‘‘తెలంగాణలో మరో బెంగాల్‌గా మారుతుంది. అక్కడిలాగానే ఇక్కడ కూడా రాజకీయాలు మారతాయి’’ ఆ మధ్యన, బీజేపీ నేత జి. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఇది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేస్తే చాలు తిరుగులేని అధికారం తమ సొంతమవుతుందని అంచనా వేసుకొని మరీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంటే కాంగ్రెస్ మాత్రం నాయకత్వ లేమితో ‘చుక్కాని లేని నావ’లాగా నడి సంద్రంలో నానా అగచాట్లు పడుతోంది. కేసీఆర్ సాగిస్తున్న ‘ఆపరేషన్ ఆకర్ష్’తో కాంగ్రెస్ ఉనికికే ప్రమాదమేర్పడింది.

ఇంకొక ఐదేళ్లు ఇలాగే ఉంటే, కాంగ్రెస్ పార్టీనే కాదు, దాని నేతలను కూడా ప్రజలు గుర్తుంచుకునే పరిస్థితి లేదు. ఈ భవిష్య చిత్రం., కాంగ్రెస్ నేతలను కలవరపెడుతోంది. జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీ ప్రభావం అంతకంతకూ తగ్గుతోంది. మునిగే నావలా ఉన్న పార్టీని పట్టుకుని వేలాడటంతో ఎలాంటి ప్రయోజనం లేదన్న భావన తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వారంతా బీజేపీపై పడింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీ స్థానాలను సొంతం చేసుకోవటం కేసీఆర్ కుమార్తె కవితను బీజేపీ అభ్యర్థి ఓడించటం, వీటన్నింటినిబట్టి చూస్తే? రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని కాంగ్రెస్ నేతలు అంచనాకొచ్చారు.

దేశవ్యాప్తంగానే కాదు, రాష్ట్రంలోనూ బీజేపీ గాలి వీస్తుండడంతో కాంగ్రెస్ నేతలు కూడా అటువైపే దృష్టి సారిస్తున్నారు. ఇదే సమయంలో దక్షిణాదిన కర్ణాటక తప్పించి మరే రాష్ట్రంలోనూ తమ ఉనికి లేని వేళ తెలంగాణలో పట్టు సాధించేందుకు వచ్చిన సువర్ణావకాశాన్ని వదులుకోకూడదన్న పట్టుదలతో బీజేపీ అగ్రనాయకత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీలోని బలమైన నేతలను చేర్చుకోవటం ద్వారా టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని వ్యూహ్యం పన్నుతోంది. పాలనాపరంగా కేసీఆర్ చేస్తున్న తప్పులు అంతకంతకూ ఎక్కువవుతున్నాయని, ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నదని, బలమైన పార్టీగా ఎదిగేందుకు ఇదే మంచి అవకాశమని బీజేపీ పెద్దలు సంబరపడుతున్నారు.

కోమటిరెడ్డి బ్రదర్స్, రేవంత్ రెడ్డి వంటి బలమైన ప్రజాకర్షక నేతలతోపాటు మరొకరో ఇద్దరో గట్టోళ్లను గుండుగుత్తగా పార్టీలోకి తీసుకోవాలని, బీజేపీని కొత్త రక్తంలో నింపాలని కేంద్ర నేతలు ఆలోచిస్తున్నారు. అదే జరిగితే? తెలంగాణలో కాంగ్రెస్ ఖతమైనట్లేనన్న మాట వినిపిస్తోంది. బెంగాల్లో కూడా ఇదే జరిగింది. అక్కడి టీఎంసీ పార్టీపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. దానిని సొమ్ము చేసుకునేంత బలంగా విపక్షం (సీపీఎం) లేదు. విపక్ష నేతలు, శ్రేణుల్లోమాత్రం అధికార పక్షంపై తీవ్ర వ్యతిరేకత ఉంది.

వీరందరినీ ముందుకు నడిపించాల్సిన నాయకత్వం చేష్టలుడిగి చూస్తోంది. ఈ తరుణంలో, విపక్షం (సీపీఎం) ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలంతా బీజేపీ వైపు వెళ్లారు. ఇప్పుడు అక్కడ శక్తివంతమైన పార్టీగా బీజేపీ ఎదిగింది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీని మట్టి కరిపించింది. బెంగాల్ రాజకీయాలనే తెలంగాణలో కూడా చూడబోతున్నామా? దీనిని దృష్టిలో ఉంచుకునే, కిషన్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.