అమరావతి, జూన్ 18 (న్యూస్‌టైమ్): తెదేపా కార్యకర్తలపై వైకాపా నేతలు దాడులు చేస్తున్నారంటూ మాజీ మంత్రి నారా లోకేష్ ట్వీట్‌ చేయడంపై ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పందిచారు. తెదేపా ప్రభుత్వ హయాంలో మహిళా అధికారిణిని చెంప మీద కొట్టినా పట్టించుకోని పరిస్థితి అప్పట్లో ఉండేదని ఆమె వ్యాఖ్యానించారు. అన్యాయాన్ని నిలదీసినందుకు తమ పార్టీ ఎమ్యెల్యే రోజాను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారని, వైకాపా గురించి మాట్లాడే అర్హత తెదేపాకి లేదని ఆమె దుయ్యబట్టారు.

ఇటీవల జరిగిన ఘర్షణల్లో తెదేపా వాళ్ళు 44 మంది గాయపడితే వైకాపా వాళ్ళు 57 మంది గాయపడ్డారని సుచరిత అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌పై దాడి జరిగితే దానిని కోడికత్తి దాడిగా ప్రచారం చేశారని గుర్తుచేశారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గించవద్దని సీఎం ఇదివరకే చెప్పారని హోం మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు.