చిత్తూరు, జూన్ 23 (న్యూస్‌టైమ్): జిల్లా సమగ్రాభివృద్ధికి అందరి భాగస్వామ్యంతో ముందుకు సాగుదామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజు, వాణిజ్య పన్నుల శాఖా మంత్రి కె.నారాయణస్వామి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సమావేశపు మందిరంలో జిల్లా ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జెడ్పి చైర్‌పర్సన్ గీర్వాణి అధ్యక్షతన జరిగింది.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా మద్యపాన నిషేధానికి అందరూ కలసి కట్టుగా పని చేద్దామని, మద్యపాన నిషేధం మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కానుక అని తెలిపారు. ముఖ్యమంత్రి తనపై నమ్మకంతో ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అదృష్టం అని, తన శాయశక్తుల ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. జిల్లా సమగ్రాభివృద్ధికి అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళతామని తెలిపారు.

జిల్లాలో తాగునీటి సమస్య నివారణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఎక్కడ కానీ తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు చక్కగా వారి బాధ్యతలను నిర్వర్తించారని కితాబిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రజలు ఏకధాటిగా అత్యధిక మెజారిటీతో గెలిపించినందున వారికి మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన పాలనను అందించేందుకు కృషి చేస్తామని, రాబోయే ఐదేళ్లలో ప్రజలకు ఉపయోగకరమైన ప్రజాధరణ పొందే కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు.

పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న చోట ట్రాన్స్‌పోర్టేషన్, టై అప్ ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నామని, వర్షాలు పడే సమయం వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని కావున ఈ విపత్తును ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు.

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని, సిసి రోడ్‌లు ఇంకా కొన్ని చోట్ల వేయాల్సి ఉందని, వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో ఏ ఇబ్బంది ఉన్నా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని తద్వారా సమస్యల పరిష్కారానికి సత్వర పరిష్కారం చేపడతామని తెలిపారు.