• రాజంపేట డివిజన్‌లో ఎండిపోయిన పంటల పరిశీలిన

  • రమేష్‌నాయుడు నాయకత్వంలో ప్రతినిధిని బృందం పర్యటన

కడప, జూన్ 24 (న్యూస్‌టైమ్): వర్షాభావానికి తోడు, భూగర్భ జలాల లభ్యత లేక పంటలు ఎండిపోయి కడప జిల్లాలో కరువు రాజ్యమేలుతోందని భారతీయ జనతా పార్టీ అనుబంధ యువజన విభాగమైన బీజేవైఎం ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు ఎన్.రమేష్‌నాయుడు ఆందోళన వ్యక్తంచేశారు.

రాజంపేట డివిజన్‌లో నీళ్లు లేక ఎండిపోయిన నిమ్మ, మామిడి, అరటి తోటలను తమ పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి క్షేత్రస్థాయి పర్యటనలో పరిశీలించిన ఆయన పంటలు నష్టపోయిన ఉద్యాన రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రమేష్‌నాయుడు మాట్లాడుతూ రాజంపేట డివిజన్ పండ్ల తోటలకు ప్రసిద్ది చెందిన ప్రాంతమని, ఈ ప్రాంతంలో అరటి, బొప్పాయి, నిమ్మ, మామిడి తోటలను ఎక్కువగా సాగుచేస్తారని, అయితే, ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా వర్షాభావం, అవసరమైన సాగునీరు లభ్యతలేక రైతులు పంటలు కాపాడుకునే పరిస్థితి లేకుండాపోయిందన్నారు.

వేసిన పంటలను కాపాడుకునే లక్ష్యంతో బోర్లను అధికంగా వేసి రైతులు అప్పుల పాలయ్యారని, ఈ పండ్ల తోటలకు ఈ సారి అధికంగా రేట్లు ఉన్నపటికీ కరువు కారణంగా లక్షల రూపాయలు నష్టపోయారని, చివరకు 9 సంవత్సరాల వయసులో ఉన్న నిమ్మ, మామిడి, చెట్లు సైతం నిలువునా ఎండిపోతున్నాయని, వెంటనే ప్రభుత్వం కరువు అత్యవసర పరిస్థితి విధించాలని, 4, 5 విడతల రుణమాఫీ అమలుచేయాలని, బోర్లు వేసి నష్టపోయిన రైతులకు బీమా పరిహారాన్ని అందించి రైతులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవ చూపాలని రమేష్‌నాయుడు కోరారు.

ఈ సమస్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి తరఫున కేంద్ర వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లి కరువు బృందాలను రాష్ట్రానికి తీసుకవచ్చి నష్ట నివారణ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బి.జె.వై.ఎం. రాష్ట్ర కార్యదర్శి గుణవర్మ, రాజంపేట అసెంబ్లీ కన్వీనర్ పోతుగుంట రమేష్‌నాయుడు, కిసాన్ మోర్చా రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు లక్ష్మీనారాయణ చౌదరి, జయసింహారాజు, అబ్దుల్ సుభాన్, ఆదినారాయణ, రవిశంకర్, సాయి, గణేష్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.