కాకినాడ: సుందరమైన నదీతీరం. ఒక పక్క బీచ్‌. మరోపక్క గోదావరి పాయలు. ఇంకో పక్క పాపికొండలు. మడ అడవులు. ప్రకృతే మైమరిచిపోయేంత అందమైన దృశ్యం. అలాంటి చోట పర్యాటక రంగం అభివృద్ధి చెందటానికి అవకాశం ఉన్నా ప్రభుత్వం, అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రజా ప్రతినిధులు హామీలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు పర్యాటకంగా కొదవేలేదు. సహజ సిద్ధమైన ప్రకృతి అందాలు ఎన్నో ఉన్నాయి.

కోనసీమ అందాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో జిల్లా అధికారులు, ప్రభుత్వం పూర్తిగా విఫలం అవుతున్నారనే విమర్శ ఉంది. కాకినాడ బీచ్‌లో రెండేళ్లుగా సాగర సంబరాలు నిర్వహిస్తున్నా మూడు రోజుల వేడుకలు తప్ప తర్వాత పట్టించుకునే నాధులే కరువయ్యారు. ఇక సముద్రం మధ్యలో ఉండే హాప్‌ ఐలాండ్‌ సంగతి అందరూ ఎప్పుడో మరచిపోయారు. కాకినాడకు ఆనుకుని ఉన్న కోరంగి మడ అడవులు, గోదావరి పాయలు సముద్రంలో కలిసే ప్రాంతం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడ విదేశీ పక్షులు విహరిస్తున్నా కనీసం పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనే రావడం లేదు.

కోనసీమ అందాలు చూపరులను అబ్బురపరుస్తాయి. ఈ ప్రాంతం సహజ సిద్ధంగా ఉండటంతో ఇప్పటికే ఎన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్‌లను జరుపుకున్నాయి. ఇక కోట్లు కురిపించే గోదావరి అందాలు, పాపికొండల వంపు సొంపులు పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉంది. కాని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నారు తప్ప ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. తూర్పు గోదావరి జిల్లాకు గత కేంద్ర ప్రభుత్వం ఐదు వందల కోట్లతో పర్యాటకంగా తీర్చి దిద్దుతామని హామీలు ఇచ్చింది. అయితే ఆ హామీలు మాటలకే పరిమితమయ్యాయి. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తే వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని స్థానికులు గుర్తుచేస్తున్నారు.

ఇంతటి పర్యాటక సంపద ఉన్న తూర్పు గోదావరి జిల్లాను అభివృద్ధి చేయకుండా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం విశాఖపట్నం నుండి చెన్నై వరకు 14 పోర్ట్‌లను కలుపుతూ సీ ప్లైన్లను ఏర్పాటు చేస్తామంటూ మళ్ళీ కొత్త హామీలను కురిపిస్తున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించుకునే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్భాటంగా వేడుకలు చేయడం కాకుండా కొందరికైనా ఉపాధి అవకాశం కలిగేలా ముందడుగు వేస్తే బాగుంటుందని తూర్పు గోదావరి జిల్లా వాసులు అంటున్నారు.