విశాఖపట్నం, జూన్ 22 (న్యూస్‌టైమ్): రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి శనివారం ఉదయం ఆంధ్రవిశ్వవిద్యాలయానికి విచ్చేసారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య కె.నిరంజన్‌ మర్యాద పూర్వకంగా పుష్ప శ్రీవాణిని ఆహ్వానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వర్సిటీని సందర్శించాలని ఆహ్వానం అందించారు.

దీనికి ఉపముఖ్యమంత్రి స్పందిస్తూ తప్పకుండా వర్సిటీకి మరలా వస్తానని తెలిపారు. అనంతరం వర్సిటీ ఆచార్యులు, విద్యార్థులు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. విశ్వవిద్యాలయంలో తన జన్మదిన వేడుకలను జరుపుకోవడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ముందుగా ఏయూలోని బి.ఆర్‌ అంబేద్కర్‌, వై.ఎస్‌ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పుష్ప శ్రీవాణి పూలమాల వేసి అంజలి ఘటించారు. కార్యక్రమంలో అరకు శాసన సభ్యులు చెట్టి ఫల్గుణ తదితరులు పాల్గొన్నారు.