్యాలు), ఝంకా వాయిద్యాలు గా విభజించవచ్చు. డంపా, ఢాక్‌, ధడప్‌, డూగీ, ఢంకా, గూమ్రా, నగాడి వంటి వాయిద్యాలు తాళవాయిద్యాల్లో ముఖ్యమైనవి. డంపా అనే వాయిద్యాన్ని చెక్కతో చేసిన చట్రానికి కోతి చర్మాన్ని మూసి తయారుచేస్తారు. ఇది మన తెలుగువారు ఉపయోగించే డప్పు లాగే ఉంటుంది. తొహిళ, ఢోంక్‌, కింద్రా, గుడ్కా వంటివి తార్‌వాయిద్యాలు. ఢోంక్‌వాయిద్యం మన తెలుగు జానపదులు వాయించే తంబురను పోలి ఉంటుంది. గుండ్రంగా, పెద్దగా ఉన్న సొర కాయ (ఆనపకాయ)లోపలి భాగాన్ని ఖాళీచేసి బుర్ర కింది భాగం తొలగించి పెద్ద రంధ్రం చేస్తారు.

సొరకాయ బుర్ర తొడిమ ఉన్న భాగంపై దృఢమైన కర్రను బిగించి ఆ కర్రకు లోహపు తీగలు తంత్రులుగా బిగిస్తారు. ఈ వాయిద్యాన్ని వాయించేటప్పు డు బుర్ర వెనుక భాగానికి పొట్టను ఆనిస్తారు. అంటే బుర్ర రంధ్రంలో పొట్ట అమరేలా పెట్టి తీగలను చిన్న ఇనుప పుల్ల లాంటిదానితో మీటుతూ ఉంటారు. ఈ క్రమంలో శబ్దంలో హెచ్చుతగ్గులు తాళానికి అనుగుణంగా రాబట్టడం కోసం బుర్రకు, పొట్టకు మధ్య ఖాళీ ఉండేలా చేత్తో జరుపుతూ, మళ్లీ పొట్టకు ఆనిస్తూ కళాకారుడు వాయిస్తూ పాటలు పాడతాడు. తుంగడా, భేండ్‌ భాజా, వంటివి ఫూంక్‌ వాయిద్యాల కిందికి వస్తాయి. వాయిద్యం పిల్లనగ్రోవి లాంటిది.

ఇది పొడవైన వెదురు గొట్టం మధ్యలో ఒక రంధ్రం చేసి నోటిని పూర్తిగా ఆ రంధ్రానికి ఆనించి గాలి ఊదుతూ కావలసిన స్వరాలను ఆ రంధ్రానికి దిగువన ఉన్న రంధ్రాలను వేళ్లద్వారా మూయడం తెరవడం ద్వారా కళాకారులు రాబడతారు. భర్తారీ భాజా, కెర్చో వంటి వాయిద్యాలు కనుమరుగవుతున్నాయి. మాంధర్‌ పెద్ద ఢోల్‌ లాంటి వాయిద్యం. ఇక్కడ మృదంగం కూడా వాయిస్తారు. పెద్ద పెద్ద తాళాలను ఈ ఢోల్‌ వాయిద్యానికి అనుగుణంగా వాయిస్తారు. ఈ తాళాలను ఝంగ్‌ భాజా అంటారు. ఝంకారం ఇచ్చే వాయిద్యాలను ఝంకార్‌ వాయిద్యాలుగా పిలుస్తుంటారు. జమురా, ఝాజ్‌, కిన్నీ వంటి వాయిద్యాలను ఈ విభాగంలో చేర్చవచ్చు.