• రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం

  • ముంబయిలో కొనసాగుతున్న భారీ వర్షాలు

  • ట్రాఫిక్ సమస్యలతో స్తంభించిన జనజీవనం

ముంబయి, జులై 1 (న్యూస్‌టైమ్): దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహా నగరం నీట మునిగింది. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వీధులు జలమయమయ్యాయి. సోమవారం కూడా ముంబయిలో వర్షాలు తెరిపివ్వలేదు. గత శుక్రవారం నుంచి ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో నగరంలోని అనేక చోట్ల అంధకారం అలముకుంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకూ ముంబయి, శివారు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉండటంతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంధేరీ సబ్‌వే ప్రాంతంలో నీరు నిలిచపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) స్పందించి యుద్ధప్రాతిపదికన పైపుల ద్వారా నీటిని తొలగిస్తోంది. కుర్లాలోని సీఎస్టీ రోడ్డు ప్రాంతాలు చిన్న నదులను తలపిస్తున్నాయి. రోడ్లమీదకు వరద ప్రవాహం వస్తుండటంతో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. మరోవైపు, ఈ వర్షం కారణంగా రైళ్లు సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. వరద ప్రవాహం ఎక్కువకావడంతో సియోన్‌ రైల్వేస్టేషన్‌-మతుంగ స్టేషన్‌ మధ్య పట్టాలపైకి నీరు చేరడంతో ఆ వైపుగా వెళ్లే రైళ్లను నిలిపివేశారు.

ముంబయి డివిజన్‌లోని పాల్ఘర్‌ ప్రాంతంలో వర్షం కారణంగా ముంబయి-అహ్మదాబాద్‌ వెళ్లే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను కూడా గంట పాటు ఆలస్యంగా నడిపారు. జామ్రంగ్‌‌- ఠాకూర్వాడీ మధ్య గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. దీంతో వైపు నడిచే 10 రైళ్లను రద్దు చేశారు. మరో నాలుగింటిని కల్యాణ్‌- ఇగాట్‌పురి వైపు మళ్లించారు. ముంబయి నుంచి పుణె వెళ్లే రైళ్లను సైతం ఇగాట్‌పురి వైపు దారి మళ్లించారు. మధ్య, పశ్చిమ, హార్బర్ మార్గంలో నడవాల్సిన లోకల్‌ రైళ్లు 15 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.