మనిషికి దెయ్యం పడుతుందా? దెయ్యం పడితే అది భూత వైద్యుడి చికిత్సకు పారిపోతుందా? పూజలు చేస్తే పూనకం మటుమాయం అవుతుందా? శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో కూడా ఈ దెయ్యాలూ, భూతాలు ఉన్నాయా అనే కదా మీ డౌట్‌? కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలోని పొలతల శైవక్షేత్రానికి ప్రతి శివరాత్రికి భక్తులు పోటెత్తుతారు. సాంబశివ అన్నయ్య, బండెన్న అంటూ పరమ శివుని స్మరిస్తూ పూనకంతో ఊగిపోతారు.

అనేక ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో పొలతల క్షేత్రం కిటకిటలాడుతుంటుంది. హిస్టీరియా లాంటి మానసిక రోగులు చిన్నా పెద్దా ఆడ మగా తేడా లేకుండా ఇదిగో ఇలా.. పూనకంతో ఊగిపోతారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు తమకు దెయ్యం పట్టిందని మొదట కోనేటిలో మునుగుతారు. దుర్గంధం వెదజల్లే కోనేటి నీటిలో మునిగి తడి బట్టలతో శివాలయంలో సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండిపోతారు. అనంతరం సమీపంలో గల భూత వైద్యుల దగ్గరకు వెళతారు. వాయిద్యాల హోరు, శివుని గీతాలకు అనుగుణంగా భక్తులు ఊగిపోతూ నృత్యాలు చేస్తారు. భూతవైద్యులు దెయ్యం పట్టిందంటూ మహిళల జుట్లు పట్టి లాగడం, చిత్రహింసలకు గురిచేయడం ఇక్కడ మామూలే. భూత వైద్యులు పెట్టె చిత్రహింసలకు భక్తులు అలసిపోయి పడిపోతారు. దీంతో దెయ్యం వదలిందని భక్తులు భావిస్తుంటారు.

ఈ తతంగంలో భూతవైద్యులు అందినకాడికి దండుకోవడమే కాక, పూనకం వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. హిస్టీరియా లాంటి వ్యాధులతో బాధపడే మానసిక రోగుల జేబులు ఖాళీ అవడంతో పాటు ఒళ్లు గుళ్ల చేసుకుని వెళుతున్నారు. మూఢనమ్మకాల పట్ల ప్రజలను చైతన్యవంతం చేయకపోవడం వల్లే ఇలా జరుగుతోందని జనవిజ్ఞాన వేదిక అభిప్రాయపడుతోంది. కాగా, ప్రజలు మూఢ విశ్వాసాలు విడనాడాలని, ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని జనవిజ్ఞాన వేదిక నాయకులు అంటున్నారు.