ఏలూరు, జూన్ 17 (న్యూస్‌టైమ్): ప్రజలనుండి వచ్చే ప్రతి పిటీషను చాల విలువైనది, సీరియస్‌గా తీసుకుని శ్రద్దతో వాటిని పరిష్కరించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో వివిధ ప్రాంతాలనుండి వచ్చిన ప్రజలనుండి పిర్యాదులు, వినతులను కలెక్టర్ స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో అవసరం ఉంటేనే ప్రజలు తమ సమస్యల పరిష్కారంకోసం దూర ప్రాంతాలనుండి ఎంతో డబ్బు, సమయం వృధాచేసుకుని వస్తారని, ఒక సమస్య పరిష్కారం కొంతమంది జీవితాలను నిలబడుతుందని, కాబట్టీ ప్రతి అర్జీకి ఎంతో విలువనిచ్చి పరిష్కరించాలన్నారు. సోమవారం మీకోసంలో వచ్చే అర్జీలపై తీసుకున్న చర్యలపై అదే వారంలో నివేదిక అందించాలన్నారు. ఆ నివేదికలపై సమీక్షించడం జరుగుతుందని కలెక్టర్ ముత్యాలరాజు చెప్పారు.

ఈ సందర్భంగా వచ్చిన అర్జీలపై స్వయంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చేయాలని ఆదేశించారు. పెనుమంట్ర మండలం నెగ్గిపూడి శివారు వనంపల్లి గ్రామానికి చెందిన తోలేటి వెంకట సత్యరామ సూర్యనారాయణ పిర్యాదు చేస్తూ గ్రామంలోని ఆర్ .నెం .33/1 ప్రభుత్వ చెరువు (ట్యాంకు బోరంబోకు) స్థలం ఆక్రమణకు గు%ందని ఈవిషయం ది.16.4.2011 నుండి అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. ఆస్థలం ఆక్రమించుకున్న సత్తి వెంకటరెడ్ది అతని కుమారులు, పి. నర్సింహమూర్తి అనేవారు తను తనకుటుంబంపై కక్షకట్టి దౌర్జన్యం చేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఉంగుటూరు మండలం చేబ్రోలు శివారు తిమ్మాయిపాలెం గ్రామానికి చెందిన తుండూరి మసేను అర్జీ ఇస్తూ, ఈదల సత్యనారాయణ పట్టాభూమి నెం. 859/5, పంట బోదెను ఆక్రమించుకుని అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని, పిర్యాదు చేసినందుకు దౌర్జన్యంగా కొట్టారని చెప్పారు.

పంటబోదె ఆక్రమణవల్ల నా పొలానికి నీరురాక, పంటపొలాలు నష్టపోతున్నామని చెప్పారు. ద్వారకా తిరుమల మండలం పి .కన్నాపురం గ్రామానికి చెందిన పెరుమాళ్ల సూర్యనారాయణ తనకు రుణమాఫీ సొమ్మూ బ్యాంకుకు రాగా సదరు సొమ్ము బ్యాంకు వారు ఇవ్వడంలేదని ఫిర్యాదు చేశారు. కొవ్వూరు మండలం చిడిపి గ్రామానికి చెందిన కొయ్యా దుర్గాప్రసాద్, ఎస్ మోహన్ మరికొంతమంది వినతిపత్రం సమర్పిస్తూ చిడిపి గ్రామపరిధిలోని అఖండ గోదావరి లంక ప్రాంతంలో మట్టి, ఇసుకను మెస్సర్స్ జిఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు పేరుతో నిబంధనలకు విరుద్దంగా పెద్దపెద్ద యంత్రాల సహాయంతో తరలించుకుపోతున్నారని, ఇసుకమాఫియా ఆగడాలను అరికట్టి గోదావరి భూగర్భజలాలను పరిరక్షించాలని చెప్పారు. ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీకి చెందిన తోకల యశోధకుమారి వినతిపత్రం సమర్పిస్తూ తనభర్త తోకల ప్రసాద్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తూ అనారోగ్యంతో ది .5.5.2019న మరణించారని , అయితే దహన సంస్కారాలనిమిత్తం ప్రభుత్వపరంగా రావాల్సిన సొమ్ము సబ్ ట్రజరీవారు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు.

పెంటపాడు మండలం బి .కొండేపూడి గ్రామానికి చెందిన జుత్తిక శ్రీనివాసు వినతిపత్రం సమర్పిస్తూ గ్రామంలో తనకు చెందిన ఆర్ నెం .150లో 165 చ.గ .స్థలంలో ఆర్‌సిసి డాబా కట్టుకుని జీవిస్తున్నానని అయితే పొట్టూరి సత్యనారాయణ, గుండేపల్లి శ్రీను అనేవారు డాబాకు వున్న దారిస్థలాన్ని ఆక్రమించుకుని ర్యాంపు కట్టారని, దానివల్ల తనఇంటికి రాకపోకలకు దారిలేక ఇబ్బందులు పడుతున్నామని, అధికారులకు పిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు.

ఈ మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్ది, ఎజెసి.2 బిఆర్ అంబేద్కర్, ట్రైనీ కలెక్టర్ హిమాన్సు కౌషిక్, డిఆర్ఒ ఎన్. సత్యనారాయణ, హౌసింగ్ పిడి శ్రీనివాసరావు, డిసిహెచ్ఎస్ డాక్టర్ శంకరరావు, డియంఅండ్‌హెచ్ఒ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, డిఇఒ సీవీ రేణుక, సోషల్‌ వెల్ఫేర్ డీడీ రంగలక్ష్మీదేవి, డీటీసీ ఎస్. సత్యనారాయణ మూర్తి, ఎడీ సర్వే విజయకుమార్, ఆర్ అండ్ బి ఎస్ఇ నిర్మల, సెట్ వెల్ సిఇఒ సుబ్బిరెడ్ది, సిపిఒ నాగార్జునసాగర్, ఏలూరు మున్సిపల్ కమిషనర్ మోహనరావు, దివ్వాంగుల సంక్షేమశాఖ ఎడి ప్రసాదరావు, ఐసిడిఎస్ పిడి విజయకుమారి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీలత ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.