హైదరాబాద్, జులై 8 (న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ మండలం ముశిపల్లి గ్రామంలో గీత కార్మికుడు లింగాల వెంకన్న గౌడ్ తాటిచెట్టుపై కొంతమంది దుండగులు పెట్రోల్ పోసి అంటించిన ప్రమాదంలో తీవ్ర గాయాలై మరణించిన లింగాల వెంకన్న గౌడ్ కుటుంబాన్ని రాష్ట్ర అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సచివాలయంలో తన కార్యాలయానికి పిలిపించి వారితో జరిగిన సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు. గీత కార్మికుడు లింగాల వెంకన్న గౌడ్‌పై జరిగిన దారుణ సంఘటనపై మంత్రి తక్షణం స్పందించారు.

అబ్కారీ శాఖ ఉన్నతాధికారులతో చర్చించి ప్రమాదంలో మరణించిన వెంకన్న కుటుంబానికి తక్షణం 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను మంజూరు చేసారు. ఆ మొత్తాన్ని వెంటనే అందించాలని కోరారు. ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబ పెద్దను కోల్పోయి జీవనాదారం కోల్పోయిన వెంకన్నగౌడ్ భార్యకు అబ్కారీ శాఖ తరుపున తెలంగాణ రాష్ట్ర బేవరేజస్ కార్పోరేషన్‌లో అవుట్ సోర్సింగ్ ద్వారా ఉపాధి కల్పించాలని అధికారులను కోరారు. వీటితో పాటు వెంకన్నగౌడ్ కూతురు, కుమారుడికి బీసీ గురుకులంలో చదువుకునేందుకు అవకాశం కల్పించాలని సంబంధించిన అధికారులను కోరారు.

దారుణ సంఘటనలో మరణించిన లింగాల వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు. లింగాల వెంకన్న ఉన్న గీత కార్మిక సోసైటీ గుర్తింపు కార్డును వెంకన్న భార్య భాగ్యమ్మకు మార్పిడి చేయాలని అబ్కారీ శాఖ అధికారులను కోరారు. తాటి చెట్లను పెట్రోల్ పోసి తగల బెట్టి ప్రమాదానికి గురిచేసిన వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా అబ్కారీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. అబ్కారీ శాఖ అనుమతులు లేకుండా ఎవరైన తాటిచెట్లను తగలబెట్టిన, నరికి వెసిన వారిపై తక్షణం చర్యలు చేపట్టాలని మంత్రి అబ్కారీ శాఖ అధికారులను ఈ సందర్భంగా అదేశించారు.