ROBERT POWELL Character(s): Jesus Christ Film 'JESUS OF NAZARETH' (1977) Directed By FRANCO ZEFFIRELLI 03 April 1977

ఆధ్యాత్మిక చింతనలేని మనిషి జీవితం వ్యవర్ధమన్నది అక్షరసత్యం. మతం, కులం, ఆరాధించే దైవం ఏదైనప్పటికీ ప్రతి ఒక్కరిలో దేవుని పట్ల ప్రేమానురాగం ఉంటుందన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో ఈరోజు మీ ‘గ్లోబల్ న్యూస్’ ఏసుక్రీస్తు గురించి, ఆయన మహిమల్ని గురించీ మరోమారు గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆదివారం వచ్చిందంటే చాలు ఏసు ఆరాధకులకు పండుగే. ఆయన భక్తులతో ప్రార్ధనామందిరాలన్నీ కిటకిటలాడుతుండడాన్ని చూస్తూనే ఉన్నాము. అందుకే అంటారు చరిత్రకారులు ఏసు ప్రేమ స్వరూపాన్ని గ్రహించకుండా ఉండటం ఎవరివల్లా కాలేదని.

అయితే, ఆ ప్రేమ ఒక్కొక్కరినీ ఒక్కో విధంగా ఆవహిస్తుంటుంది. కొన్ని సందర్భాలలో ప్రభువు ఆరాధకులను బలహీనంగా మార్చేసినపుడు భయం కూడా వేస్తుంటుంది. కొన్ని వేలమంది జనాభాలో అతికొద్దిమంది మాత్రమే ఆనాడు అతనిని అనుసరించారు. విన్నది అనేకమంది, అనుసరించి వచ్చినవారు కొందరే. అందుకే అతడు అన్నాడు.. ‘‘అతికొద్దిమంది మాత్రమే ఈ ఇరుకుదారిగుండా పోగలరు’’. అన్ని మహిమలు చూపిన తరువాత కూడా అతికొద్దిమంది మాత్రమే అతనిని నిజంగా గుర్తించి అనుసరించారు. వారేమీ జ్ఞానులు కాదు. సామాన్యమైన, అమాయక ప్రజలు.

బుద్ధిని దాటి ఆత్మను, జీవన మూలాన్ని చేరుకోవటానికి మానవులకు చేయగలిగిన సహాయమంతా చేశాడు యేసు. నేను ఫలానా అని ఏదో ఒకదానితో ముడిపెట్టుకుని ఉండే మీ సంకుచిత భావాన్ని ఛేదించి, మీలోని దైవత్వాన్ని గుర్తించండి, మీరు పైకి కనిపించే ఈ మనుష్యరూపంకంటే చాలా ఉన్నతమైనవారని గుర్తించండి. మీరు దైవంలో భాగం. దైవరాజ్యానికి మీరే వారసులు. ఆ రాజ్యం ఇక్కడే, మీలోపలే ఉంది అని బోధించాడు.

ఒక సందర్భంలో అతడు అంటాడు – ‘(ఇస్కరియేత్) యూదా అసలు పుట్టకపోయి ఉంటే బాగుండేది’. ఆ మాటలు కోపంతోనో, అసహనంతోనో వచ్చినవి కావు. చాలాసార్లు ప్రజలు తమకు ఎవరైనా నచ్చనప్పుడు వాళ్ళు పుట్టకుండా ఉంటే బాగుండేది అనటం మనం చూస్తాం. ఇక్కడ యేసు యూదా…. అతడు ఎప్పుడూ పుట్టకూడదని కోరుకుంటాను అంటున్నాడు. యూదా పడుతున్న బాధలను యేసు ఊహింపగలిగాడు. జగన్నాటకంలో యూదాకు ఒక పాత్ర ఇవ్వబడింది. దానిని అతడు పోషించాడు అంతే. అతడు పడుతున్న బాధను యేసు గ్రహించాడు. అతనిపట్ల యేసుకు గల అపారమైన కరుణకు తార్కాణం, అతడు పుట్టకపోయి ఉంటే బాగుండేది. యూదాపట్ల అతనికి గల అపరిమితమైన ప్రేమ అది.

చివరిలో ఒకచోట యేసు అంటాడు- ‘నేను ఇంకా నా తండ్రితో కలసిపోలేదు, ఇంటి ముంగిట నిలిచి ఉన్నాను. మీరు వెళ్ళి, నేను ఇంటికి చేరానని ప్రపంచానికి చెప్పండి. ఇంటికి రావాలని కోరుకునే వారందరికీ స్వాగతం పలకటానికి నేను ద్వారంవద్దనే వేచి ఉంటాను’. మీరు ప్రాణశక్తితో సజీవంగా లేకుంటే యేసు వాక్యాలను అర్థంచేసుకోలేరు. విన్న జ్ఞానం అంతా ఒక అభిప్రాయంగా, ఒక భావంగా మీ తలలో ఉంటుంది. కాని హృదయం మాత్రమే ఆ హృదయపు భావాన్ని గ్రహించగలదు. అలా కానపుడు యేసు పేరిట, దైవం పేరిట, మతం పేరిట ప్రజలు ఒకరినొకరు చంపుకుంటున్నారు. యుద్ధాలు జరిగాయి. శతాబ్దాల కాలంపాటు మనుషులు దేవుని పేరుతో పోట్లాడుకున్నారు. యేసు చెప్పిన మాటలకు అర్థం ఏమిటో వారికి అణుమాత్రం కూడా తెలియదు. అయితే ఇదంతా యేసు ముందే ఊహించాడు.

‘మిమ్మల్ని స్నేహితులుగా చూస్తాను, సేవకులుగా కాదు. ఎందుకంటే యజమాని ఏం చేస్తాడో సేవకులకు తెలియదు. నేను మీకు చెబుతాను, నా తండ్రి గురించి నేను విన్నదంతా మీతో పంచుకుంటాను’ అంటాడు యేసు. బోధించటానికి అతి చక్కని మార్గం ఇది. ప్రేమను పంచటానికి అతిచక్కని మార్గం ఇది. యజమాని పట్ల మీకు గౌరవం ఉంటుంది, కాని వ్యక్తిగతంగా ప్రేమ ఉండదు.

యేసు ఈరోజు వచ్చినా సరే, ప్రజలు ‘నీవు దేవుని కుమారుడవే అని నిరూపించుకో’ అంటారు. ఎందుకంటే బుద్ధి ఎప్పుడు సాక్ష్యాలపైనే ఆధారపడుతుంది. బుద్ధి యేసును అర్థంచేసుకోలేదు. కేవలం హృదయం మాత్రమే అతని ఉనికిని అనుభవించగలదు. మీరు నిజంగా యేసుతో ప్రేమలో ఉన్నపుడు, ప్రతీ పేరులోనూ, ప్రతీ ఆకారంలోనూ, ఈ భూమిపై, భూమికి ఆవల ఉన్న ప్రతీ ప్రదేశంలోనూ యేసును చూస్తారు. ఆ గురువు ఏ విలువలకు ప్రతినిధిగా నిలిచాడో ఆ విలువలలో జీవించండి. అలా జీవించినపుడు యేసు ఎప్పుడో గడచినకాలపు వ్యక్తిగా కాక, ఇప్పుడే, ఇక్కడే ఉంటాడు. భవిష్యత్తులో కూడా ఉంటాడు, ఎల్లప్పుడూ, ఎప్పటికీ ఉంటాడు.

యేసు (Jesus) (క్రీ.పూ 0 నుండి క్రీ.శ 26–36 వరకు) నజరేయుడైన యేసుగా కూడా పిలవబడే ఈయన పేరిట పౌలుచే అంతియొకయలో యేసు తన శిష్యలకు క్రైస్తవులు అనే పేరు పెట్టారు. ఈయన యేసుక్రీస్తుగా కూడా వ్యవహరించబడతాడు. క్రీస్తు అన్న పదం గ్రీకు భాషలో క్రీస్తోస్ (ఆభిషిక్తుడు)నుండి పుట్టింది. ఇది హీబ్రూలో మెసయ్యాకు సమానం.

యేసుక్రీస్తుపై విభిన్న క్రైస్తవ ధృక్కోణాల పాతనిబంధన గ్రంథం లేదా యూదు తోరాహ్లో వస్తాడని చెప్పిన మెసయ్య లేదా క్రీస్తు ఈయనే అని, ఈయన సిలువవేయబడిన తరువాత సమాధి నుండి లేచి వచ్చాడనే భావనలపై కేంద్రీకృతమై ఉన్నాయి. అధిక శాతం క్రైస్తవులు యేసుని, తమ పాప ప్రక్షాళన కోసం దేవునితో సమాధానపరుచుటకు పంపబడిన దేవుని కుమారుడిగా భావిస్తారు. త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మేక్రైస్తవులు యేసుని దైవ కుమారునిగా భావిస్తారు. యేసు దైవత్వం సంబంధంచిన గూఢార్థాల విద్యను క్రిస్టోలోజీ అని పిలుస్తారు. చరిత్రకారులు మానవ చరిత్రను యేసు క్రీస్తు జీవించిన కాలాన్ని కొలమానంగా తీసుకుంటారు. క్రీస్తు జన్మించక ముందు కాలాన్ని (B.C. – Before Christ-క్రీస్తుపూర్వం) అని, క్రీస్తుశకం అంటే క్రీస్తు జన్మించిన తర్వాత కాలాన్ని (A.D – Anno Domini, In the year of our lord) అని అంటారు.

యేసు జీవిత కాలం: యేసు జీవిత చరిత్ర నాలుగు సువార్తల్లో ఉందిగాని, యేసు క్రీస్తు పుట్టిన తేదీలేదు. పశ్చిమ దేశాలలోని క్రైస్తవులు అంతా క్రీస్తు జన్మదిన పండుగగా క్రిస్టమస్‌ను డిసెంబరు 25వ తేదీన ఆనయాయతీగా జరుపుకొంటున్నారు. రోమా క్రైస్తవులు సుమారు క్రీ.శ.330 నుండి అలా జరుపుకొంటున్నారు.

మత్తయి, మార్కు సువార్తలలో యేసు వంశ వృక్షాన్ని గురించి వివరించబడంది. మత్తయి సువార్తలో యేసు తండ్రయిన యోసేపు తన పితరుల గురించి వివరించబడింది; లూకా సువార్తలో యేసు తల్లిదండ్రుల ఇద్దరి వంశ వృక్షాలున్నాయి. యేసు వంశ మూలపురుషులు రాజైన దావీదు, అబ్రహాం.

Adoration of the Shepherds, Gerard van Honthorst, 17th c.
క్రీస్తు జన్మ గురించి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలోను, క్రీస్తు కాలంలో రాసిన కొత్త నిబంధనలోను పలు చోట్ల ప్రస్తావించబడింది. ముఖ్యంగా క్రీస్తుపూర్వం, అనగా 700 B.Cలో ప్రవక్త యోషయా 7:14 తన గ్రంథంలోని 7:14లో యేసు క్రీస్తు గురించి పరోక్షంగా ప్రవచించడం గమనార్హం. అలాగే యోషయా 53 వ అధ్యాయం కూడా యేసు ప్రభువు గురించి ప్రరోక్షంగా ప్రవచించడం విశేషం.

యోషయా మరణించిన 700 సంవత్సరాల తర్వాత ఏసు బెత్లహేం అను గ్రామంలో యోసేపు, దంపతులకు జన్మించడం జరిగింది. బైబిలు ప్రక్రారం కన్యక అయిన మరియకు స్వప్నంలో దేవదూత యేసు జన్మం గురించి మత్తయి, లూకా సువార్తలలో చెప్పడం జరిగింది. యేసు వడ్రంగి (మార్కు|6:3), వడ్రంగి వాని కుమారునిగా పిలువబడ్డాడు. (మత్తయి|13:55).

యేసు యోహాను ద్వారా బాప్తీస్మం పొందడం యేసు పరిచర్య ప్రారంభం. యోర్దాను నదిలో ప్రజలకు బాప్తీస్మమిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్న యోహాను యొద్దకు యేసు బాప్తీస్మం పొందడానికి వచ్చాడు. ‘తన యొద్దకు బాప్తీస్మము పొందడానికి వచ్చిన యేసును చూసిన యోహాను తనకు యేసునే బాప్తీస్మమిమ్మని అడిగితే , యేసు ఇప్పటికి నీతి నెరవేరునట్లుగా తనకు యోహానునే బాప్తీస్మమిమ్మని’ అడిగాడు. యేసు బాప్తీస్మము పొంది నీటి నుండి లేచినప్పుడు, ఆకాశం తెరుచుకొని, దేవుని ఆత్మ పావురం వలే దిగివచ్చింది. ‘ఇతడు నా ప్రియ కుమారుడు. ఇతని యందు నేనానందించుచున్నాను’ అని పరలోకం నుండి ఒక స్వరం వినబడిందని మత్తయి సువార్త 3లో కనిపిస్తుంది.

Sermon on the Mount, Carl Heinrich Bloch, 19th c.
యేసు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడని బైబిలు వాక్యాల్లో కనిపిస్తుంది.

యేసు క్రీస్తు శిలువయాగం గురించి బైబిలులో పలుచోట్ల ప్రవచించబడింది, ప్రస్తావించబడింది. మత్తయి సువార్త 16: 21 – 28, మత్తయి 20: 17 – 19, లూకా సువార్త 9:22, మార్కు సువార్త 9:30లో యేసు క్రీస్తు ప్రవచించడం కనిపిస్తుంది. యేసు క్రీస్తును ఇస్కరియేతు యూదా అను వ్యక్తి పిలాతు అను రాజుకు అప్పగించండం, యేసుక్రీస్తు శిలువయాగం ప్రస్తావన మత్తయి 26, 27, మార్కు 14, 15, యోహాను 18, 19 అధ్యాయాల్లో కనిపిస్తుంది.

పునరుద్ధానం అనగా క్రైస్తవ పరిభాషలో మరణించిన తర్వాత ఆత్మ రూపంలో తిరిగి లేవడం. పునరుత్థానాన్ని మరణంపై యేసు గెలిచిన విజయోత్సవంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగ జరుపుకుంటారు. కేధలిక్కులు, లూధరన్, బైబిలు మిషను వారు జరుపుకునే శిలువధ్యానాలు (Lent Days) భస్మ బుధవారం (Ash wednesday)తో ఆరంభమై ఈస్టర్ రోజుతో ముగిస్తుంది.

యేసు ఆజన్మ బ్రహ్మచారి (అవివాహితుడు) అని కొత్త నిబంధనలోని ఆయన జీవిత చరిత్ర తెలియజేస్తోంది.

ఈజిప్టు సమీపంలో ఉన్న నాగ హమ్మడి (Nag Hammadi) అనే పట్టణ పరిధిలో ఉన్న గుహల్లో కొన్ని ప్రతులు బయల్పడినాయి. వీటిని నాస్టిక్ గాస్పెల్స్ (Gnostic Gospels) అని అంటారు. ఇవి క్రీస్తు శరీరధారి కాదని, ఆత్మస్వరూపి గనుక శిలువ వేయబడలేదని చెబుతాయి. క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్న వీటిని చర్చివారు నిషేధించారు. అందులో క్రీస్తు మరణించిన సుమారు 300 – 400 సంవత్సరాల తర్వాత ఫిలిప్పు అనే వ్యక్తి రాసిన పత్రిక ఒకటి. ఈ పత్రికలో క్రీస్తు మగ్ధలేని మరియను ముద్దు పెట్టుకొన్నట్లుగా రాసి ఉంది. కాల క్రమేణా ఈ విషయాన్ని క్రైస్తవేతరులు పక్కత్రోవ పట్టించి క్రీస్తు వివాహం చేసుకున్నాడని అన్నారు.

ముద్దు పెట్టుకున్నంత మాత్రాన క్రీస్తు మగ్ధలేని మరియను వివాహం చేసుకున్నట్లు కాదని, ఒకవేళ వివాహం చేసుకొని ఉంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది (హెబ్రీయులు 13:4) అని చెప్పిన యేసుక్రీస్తు మగ్ధలేని మరియను భార్యగా ఒక్కసారైనా సమాజానికి పరిచయం చేసి ఉండేవాడని, మగ్ధలేని మరియ నిజంగా క్రీస్తు భార్య అయి ఉంటే ఫిలిప్పు రాసిన పత్రికలో క్రీస్తును తన శిష్యులు ఆమెను మాకంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని అడగరని, యోకోబు రెండవ ప్రకటనలో ఏసుక్రీస్తు యోకోబును ముద్దు పెట్టుకొన్నట్లుగా ఉందని కనుక మగ్ధలేని మరియను ఏసుక్రీస్తు వివాహమాడినట్లు సాక్ష్యం లేదని గ్రంథ పండితుల వాదన.

ఇక, యేసు ప్రభువు ఇండియా వచ్చాడు, ఇక్కడి పండితుల దగ్గర జ్ఞాన బోద పొందిన తర్వాతనే క్రీస్తుగా మారి యూదులకు ప్రభువు అయ్యాడు అని కొందరు కహనీలు చెపుతుంటే, మరి కొందరేమో ఏసు క్రీస్తు అంటే సాక్షాత్తు ఈశ్వరుని ప్రతిరూపమేనని, కాబట్టి క్రిస్టియన్ మతానికి మూలం భారతదేశంలోని వేదాలలోనే ఉందని, కాబట్టి హిందువులు క్రిస్టియన్‌లుగా మారడం అంటే తమ మూల మతంలోకి వచ్చేయడం తప్ప వేరు కాదని, మోకాలికి బట్ట తలకు ముడి వేసే జిమ్మిక్కు కథలు డంఖా బజాయించి చెపుతుంటే, మెజార్టీ ప్రజలు అయిన హిందువులు వారు చేస్తున్న గిమ్మిక్ కథలతో కూడిన ప్రలోబాల వలన హిందూ జాతికి భవిష్యత్‌లో కలిగే నష్టాలను ఏ మాత్రం పట్టిచుకోకుండా ఉదాసినంగా ఉండడం చాలా ప్రమాదకరమైన ధోరణి. బహూశా హిందువులలో ఇలాంటి ఉదాసిన ధోరణి గమనించే కాబోలు బ్రదర్ అనిల్ లాంటి మత మార్పిడిదారులు, ఇండియాలో 1950 నాటికి క్రిస్టియన్ మతస్తులు 50% పైగా ఉంటారు అని చెపుతుంది.

అసలు ఏసుక్రీస్తు చరిత్ర పరిసిలిస్తే అయన ఇండియా వచ్చిన దాఖాలాలు లేవు. అసలు ఆయనకు భారతదేశం గురించి తెలుసో తెలియదో? అయన జీవిత చరిత్రలో 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అంటే సుమారు 18 ఏళ్ల పాటు ఏమి చేసాడో , ఎక్కడున్నాడో, అయన గురించి చెప్పిన New Testamentలో పేర్కొనలేదట. దానిని సాకుగా తీసుకుని కొంతమంది ఈ కాలంలోనే యేసు ఇండియాకి వచ్చి పండితుల దగ్గర జ్ఞాన బోద పొందాడని కహనీలు అల్లేసారు. వీరికి ఇలాంటి కట్టుకథలు సృష్టించడంలో అసలు ఉద్దేశ్యం, క్రీస్తు మతంలోకి చేరడానికి ఇబ్బంది పడే సాంప్రాదాయ హిందువులకి, క్రీస్తు కూడా హిందు పండితుల శిష్యుడే అని చెప్పితే మత సంకరం సులువు అయిపోతుందని.

అలాగే ఇంకొంతమంది సంకర పండితులు మరోకరకమైన కహాని చెపుతున్నారు. యేసును శిలువ వేసాక అయన దాని మీదే 2 రోజులు ఉండి మరలా 3వ రోజున లేచి, అక్కడ నుండి బయలుదేరి ఇండియా వచ్చాడని, కశ్మీర్‌లో తన దివ్య అవతారం చాలించాడని, అక్కడే సమాధి కాబడ్డాడని గ్రంథాలు రాస్తే, చెవిలో పువ్వులు పెట్టుకుని చదువుతూ తన్మాయనందమ్ చెందుతున్నారు మతం మారిన హిందువులు కొందరు. మరి ఇలాంటి కథలు సృష్టించడానికి కారణం ఉండాలి కదా? ఉంది మరి!

హిందూ దేవుళ్ళు అందరూ సినిమాల్లో హీరోలు వలే రాక్షసులను సంహరించి వీరత్వం ప్రదర్శించిన వారు. వీరికి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ తప్ప, దుర్మార్గుల చేతిలో దిక్కు లేని చావు చావడమంటే ఏమిటో తెలియదు. మరి వారిని అరాధిస్తున్న హిందువులలో, ఎన్ని డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టినా, దుర్మార్గుల చేతిలో చంపబడిన వారిని దేవుడు అని అంగీకరించ లేని పరిస్తితి. కాబట్టి పై కథను సృష్టించడం ద్వారా ఏసుక్రీస్తు శిలువపై మరణించలేదని, 3 రోజుల తర్వాత లేచి ఇండియాకే వచ్చి, కశ్మీర్‌లో స్తిరపడి ఇండియన్ గాడ్‌గా మారాడని చెప్పడం వెనుకాల ఉన్న దురుద్దేశ్యం కావచ్చు.

బైబిల్‌లో ఉన్న చరిత్ర ప్రకారం అయినా మనకు అర్దం అయ్యేది ఒకటే. ఏసుప్రభువు దేవుడు కాడు. అతడు దేవుని కుమారుడు. తను నమ్మిన సిద్దాంతాన్ని ప్రజలకు ఎరుకపరచాడు. అది కొంత మంది అప్పటి సాంప్రదాయవాదులకు నచ్చక రాజులకు ఫిర్యాదు చేసి, వారి ద్వారా ఈయనని మరికొంతమందిని కలిపి శిలువ వేయించారు. అయన మౌనంగా అ బాధను భరిస్తూ కరుణామయుడిగా మిగిలిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే మన భాగవతంలోని ప్రహ్లాదుడుకి ఈయనకి పోలికలు ఉన్నాయి. ప్రహ్లాదుడు అంతే కదా! తను నమ్మిన సిద్దాంతాన్ని అందరికీ చెప్పేవాడు. ఇది తండ్రి అభీష్టానికి విరుద్దమైనది అని తెలిసి కూడా వెరువలేదు. చివరకు తండ్రి చేతిలోనే నానా బాధలు పడినా, నమ్మిన దేవున్ని, ఇందుగలడు అందులేడను సందేహం వలదు అన్న సత్యాన్ని నిరంతరం ప్రబోదిస్తూ, చివరకు దానిని రుజువు చేసాడు. కాక పోతే ఏసు ప్రభువుకి, భక్త ప్రహ్లాదుడికి తేడా ఏమిటంటే, తన భక్తుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అయన కొలిచే విష్ణుమూర్తి నిరంతరం కాపాడుతూ, చివరకు నరసింహావతారంలో వచ్చి బాధలు పెట్టే తండ్రి రాక్షసుడిని సంహరించి భక్తుడిని కాపాడితే, దేవుడు కుమారుడు ఏసును రక్షించడానికి ఏ దేవుడు రాలేదు కాబట్టి అయన సిలువ అయ్యాడు. అదీ తేడా! మిగిలిందంతా నూటికి నూరు పాళ్ళూ కల్పితమే!

ఇంకొంత మంది అయితే ఏసు ప్రభువు అవివాహితుడు కాదని, అయన మేరీ మగ్దలీనా అనే ఆవిడను వివాహమాడాడు అని గ్రంధాలే రాసారు. ఈ కథలు నమ్ముతూ పోతే, ఏసు ప్రభువు ఇండియా వచ్చాడు మేరి మగ్దలీనాను వివాహం చేసుకున్నాడు, వారి సంతానమే ఇండియాలో క్రిస్టియన్‌లంతా అని చెప్పినా చెవిలో పువ్వులు పెట్టుకుని వినాల్సి వస్తుంది.

ఏసు ప్రభువు దేవుని నమ్మిన వాడు. ఎవరేమి చేసినా తానూ నమ్మ్మిన సిద్దాంతాన్ని ప్రవచించిన మహనీయుడు. శిలువ వేస్తున్న చలించని ధీరుడు. తనను శిక్షించే వారిని కూడా క్షమింపుము అని దేవున్ని వేడుకున్న కరుణామయుడు. అయన చెప్పిన మాటల్లో చాలా మంది దైవారాధకులకు నచ్చిన మాటలు ఇవి…

‘‘ప్రజలారా, నా కోసం ఏడ్వకండి. మీ కోసం మీ బిడ్డలు కోసం పాటుపడండి’’ అనే విలువైన అయన అంతిమ సందేశాన్ని అర్దం చేసుకోకుండా, అయన పేరుతో ఖండాతరాలు దాటి మత మార్పిళ్లు చేయడం, వేదికలు ఎక్కి ఎగిరెగిరి దూకుతూ, అర్దం కాని బోధలు చేస్తూ జనాల్ని పిచ్చోళ్ళు చేయడం చూస్తుంటే, ఇండియాలో ఏసు ప్రభువు పేరు మీద ఎలాంటి ఘోర కృత్యాలు చేస్తున్నారో అర్దమవుతుంది. ఎవరైతే సన్మార్గంలో నడుస్తూ, తన కోసం తన కుటుంబం కోసం పాటుపడుతూ ఉన్నారో వారంతా ఏసు మార్గాన్ని అనుసరిస్తున్నట్లే లెక్క. అటువంటి వారే ఏసు ప్రభువుకు ప్రియమైన వారు. ఎవరి కుటుంబాన్ని వారు అభివృద్ధి చేసుకుంటే, అది దేశాభివ్రుద్దిలో భాగమే కాబట్టి ఇంతకంటే దేశం కోసం పాటు పడాల్సింది మాత్రం ఎముంటుంది? కాబట్టి కుటుంబం పట్ల నీ కనీస కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు! పలితం పై వాడికి వదిలేయి! సర్వదా సుఖపడుదువు గాక!

మతం ముసుగులో మారణహోమానికి కంకణం కట్టుకునే ప్రభుద్ధులు ఉన్న ఈ నేలపై నిజంగా ఏసుప్రభువో లేక ఏ ఇతర మతానికి చెందిన దేవుడో దిగొచ్చినా పరిస్థితిలో ఇంతకంటే భిన్నంగా ఏమీ ఉండవన్నది నిజం.